అయోధ్య అక్షింతల పంపిణీలో ఘర్షణ

అయోధ్య అక్షింతల పంపిణీలో ఘర్షణ
  • కులపెద్దకు చెప్పాలన్న ఓ వర్గం
  • చెప్పాల్సిన అవసరం లేదన్న మరో వర్గం
  • తోసుకున్న రెండు వర్గాలు 
  • సిద్దిపేట జిల్లా పలుగుగడ్డలో ఘటన
  • పలువురిపై కేసు నమోదు

జగదేవపూర్, వెలుగు : సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం పలుగుగడ్డ గ్రామంలో మంగళవారం అయోధ్య శ్రీరాముడి అక్షింతల పంపిణీ విషయమై గొడవ జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం..అయోధ్య నుంచి వచ్చిన శ్రీరాముడి అక్షింతలకు గ్రామానికి చెందిన కొంతమంది యువకులు, గ్రామ పెద్దలు హనుమాన్ ఆల యంలో పూజలు నిర్వహించి ఇంటింటికీ తిరిగి పంచాలని నిర్ణయించారు. అయితే, కుల సంఘం పెద్ద లేకుండా ఎలా పంచుతారని నర్ర పెద్ద ఇస్తారి, మల్లేశం, నర్సింహులు, నరేశ్, తదితరులు​ పంపిణీని అడ్డుకోవడానికి ప్రయత్నించారు.

కుల సంఘ పెద్ద హిందూ కాదని,  క్రిస్టియన్లలో ఉన్నందున ఆయనకు ఎందుకు చెప్పాలని అక్షింతలు పంపిణీకి సిద్ధమైన వారు అనడంతో ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో రెండు వర్గాలు ఒకరినొకరు తోసుకున్నారు. దీంతో గ్రామంలోని కొంతమంది పెద్దలు సముదాయించి అక్షింతలను పంపిణీ చేయించారు. అయితే, అంతకుముందు జరిగిన తోపులాటను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ ​చేశారు. ఇది వైరల్ ​కావడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా జగదేవపూర్ ఎస్ఐ చంద్రమోహన్ గ్రామానికి వచ్చి ఆరా తీశారు.

అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ రావు జగదేవపూర్ పీఎస్​కు వచ్చి ఎస్ఐని వివరాలడిగి తెలుసుకున్నారు. విషయం బజరంగ్ దళ్, బీజేవైఎం, హిందూ ధార్మిక సంఘాల సభ్యులకు తెలియడంతో పోలీస్ స్టేషన్​కు తరలివచ్చారు. అక్షింతల పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదంతా ఒకే కుటుంబానికి చెందిన వారి మధ్య జరిగిన ఘర్షణ అని, పాతకక్షలతో లొల్లి పెట్టుకుని ఉంటారని చెప్తున్నారు. గొడవకు కారణమైన వారిపై కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు.