
నంగునూరు(సిద్దిపేట), వెలుగు: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కొండం రాజుపల్లి గ్రామానికి చెందిన బండి బాల కొమురయ్య(45) తనకున్న అసైన్డ్ భూమిలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అప్పులు చేసి ఇటీవల సాగు కోసం రెండు బోర్లు వేయడంతో పాటు కూతురు పెళ్లి చేశాడు.
చేసిన అప్పులకు వడ్డీలు పెరుగుతుండటంతో వాటిని ఎలా తీర్చాలో తెలియక కొమురయ్య తీవ్ర మనస్తాపానికి గురయ్యేవాడు. ఈ క్రమంలో శనివారం పొలానికి వెళ్లిన కొమురయ్య.. అక్కడే పురుగుల మందు తాగాడు. సాయంత్రం అవుతున్నా.. ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు గాలించగా,
పొలంలో కొమురయ్య మృతదేహాన్ని గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.