
- మొదటి స్థానంలో మారుతి సుజుకీ
న్యూఢిల్లీ: మనదేశం నుండి కిందటి ఫైనాన్షియల్ ఇయర్ లో కార్ల ఎగుమతులు 43 శాతం పెరిగాయి. మారుతి సుజుకి ఇండియా 2.3 లక్షల యూనిట్లకు పైగా డిస్పాచ్‌లతో మొదటిస్థానంలో ఉంది. మొత్తం ప్యాసింజర్ వెహికల్స్ ఎగుమతులు 2020–-21లో 4,04,397 యూనిట్లు కాగా, 2021–-22 ఫైనాన్షియల్ ఇయర్లో 5,77,875 యూనిట్లకు పెరిగాయి. ప్యాసింజర్ కార్ షిప్‌మెంట్లు 42 శాతం గ్రోత్తో 3,74,986 యూనిట్లకు చేరుకోగా, యుటిలిటీ వెహికల్స్ ఎగుమతులు 46 శాతం పెరిగి 2,01,036 యూనిట్లకు చేరుకున్నాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) వెల్లడించింది. వ్యాన్‌ల ఎగుమతులు 2020–-21 ఫైనాన్షియల్ ఇయర్లో 1,648 యూనిట్ల నుంచి 2021–-22 ఫైనాన్షియల్ ఇయర్లో 1,853 యూనిట్లకు పెరిగాయి.
2,35,670 పీవీలను అమ్మిన మారుతి సుజుకీ
ఎగుమతుల పరంగా 2022 ఫైనాన్షియల్ ఇయర్లో మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్ఐ) మొదటిస్థానంలో, హ్యుందాయ్ మోటార్ ఇండియా కియా ఇండియా వరుసగా రెండు, మూడవ స్థానాల్లో నిలిచాయి. దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన ఎంఎస్ఐ, 2021–2022 ఫైనాన్షియల్ ఇయర్లో 2,35,670 పీవీలను ఎగుమతి చేసింది. ఇది 2020–-21 ఫైనాన్షియల్ ఇయర్లో 94,938 యూనిట్లను అమ్మింది. అంటే అమ్మకాలు రెండు రెట్లు పెరిగాయి. ఎంఎస్ఐ పీవీల ఎగుమతులు ఎక్కువగా లాటిన్ అమెరికా, ఆసియాన్, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ దేశాలకు వెళ్లాయి. బాలెనో, డిజైర్, స్విఫ్ట్, ఎస్-ప్రెస్సో బ్రెజ్జాలను అత్యధికంగా అమ్మింది.
రెండోస్థానంలో హ్యుందాయ్
హ్యుందాయ్ మోటార్ ఇండియా ఫారిన్ డిస్పాచ్‌లు పోయిన ఫైనాన్షియల్ ఇయర్లో 1,29,260 యూనిట్లుగా ఉన్నాయి. ఇది 2020–-21లో మొత్తం 1,04,342 యూనిట్లను అమ్మింది. కియా ఇండియా 50,864 యూనిట్లను ఎగుమతి చేసింది. 2020–-21లో 40,458 యూనిట్లను ఎగుమతి చేసింది. ఫోక్స్‌వ్యాగన్ 2022 ఫైనాన్షియల్ ఇయర్లో 43,033 యూనిట్లను ఎగుమతి చేయగా, 2021 ఫైనాన్షియల్ ఇయర్లో 31,089 యూనిట్లను ఎగుమతి చేసింది. రెనాల్ట్ ఇండియా 24,117 యూనిట్లను ఎగుమతి చేసింది.