వైద్య అధికారులు విధులు సక్రమంగా నిర్వహించకుంటే చర్యలు : కలెక్టర్ కె.హైమావతి

వైద్య అధికారులు విధులు సక్రమంగా నిర్వహించకుంటే చర్యలు : కలెక్టర్ కె.హైమావతి

సిద్దిపేట రూరల్, వెలుగు: విధులు సక్రమంగా నిర్వహించకుంటే కఠిన చర్యలు తప్పవని, రెగ్యులర్ గా విధులకు హాజరుకాకుండా టూర్ వెళ్తున్నట్లుగా రిజిస్టర్ లో రాస్తున్న మెడికల్ ఆఫీసర్, ఎచ్ఈల పై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె.హైమావతి డీఎంహెచ్​వో ధనరాజ్ ను ఫోన్ ద్వారా ఆదేశించారు. మంగళవారం నారాయణరావుపేట ప్రైమరీ హెల్త్ సెంటర్ ను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి, రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు. 

పీహెచ్​సీలో మేజర్, మైనర్ రిపేర్లు చేస్తున్నందున పక్కన ఉన్న ఆయూష్ కేంద్రంలో ఆస్పత్రి సేవలు అందిస్తున్నామని సిబ్బంది కలెక్టర్ కి తెలిపారు. అటెండెన్స్ రిజిస్టర్ చెక్ చేస్తూ సంతకాలు చేసినా ఆస్పత్రిలో లేరని ఆరా తీయగా, మెడికల్ ఆఫీసర్ బాపురెడ్డి 12 గంటలకు, హెచ్ఈ పాండు రంగాచారి 12.30 గంటలకు వెళ్లారని, హెచ్ఎస్ లు సునీత లక్ష్మీదేవిపల్లి, సుధారాణి రాఘవపూర్ లో ఫీల్డ్ విసిట్ వెళ్లారని సిబ్బంది కలెక్టర్ కి తెలుపగా, మెడికల్ ఆఫీసర్, హెచ్ఈ రెగ్యులర్ గా వస్తున్నారా ఆరా తీసి, ఓపీ, మూవ్​మెంట్ రిజిస్టర్ ను వెరిఫై చేసి నెలలో ఎక్కువ రోజులు టూర్ వెళ్తున్నట్లుగా రిజిస్టర్ రాస్తూ విధులకు రాకుండా ఉండడాన్ని గ్రహించి వారిపై చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్​వోను ఆదేశించారు. అనంతరం నంగునూర్ మండలం పాలమాకులలో ఉన్న జడ్పీహెచ్ఎస్ స్కూల్ ను కలెక్టర్ సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి మధ్యాహ్న భోజనంపై ఆరా తీశారు. 

పొద్దు తిరుగుడుకు వంద శాతం సబ్సిడీ

హుస్నాబాద్/ అక్కన్నపేట : పొద్దు తిరుగుడు విత్తనాలకు ప్రభుత్వం 100శాతం సబ్సిడీ అందిస్తుందని కలెక్టర్ హైమావతి తెలిపారు. నూనె గింజల సాగును ప్రోత్సహించే లక్ష్యంతో జాతీయ నూనె గింజల పథకం కింద మంగళవారం అక్కన్న పేట రైతు వేదికలో పొద్దుతిరుగుడు విత్తనాల పంపిణీ చేపట్టారు. కార్యక్రమానికి కలెక్టర్​ హాజరై 253 మంది రైతులకు 500 ఎకరాల్లో సాగు చేసుకునేందుకు విత్తనాలను పంపిణీ చేశారు. 

పంట సాగులో ఏవైనా సందేహాలు ఉంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ప్రతినిధులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ కే. లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం అక్కన్నపేట మండలం అంతక్కపేటలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్​ పరిశీలించారు.