అత్యధిక కంటి పరీక్షలు చేసిన జిల్లాగా సిద్ధిపేట : హరీష్ రావు

అత్యధిక కంటి పరీక్షలు చేసిన జిల్లాగా సిద్ధిపేట : హరీష్ రావు

కంటి వెలుగు కార్యక్రమంతో ప్రజలకు ఆనంద భాష్పాలు వస్తుంటే ప్రతిపక్షాలకు కన్నీళ్లు వస్తున్నాయని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లాలోని 26వ వార్డు ఏకలవ్య సంఘం భవనంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు.. ప్రతీ గ్రామంలో కంటి వెలుగు శిబిరాలు విజయవంతంగా కొనసాగుతున్నాయన్నారు. ఇప్పటి వరకు1,68,062 మందికి కంటి పరీక్షలు నిర్వహించి సిద్దిపేట జిల్లా మొదటి స్థానంలో ఉందని మంత్రి కొనియాడారు. సర్వేంద్రియాం.. నయనం ప్రధానం అన్న వ్యాఖ్యను గుర్తుచేస్తూ.. దృష్టి లోపాన్ని నివారించేందుకు సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారని చెప్పారు. ప్రజలందరూ సీఎం కేసీఆర్ ను పెద్ద కొడుకులా భావిస్తున్నారని, ఈరోజుకు కంటి పరీక్షలు 50 లక్షల మార్కును చేరుకున్నామని తెలిపారు. 

కేవలం 25 రోజుల సమయంలోనే ఈ రికార్డు సాధించామన్న మంత్రి హరీష్ రావు... ఇందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదే స్ఫూర్తిని చివరి వరకు కొనసాగించాలని సూచించారు. కుల, మత ప్రాంతాలకు అతీతంగా పక్క రాష్ట్రాల వారికి కూడా కంటి పరీక్షలు నిర్వహించి అద్దాలు అందజేస్తున్నామని తెలిపారు. మానవతకు మారు పేరు సీఎం కేసీఆర్ అని, రాష్ట్రంలో 16 లక్షల మంది ప్రజలు కంటి చూపుతో భాధపడుతున్నట్లు గుర్తించామని చెప్పారు. 16 లక్షల మందికి కంటి వెలుగులు ప్రసాదించిన నాయకుడు సీఎం కేసీఆర్ అని పొగడ్తలతో ముంచెత్తారు. ఈ 16 లక్షల్లో అధికంగా మహిళలే ఉన్నారన్న మంత్రి ... గతంలో చైనా నుంచి దిగుమతి చేసుకుంటే.. ఈసారి మేడిన్ తెలంగాణ కంటి అద్దాలు పంపిణీ చేస్తున్నామని గొప్పగా చెప్పారు. పంజాబ్, ఢిల్లీ సీఎంలు సైతం ఈ కార్యక్రమం బాగుందని కితాబిచ్చినట్టు గుర్తు చేశారు. రెండో విడత కంటి వెలుగు కోసం రూ.250 కోట్లు ఖర్చు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇప్పటివరకూ సహకరిస్తున్న ప్రతి శాఖకు చెందిన అధికారులు, సిబ్బందికి ధన్యవాదాల అని, రాష్ట్రంలో చివరి వ్యక్తికి పరీక్ష చేసే వరకు కంటి పరీక్షలు కొనసాగుతాయని హరీష్ రావు హామీ ఇచ్చారు.