లైంగిక దాడి కేసులో ఒకరికి జీవిత ఖైదు.. సిద్దిపేట ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టు తీర్పు

లైంగిక దాడి కేసులో ఒకరికి జీవిత ఖైదు.. సిద్దిపేట ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టు తీర్పు

సిద్దిపేట రూరల్, వెలుగు: లైంగికదాడి కేసులో జీవితఖైదు, రూ.1 లక్ష50 వేల జరిమానా విధిస్తూ సిద్దిపేట ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టు జడ్జి జయప్రసాద్ బుధవారం తీర్పు ఇచ్చారు. సిద్దిపేట సీపీ విజయ్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దిపేట పరిధిలోని ఒక గ్రామానికి చెందిన మహిళ ములుగు మండలానికి చెందిన స్కూల్ లో కాంట్రాక్ట్ టీచరుగా చేసేది. 2014 లో హైదరాబాద్ లోని చింతల్ కు చెందిన పైడి శాంతరాజు తన పిల్లలను ఆ స్కూల్ లో అడ్మిట్ చేసేందుకు టీచర్ ఫోన్ కు చేశాడు. అనంతరం ఆమెతో పరిచయం పెంచుకుని పెండ్లి చేసుకుంటానని నమ్మించాడు.

అదే ఏడాది డిసెంబర్ లో సిటీకి రప్పించి లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేశారు. నిందితుడు శాంతరాజును అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. అనంతరం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. విచారణలో భాగంగా నిందితుడికి జైలుశిక్ష, జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు. బాధితురాలికి రూ. 5 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. నిందితుడికి శిక్షపడేలా వ్యవహరించిన సిద్దిపేట ఏసీసీ రవీందర్ రెడ్డి, సీఐ శ్రీను, ఎస్ఐ రాజేశ్​తో పాటు, కోర్టు మానిటర్ ఎస్ఐ గంగరాజు, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్. ఆత్మ రాములును సీపీ అభినందించారు.

ఆదిలాబాద్ జిల్లాలో మరొకరికి పదేండ్ల జైలు..
లైంగికదాడి కేసులో ఒకరికి పదేండ్ల జైలు శిక్ష, రూ. వెయ్యి జరిమానా విధిస్తూ ఆదిలాబాద్ జిల్లా కోర్టు జడ్జి ప్రభాకర్ రావు బుధవారం తీర్పు చెప్పారు. కోర్టు లైజన్ ఆఫీసర్ గంగా సింగ్ తెలిపిన ప్రకారం.. 2023 నవంబర్ లో బేల మండలానికి చెందిన గుర్నులే నగేశ్ తన పత్తి చేనులోకి పనికి వచ్చిన మహిళపై బలవంతంగా లైంగికదాడికి పాల్పడ్డాడు. 

బాధిత మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు. నిందితుడు నగేశ్ పై నేరం రుజువుకావడంతో జైలుశిక్ష, జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు. నిందితుడికి శిక్షపడేలా వ్యవహరించిన పోలీసు ఆఫీసర్లను ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించారు.