సిద్దిపేట మున్సిపాల్టీలో సౌర వెలుగులు .. మొదటి దశలో రెండు చోట్ల ప్లాంట్ల ఏర్పాటు

సిద్దిపేట మున్సిపాల్టీలో  సౌర వెలుగులు .. మొదటి దశలో రెండు చోట్ల  ప్లాంట్ల ఏర్పాటు
  • డీపీఆర్ రూప కల్పనలో అధికారులు
  • సోలార్ పవర్ తో విద్యుత్ బిల్లులకు చెక్

సిద్దిపేట, వెలుగు:  సిద్దిపేట మున్సిపాల్టీలో  సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు ఆఫీసర్లు సన్నాహాలు చేస్తున్నారు. మున్సిపాల్టీకి విద్యుత్ బిల్లుల చెల్లింపు భారంగా మారుతుండటంతో ప్రత్యామ్నాయంగా సోలార్ పవర్  ఉత్పత్తి వైపు దృష్టి సారిస్తోంది. స్పెషల్ గ్రేడ్ మున్సిపాల్టీ అయిన సిద్దిపేటలో విద్యుత్ బిల్లుకే  ప్రతి నెల కోటి రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. వివిధ అవసరాలకు విద్యుత్ వినియోగం తప్పనిసరి కావడంతో పాటు ఇదే సమయంలో నెల నెలా బిల్లులు గుది బండలా మారుతుండటంతో  సోలార్ పవర్ ను ఉత్పత్తి చేసుకుని బిల్లుల భారాన్ని తగ్గించుకునే దిశగా అధికారులు దృష్టి సారిస్తున్నారు.

  మొదట మున్సిపల్ ఆఫీసుతో పాటు కోమటి చెరువు నెక్లెస్ రోడ్డులో రెండు చోట్ల  సోలార్ ప్లాంట్ లు ఏర్పాటు చేసే దిశగా మున్సిపల్ అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే సర్వేను పూర్తి చేయడంతో పాటు డీపీఆర్ ను సిద్ధం చేసే పనిలో పడ్డారు. ప్రతి నెలా సిద్దిపేట మున్సిపాల్టీ పరిధిలో డ్రింకింగ్ వాటర్, స్ట్రీట్ లైట్స్, వాటర్ పంప్ హౌజ్, హై లెవల్,  లో లెవల్ వాటర్ ట్యాంకులు, కోమటి చెరువు వద్ద పార్క్ లు, మున్సిపల్ ఆఫీసు లో  వినియోగిస్తున్న విద్యుత్ కు కోటి రూపాయల బిల్లులు చెల్లిస్తోంది. 

వినియోగించిన విద్యుత్ కు  బిల్లులు చెల్లించడానికి  అధిక నిధులు వినియోగించాల్సి రావడం వల్ల అభివృద్ది పనులకు నిధుల కొరత ఏర్పడుతోంది.  ఏటా మున్సిపాల్టీ పరిధిలో వినియోగించిన విద్యుత్ కు దాదాపు  రూ.12 కోట్ల పైనే బిల్లులు చెల్లిస్తోంది. విద్యుత్ బిల్లుల గండం నుంచి గట్టెక్కడానికి  సోలార్ పవర్ ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ఏర్పాటే శరణ్యమని భావించి ఇటీవల ప్రత్యేక సర్వే బృందం క్షేత్రస్థాయిలో పరిశీలన జరపగా పూర్తిస్థాయి డీపీఆర్ ను సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా స్ట్రీట్ లైట్స్ తో పాటు తాగునీటి సరఫరాకు భారీగా విద్యుత్ ను వినియోగించాల్సి రావడంతో ఈ భారాన్ని తగ్గించుకోవడానికి సోలార్ పవర్ వినియోగమే సరైందనే దిశగా అధికారులు నిర్ణయించారు.

రెండు చోట్ల ప్రయోగాత్మకంగా

కోమటి చెరువు వద్ద నెక్లెస్ రోడ్డు తోపాటు మున్సిపల్ ఆఫీస్ లో ప్రయోగాత్మకంగా సోలార్ పవర్  ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ప్రతి నెలా మున్సిపల్ ఆఫీసుకు లక్ష రూపాయలు, కోమటి చెరువు వద్ద దాదాపు నాలుగు లక్షల మేర కరెంటు బిల్లులు వస్తున్నాయి. రెండు చోట్ల సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి వాటిని వినియోగించుకుంటే ప్రతి నెల రూ. 5 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చనే అధికారులు అనుకుంటున్నారు. మొదటిదశలో ఏర్పాటు చేసే సోలార్ పవర్ ప్లాంట్లు విజయవంతమైతే మరికొన్ని చోట్ల వీటిని ఏర్పాటు చేసే దిశగా కసరత్తు చేస్తున్నారు.

భవిష్యత్తులో మరికొన్ని ప్రాంతాల్లో

బుస్సాపూర్ డంప్ యార్దు వద్ద ప్రత్యేకంగా సోలార్ పవర్ ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేసి ఇక్కడ ఉత్పత్తయ్యే విద్యుత్ ను పట్టణంలో స్ట్రీట్ లైట్స్ కోసం వినియోగించాలనే దిశగా కసరత్తు చేస్తున్నారు. మొదటి దశ పూర్తి కాగానే బుస్సాపూర్ డంప్ యార్డు వద్ద ప్లాంట్ నెలకొల్పనున్నారు. పట్టణ నీటి సరఫరా కోసం అధికంగా విద్యుత్ వినియోగం జరుగుతుండటంతో నాసర్ పురా ఫిల్టర్ బెడ్స్, చింతల చెరువు, నర్సాపూర్ ఎస్టీపీ ప్లాంట్స్ తో పాటు  కమ్మర్లపల్లి, ఇల్లంతకుంట ల వాటర్ పంప్ హౌజ్ ల తో పాటు ఖాళీ ప్రదేశాలున్న చోట  భవిష్యత్తులో సోలార్ పవర్ ప్లాంట్ లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు కసరత్తు

విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకోవడం కోసం సోలార్ పవర్ వినియోగించుకోవాలని నిర్ణయించాం. ఇందులో భాగంగా మున్సిపల్ ఆఫీస్, కోమటి చెరువు వద్ద నెక్లెస్ రోడ్డులో  సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్ ను అక్కడి అవసరాలకు వినియోగించడం వల్ల ప్రతి నెల ఐదు లక్షల రూపాయలు ఆదా అవుతుంది. మొదటి దశ విజయవంతమైతే భవిష్యత్తులో మరికొన్ని చోట్ల   సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నాం. దీని వల్ల మున్సిపాల్టీకి విద్యుత్ బిల్లుల భారం తగ్గుతుంది.

అశ్రిత్ కుమార్, కమిషనర్ సిద్దిపేట మున్సిపాల్టీ