
సిద్దిపేట, వెలుగు: జిల్లాలో వానాకాలం సీజన్ వడ్ల కొనుగోలుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. దసరా తర్వాత వరికోతలు ఊపందుకోవడంతో అధికారులు కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై దృష్టిపెట్టారు. జిల్లాలో 439 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 5 లక్షల టన్నుల పైచిలుకు వడ్లు కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. స్థానిక ఎన్నికల ప్రభావం ధాన్యం కొనుగోళ్లపై పడకుండా ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తున్నారు.
ఇప్పటికే అడిషనల్ కలెక్టర్ నేతృత్వంలో వడ్ల కొనుగోళ్లపై ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. సిద్దిపేట జిల్లాలో ప్రస్తుత వానాకాలం సీజన్ లో 3.6 లక్షల ఎకరాల్లో వరి సాగుచేస్తుండగా ఇందులో 3.2 లక్షల ఎకరాల్లో దొడ్డు రకం, 40 వేల ఎకరాల్లో సన్న రకం సాగు చేస్తున్నారు. ఇందులో 8 లక్షల పైచిలుకు ధాన్యం మార్కెట్లోకి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇబ్బందులను అధిగమించి వరి సాగు
ప్రస్తుత సీజన్ లో రైతులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ వరి సాగు చేశారు. మొదట్లో వర్షాలు ఆలస్యం కావడం తర్వాత అధిక వర్షాలు అన్నదాతలను అతలాకుతంల చేశాయి. అతివృష్టి అనావృష్టి పరిస్థితుల కారణంగా దాదాపు 50 వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. పలు గ్రామాల్లో వరి పొలాల్లో ఇసుక మేట వేయడంతో రైతులకు నష్టం జరిగింది. మరోవైపు యూరియా సకాలంలో అందక రైతులు అవస్థలు పడ్డారు. సరైన సమయంలో యూరియా వేయకపోవడంతో కొంత దిగుబడి తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సిబ్బందికి శిక్షణా తరగతుల నిర్వహణ
ధాన్యం కొనుగోళ్లలో పాల్గొనే సిబ్బందికి జిల్లా అధికార యంత్రాంగం శిక్షణ తరగతులను నిర్వహించింది. నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా మద్దతు ధర లభించే విధంగా కొనుగోళ్లపై సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. రైతులకు అందుబాటులో ప్యాడీ క్లీనర్లు, మాయిశ్చర్ మిషన్, వేయింగ్ మిషన్, టార్ఫాలిన్లు, హమాలీలు అందుబాటులో ఉండే విధంగా చూస్తున్నారు. పెద్ద కొనుగోలు కేంద్రాల్లో రైతుల రద్దీకి అనుగుణంగా అటోమేటిక్ ప్యాడీ క్లీనర్లను అదనంగా ఏర్పాటు చేయనున్నారు.
గోదాంలను సిద్ధం చేస్తున్న అధికారులు
ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమవుతున్న నేపథ్యంలో అధికారులు గోదాంలను సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో 231 ఐకేపీ, 202 సహకార సంఘాలు, 6 మెప్మా ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ధాన్యం కొనుగోలుకు 1.10 కోట్ల గన్నీ బ్యాగులు అవసరమవుతాయని అంచనా వేసి 58 లక్షల పాత గన్నీ బ్యాగులకు తోడు అదనంగా మరో 70 లక్షల కొత్త గన్నీ బ్యాగులను తెప్పిస్తున్నారు. సేకరించిన వడ్లను వెంటనే గోదాంలకు చేర్చడానికి అవసరమైన రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. గోదాంల వద్ద ధాన్యం నిల్వలకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లను క్షేత్ర స్థాయిలో అధికారులు పరిశీలిస్తున్నారు.
సోమవారం నుంచి ప్రారంభిస్తాం
సోమవారం నుంచి కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నాం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తాం. ముందుగా సిద్దిపేట, హుస్నాబాద్ తర్వాత గజ్వేల్, దుబ్బాక ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తాం. అందుకు తగిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశాం. కొనుగోలు కేంద్రాలకు కావలసిన స్టేషనరీ, ట్రక్ షీట్ బుక్స్, టార్ఫాలిన్లను అందజేస్తున్నాం.
-ప్రవీణ్ కుమార్, సివిల్ సప్లై డీఎం