ప్రాణాల మీదికి తెచ్చిన వరద.. వాగులో కొట్టుకుపోయిన కొత్త జంట

ప్రాణాల మీదికి తెచ్చిన వరద.. వాగులో కొట్టుకుపోయిన కొత్త జంట
  • వేర్వేరు చోట్ల ముగ్గురు మృతి, ముగ్గురు గల్లంతు
  • మరో ముగ్గురిని కాపాడిన స్థానికులు, పోలీసులు

మొంథా తుఫాన్‌‌‌‌‌‌‌‌ కారణంగా భారీ వర్షాలు పడి వాగులు, వంకలు పొంగిపొర్లు తున్నాయి. ఈ క్రమంలో రోడ్లపై నుంచి వరద పారుతుండడంతో దానిని దాటేందుకు యత్నించిన పలువురు చనిపోగా.. మరికొందరు గల్లంతయ్యారు. నీటి ప్రవాహంలో చిక్కుకున్న మరికొందరిని పోలీసులు, స్థానికులు రక్షించారు.

భీమదేవరపల్లి, వెలుగు : వాగు దాటేందుకు యత్నించిన దంపతులు నీటిలో కొట్టుకుపోయారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో బుధవారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళ్తే..హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ఇసంపల్లికి చెందిన ప్రణయ్, కల్పన దంపతులు. బుధవారం కల్పన పుట్టిన రోజు కావడంతో ఇద్దరూ కలిసి బైక్‌‌‌‌‌‌‌‌పై అక్కన్నపేటకు బయలుదేరారు. 

మల్లారం వద్ద రోడ్డు తెగిపోవడంతో మోత్కులపల్లి గుండా వెళ్తున్నారు. ఈ క్రమంలో మోత్కులపల్లె వద్ద వాగు దాటుతుండగా నీటి ప్రవాహం పెరగడంతో బైక్‌‌‌‌‌‌‌‌ అదుపుతప్పి నీటిలో పడిపోయారు. ఉదయం అటువైపు వెళ్లిన రైతులకు బైక్‌‌‌‌‌‌‌‌ కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. రెస్క్యూ టీమ్స్‌‌‌‌‌‌‌‌ ఘటనాస్థలానికి చేరుకొని గల్లంతైన దంపతుల కోసం గాలిస్తున్నారు. 

యువతి గల్లంతు.. బయటపడ్డ యువకుడు

జనగామ/వర్ధన్నపేట, వెలుగు : వరంగల్‌‌‌‌‌‌‌‌ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేటకు చెందిన బక్క పూర్ణ, అలీసాబ్‌‌‌‌‌‌‌‌ దంపతులు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఉంటున్నారు. వారి రెండో కూతురు శ్రావ్య (19) వరంగల్‌‌‌‌‌‌‌‌లోని ఓ హాస్టల్‌‌‌‌‌‌‌‌లో ఉంటూ హనుమకొండ బొల్లికుంటలోని ఓ ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌ కాలేజీలో చదువుతోంది. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని మేడిపల్లికి చెందిన శ్రావ్య బంధువైన బరిగెల శివకుమార్‌‌‌‌‌‌‌‌ బుధవారం హాస్టల్‌‌‌‌‌‌‌‌కు వచ్చి బైక్‌‌‌‌‌‌‌‌పై శ్రావ్యను ఎక్కించుకొని జఫర్‌‌‌‌‌‌‌‌గడ్‌‌‌‌‌‌‌‌ రూట్‌‌‌‌‌‌‌‌లోని కోనాయిచలంలో ఉన్న ఫ్రెండ్‌‌‌‌‌‌‌‌ ఇంటికి బయలుదేరారు. 

శంకర్‌‌‌‌‌‌‌‌ తండా సమీపంలోని బోళ్ల మత్తడి వాగు ఉధృతంగా పారుతుండడంతో నీటి ప్రవాహానికి బైక్‌‌‌‌‌‌‌‌ అదుపుతప్పి ఇద్దరూ కొట్టుకుపోయారు. శివకుమార్​చెట్టు కొమ్మ సహాయంతో ఈదుకుంటూ బయటపడగా శ్రావ్య గల్లంతైంది. విషయం తెలుసుకున్న పోలీసులు గురువారం ఉదయం ఘటనాస్థలానికి చేరుకొని గాలింపు చేపట్టారు. 

నీటిలో కొట్టుకుపోయి ముగ్గురు మృతి

భీమదేవరపల్లి/నాగర్‌‌‌‌‌‌‌‌కర్నూల్‌‌‌‌‌‌‌‌/ఖిలావరంగల్‌‌‌‌‌‌‌‌, వెలుగు : భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన అప్పని నాగేంద్రం (52) ఓ ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. బుధవారం సాయంత్రం డ్యూటీ ముగించుకొని ఇంటికి బయలుదేరాడు. కొత్తపల్లి స్టేజీ వద్ద బస్సు దిగి నడుచుకుంటూ వస్తూ కాజ్‌‌‌‌‌‌‌‌వే దాటేందుకు యత్నించగా.. నీటిలో పడి కొట్టుకుపోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు నీటిలో గాలించడంతో గురువారం ఉదయం కాజ్‌‌‌‌‌‌‌‌వేకు కొద్దిదూరంలో నాగేంద్రం డెడ్‌‌‌‌‌‌‌‌బాడీ దొరికింది. 

నాగర్‌‌‌‌‌‌‌‌ కర్నూల్‌‌‌‌‌‌‌‌ జిల్లా లింగాల మండలం అంబటిపల్లికి చెందిన కరుణాకర్ (41), పెద్దకొత్తపల్లి మండలం ముష్టిపల్లికి చెందిన శ్రీనివాసులు నాగర్‌‌‌‌‌‌‌‌కర్నూల్‌‌‌‌‌‌‌‌లో ఉంటున్నారు. బుధవారం రాత్రి నాగనూలులో కల్లు తాగిన తర్వాత బైక్‌‌‌‌‌‌‌‌పై వెళ్తున్నారు. నాగనూలు శివారులో నాగసముద్రం చెరువు వరదను దాటే క్రమంలో ఇద్దరూ కొట్టుకుపోయారు. గమనించిన స్థానికులు శ్రీనివాసులను రక్షించగా.. కరుణాకర్‌‌‌‌‌‌‌‌ నీటిలో కొట్టుకుపోయాడు. 

గురువారం ఉదయం డెడ్‌‌‌‌‌‌‌‌బాడీ అతడి డెడ్‌‌‌‌‌‌‌‌బాడీ దొరికింది. వరంగల్‌‌‌‌‌‌‌‌ జిల్లా గీసుకొండ మండలానికి చెందిన పులి అనిల్‌‌‌‌‌‌‌‌ (35) బంధువు చనిపోవడంతో ఖిలా వరంగల్‌‌‌‌‌‌‌‌లోని శివనగర్‌‌‌‌‌‌‌‌కు వచ్చాడు. బైక్‌‌‌‌‌‌‌‌పై తిరిగి వెళ్తుండగా.. అగర్తల చెరువు మత్తడి వద్ద కిందపడి నీటిలో కొట్టుకుపోయాడు. గురువారం ఉదయం నుంచి గాలించగా సాయంత్రం శివనగర్‌‌‌‌‌‌‌‌ నేతాజీ స్కూల్‌‌‌‌‌‌‌‌ సమీపంలోని కాల్వలో డెడ్‌‌‌‌‌‌‌‌బాడీ దొరికింది. 

ముగ్గురిని కాపాడిన జాలర్లు, పోలీసులు

గన్నేరువరం/ఉప్పునుతల, వెలుగు : వరద నీటిలో కొట్టుకుపోతున్న ఓ వ్యక్తిని జాలర్లు రక్షించి ఒడ్డుకు చేర్చారు. ఈ ఘటన కరీంనగర్‌‌‌‌‌‌‌‌ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే..బిహార్‌‌‌‌‌‌‌‌కు చెందిన రజీప్‌‌‌‌‌‌‌‌ గురువారం బైక్‌‌‌‌‌‌‌‌పై వెళ్తు.. గన్నేరువరం మండల కేంద్రంలోని ఊర చెరువు మత్తడి వరదలో పడి కొట్టుకుపోయాడు. 

ఈ క్రమంలో ఇటీవల నిమజ్జం అయిన దుర్గామాత విగ్రాహాలకు సంబంధించిన కర్రలను పట్టుకొని గట్టిగా అరిచాడు. గమనించిన స్థానిక జాలర్లు తాడు సాయంతో అతడిని బయటకు తీసుకొచ్చారు. 

నాగర్‌‌‌‌‌‌‌‌కర్నూల్‌‌‌‌‌‌‌‌ జిల్లా ఉప్పునుంతల మండలంలోని లాతిపూర్‌‌‌‌‌‌‌‌ గ్రామానికి చెందిన గణేశ్‌‌‌‌‌‌‌‌, సువర్ణ దంపతులు. డిండి అలుగు ప్రాంతంలో ఉన్న మట్టి గుట్టపై గొర్ల దొడ్డిని ఏర్పాటు చేసుకున్నారు. బుధవారం ఉదయం ఇద్దరు గుట్ట వద్ద ఉండగానే వరద చుట్టుముట్టడంతో బయటకు రాలేకపోయారు. గురువారం కాస్త ప్రవాహం తగ్గడంతో అచ్చంపేట డీఎస్పీ పల్లె శ్రీనివాసులు, సీఐ నాగరాజు ఆధ్వర్యంలో తాళ్ల సాయంతో దంపతులను బయటకు తీసుకొచ్చారు.