బండి తీసిండో లేదో..  ఎమర్జెన్సీ వార్డులో ఆపిండు

బండి తీసిండో లేదో..  ఎమర్జెన్సీ వార్డులో ఆపిండు
  • సోయితప్పి పడిపోయిన తాతను బైక్ మీద ఆస్పత్రికి చేర్చిన మనవడు
  • అచ్చం 3 ఇడియట్స్ సినిమాలోని సీన్​ను తలపించిన ఘటన

భోపాల్: అస్వస్థతకు గురైన తాతకు ఊపిరాడలేదు. సోయితప్పి కిందపడిపోయాడు. దీంతో అలర్ట్ అయిన ఆయన మనవడు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. తన బైక్​ మీదే ఆస్పత్రికి తీస్కెళ్లాలనుకున్నాడు. బండి తీసిండో లేదో తాతను వెనక కూర్చోబెట్టుకున్నాడు. పెద్దాయనను పట్టుకునేందుకు మరో వ్యక్తిని ఎక్కించుకున్నాడు. అదే స్పీడ్​లో వెళ్లి ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డులో బైక్ ఆపాడు. అచ్చం 3 ఇడియట్స్ సినిమాలో షర్మాన్ జోషి ఫాదర్​ను ఆమీర్ ఖాన్ ఆస్పత్రికి తీస్కెళ్లిన సీన్​ను తలపించిన ఈ ఘటన మధ్యప్రదేశ్​లోని సత్నా జిల్లాలో జరిగింది.

పెద్దాయన్ కండీషన్ సీరియస్​గా ఉండటంతో.. 

సత్నా జిల్లాకు చెందిన నీరజ్ గుప్తా తాత శనివారం అర్ధరాత్రి అస్వస్థతకు గురయ్యాడు. దీంతో నీరజ్ మరొకరితో కలిసి బైక్ మీద తాతను ఎక్కించుకుని ఆస్పత్రికి చేరుకున్నాడు. వీళ్లు సీదా ఆస్పత్రి లోపలికి బండి మీదే వెళ్తుండటం చూసి సెక్యూరిటీ సిబ్బంది వెంబడించారు. నీరజ్ మాత్రం సక్కగ ఎమర్జెన్సీ వార్డు లోపలిదాకా వెళ్లి బైక్ ఆపాడు. తాతను స్ట్రెచర్ మీద పడుకోబెట్టాడు. అనంతరం బండి ఆస్పత్రి బయట పార్క్ చేశాడు. దీన్నింతా అక్కడున్నవాళ్లు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. తాత సీరియస్ కండీషన్​ సీరియస్‌గా ఉండటంతోనే అలా చేశానని నీరజ్ చెప్తున్నాడు. ఇలా చేసినందుకు డాక్టర్ మందలించినా.. తాత సేఫ్​గా ఉన్నందుకు హ్యాపీగా ఉందని అంటున్నాడు.