3 లక్షలిచ్చి కాంప్రమైజ్ అవ్వండి

3 లక్షలిచ్చి కాంప్రమైజ్ అవ్వండి
  •     పోకిరీలకు ఉప్పల్ ఎస్సై సపోర్ట్
  •     డీసీపీ ఆఫీసు​కు అటాచ్​ చేసిన ఉన్నతాధికారులు

ఉప్పల్, వెలుగు : నిందితులు అడిగిన డబ్బు ఇచ్చి కాంప్రమైజ్ కావాలని ఫిర్యాదుదారులకు సూచించారనే అభియోగంతో ఉప్పల్ ఎస్ఐ శంకర్ ను ఉన్నతాధికారులు డీసీపీ ఆఫీస్​కు అటాచ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల14న అర్ధరాత్రి ఉప్పల్ బగాయత్‌‌లో ఓ ప్రేమ జంట కారులో ఉండగా.. పీర్జాదిగూడకు చెందిన అమరేందర్, మారుతి, ఉదయ్, రామ్ చరణ్, శశివలీ అనే ఐదుగురు మద్యం మత్తులో వారి దగ్గరకు వెళ్లారు. కారులోని యువకుడిని, యువతిని అనుమతి లేకుండా ఫొటోలు, వీడియోలు తీశారు.

వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయకుండా ఉండేందుకు రూ.3 లక్షలు ఇవ్వాలని బెదిరించారు. దాంతో యువకుడు వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేయొద్దని.. నిందితుల వద్ద ఉన్న ఫొటోలు, వీడియోలను డిలీట్​ చేయించాలని కోరాడు. అయితే, నిందితులు డిమాండ్ చేసిన డబ్బు ఇచ్చి కాంప్రమైజ్ కావాలని ఎస్సై శంకర్ ఫిర్యాదుదారుడికి సూచించాడు. తనకు న్యాయం చేయాలని కోరుతూ పోలీస్​స్టేషన్​కు వెళ్తే..

తమను వేధించిన పోకిరీలకు ఎస్సై సపోర్ట్ చేశాడని బాధితులు ఉన్నతధికారులకు ఫిర్యాదు చేశారు. ఎంక్వైరీ చేసిన అధికారులు ఎస్సై శంకర్ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు నిర్ధారించారు. ఆయనను ఉప్పల్ నుంచి తొలగించి డీసీపీ ఆఫీసుకు అటాచ్ చేశారు.