చాముండేశ్వరి సెగ్మెంట్ నుంచి మళ్లీ పోటీ చేయను

చాముండేశ్వరి సెగ్మెంట్ నుంచి మళ్లీ  పోటీ చేయను

2023 అసెంబ్లీ ఎన్నికలే తనకు చివరి ఎన్నికలని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య  అన్నారు. అంతేకాకుండా 2018లో ఓటమిని చవిచూసిన చాముండేశ్వరి సెగ్మెంట్ నుంచి తాను మళ్లీ  పోటీ చేయనని చెప్పారు.  తాను రాజ్యసభతో సహా ఏ పదవిని స్వీకరించబోనని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ  చేయడానికి కూడా కారణం ఉందని అన్నారు. ప్రస్తుతం ఉన్న అవినీతి, మతతత్వ ప్రభుత్వం పోవాలని, అందుకే పోటీ చేస్తున్నట్లుగా  సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు.  చాముండేశ్వరిలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.  

2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధరామయ్య  చాముండేశ్వరి, బాదామి  నియోజకవర్గాలలో పోటీ చేశారు. అయితే అందులో చాముండేశ్వరి నుంచి జేడీ(ఎస్)  అభ్యర్ధి జీటీ దేవెగౌడ చేతిలో 36,042 ఓట్ల తేడాతో ఓడిపోయారు. బాదామిలో కేవలం 1,696 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి శ్రీరాములు పై గెలిచారు. 1983లో చాముండేశ్వరి నుంచి లోక్‌దళ్ పార్టీ టికెట్‌పై ఎన్నికై, అసెంబ్లీలోకి అడుగుపెట్టిన సిద్ధరామయ్య ..  ఈ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు గెలవగా మూడుసార్లు ఓడిపోయారు.

ఇవే చివరి ఎన్నికలని సిద్ధరామయ్య  చెప్పడం కొత్తేమీ కాదు.  2013 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఇదే తన చివరి ఎన్నికలని చెప్పారాయన.  కానీ ఆ  ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో  ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ఆయన  ఇవే తనకు చివరి ఎన్నికలని పలుసభల్లో చెప్పారు.