టెన్త్ పలితాల్లో సిద్దిపేట సెకండ్..పడిపోయిన మెదక్, సంగారెడ్డి జిల్లాల ర్యాంక్ లు

టెన్త్ పలితాల్లో సిద్దిపేట సెకండ్..పడిపోయిన మెదక్, సంగారెడ్డి జిల్లాల ర్యాంక్ లు

సిద్దిపేట/సంగారెడ్డి/మెదక్, వెలుగు : టెన్త్ ఫలితాల్లో సిద్దిపేట జిల్లా వరుసగా రెండో ఏడాది సెకండ్ ర్యాంక్ సాధించగా, మెదక్, సంగారెడ్డి జిల్లాల ర్యాంకులు పడిపోయాయి. గతేడాది సంగారెడ్డి మూడో ర్యాంక్ లో ఉండగా, ఈసారి ఐదో స్థానానికి, నిరుడు 13వ స్థానంలో ఉన్న మెదక్ ఇప్పుడు 18వ స్థానానికి పడిపోయాయి. ఈ జిల్లాల ర్యాంకులు పడిపోయినా పాస్ పర్సంటేజీ గతంలోకన్నా పెరిగింది. మెదక్​ జిల్లాలో ఉత్తీర్ణత 90.84 నుంచి 94.82 శాతానికి, సంగారెడ్డి జిల్లా 97,29 నుంచి 97.86 శాతానికి పెరిగింది. 

వరుసగా రెండోసారి.. 

పదో తరగతి ఫలితాల్లో సిద్దిపేట జిల్లా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. 98.65 పర్సంటేజీతో వరుసగా రెండో ఏడాది కూడా స్టేట్​లో సెకండ్​ ప్లేస్​దక్కించుకుంది. జిల్లా నుంచి 13,976 మంది స్టూడెంట్స్​ పరీక్షలు రాయగా, 13,788 మంది పాసయ్యారు. 7,030 మంది బాయ్స్​కు గాను 6,920 (98.44 శాతం), 6,946 మంది గర్ల్స్​కు గాను 6,920 (98.88 శాతం) మంది ఉత్తీర్ణులైనారు. టీచర్ల నిరంతర పర్యవేక్షణ, డిజిటల్, స్పెషల్​ క్లాసులు నిర్వహించడం వల్ల ఉత్తమ ఫలితాలు వచ్చాయని అంటున్నారు. అక్కన్నపేట, చిన్నకోడూరు, దుల్మిట్ట, కొండపాక, మద్దూరు

మిరుదొడ్డి, నంగునూరు, నారాయణరావుపేట, రాయపోల్ మండలాల్లోని అన్ని స్కూళ్లలో వందశాతం ఉత్తీర్ణత నమోదైంది. జిల్లాలో మరో 238 గవర్నమెంట్ ​స్కూళ్లలో కూడా పరీక్షకు హాజరైన వారంతా పాసయ్యారు. గవర్నమెంట్​ స్కూళ్లకు చెందిన 153 మంది స్టూడెంట్స్​ 10/10 జీపీఏ సాధించారు.

వెనుకబడ్డ మెదక్

 మెదక్ జిల్లా వరుసగా మూడో సారి వెనుకబడింది. 2021–--22లో 11 వ స్థానంలో, 2022– --23లో 13వ స్థానంలో నిలిచింది. ఈసారి మాత్రం 92.90 శాతం ఫలితాలతో రాష్ట్రంలో 18వ స్థానంలో నిలిచింది. మొత్తం 10,283 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 9,553 మంది (92.90 శాతం) పాసయ్యారు. బాలుర కంటే బాలికలు ఎక్కువ మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 4,945 (94.82 శాతం), బాలురు 4,608 (90.92 శాతం) పాసయ్యారు. 

ఐదో ర్యాంకు లో సంగారెడ్డి జిల్లా

 సంగారెడ్డి జిల్లా 97.86 ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 5వ స్థానాన్ని పొందింది. గత ఏడాది మూడో స్థానంలో ఉండగా ఈసారి కొంత వెనుకబడింది. జిల్లా నుంచి 22,012 మంది స్టూడెంట్స్ పరీక్షలు రాయగా 21,540 మంది పాసయ్యారు. 11,136 మందిబాలురు పరీక్ష రాస్తే 10,852 (97.45 శాతం) మంది పాసయ్యారు. 10,816 మంది బాలికలు పరీక్ష రాయగా 10,688 (98.27 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు.

ఈసారి కూడా బాలికలే పైచేయి సాధించారు. జిల్లాలోని 460 గవర్నమెంట్ స్కూళ్లకు గాను 296 స్కూళ్లలో 100 శాతం రిజల్ట్స్ వచ్చాయి. 17 కేజీబీవీల్లో 636 మంది పరీక్షలు రాయగా 99 శాతం పర్సంటేజీ సాధించి 630 మంది పాసయ్యారు. ఇందులో 12 కేజీబీవీలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి.