ఇన్స్యూరెన్స్ డబ్బుల కోసం.. అత్తను చంపిన అల్లుడు

ఇన్స్యూరెన్స్  డబ్బుల కోసం.. అత్తను చంపిన అల్లుడు
  • నిందితులను అరెస్ట్​ చేసిన పోలీసులు

సిద్దిపేట, వెలుగు: అత్త పేరిట ఉన్న ఇన్స్యూరెన్స్  డబ్బులు కాజేసేందుకు అత్త(భార్య తల్లి)ను  హత్య చేసి, రోడ్​ యాక్సిడెంట్ గా చిత్రీకరించేందుకు యత్నించిన అల్లుడిని పోలీసులు అరెస్ట్​ చేశారు. శనివారం సిద్దిపేటలో సీపీ అనురాధ మీడియాకు వివరాలు వెల్లడించారు. తొగుట మండలం పెద్ద మాసాన్ పల్లికి చెందిన తాళ్ల వెంకటేశ్  పౌల్ట్రీ వ్యాపారంలో ఆర్థికంగా నష్టపోయి, రూ.20 లక్షల వరకు అప్పులయ్యాయి. దీని నుంచి బయటపడేందుకు అత్తను హత్య చేసి యాక్సిడెంట్ గా చిత్రీకరించి, ఆమె పేరిట ఉన్న రూ.60 లక్షల ఇన్స్యూరెన్స్​  డబ్బులు కాజేయాలని ప్లాన్​ చేశాడు. నాలుగు నెలల కింద అత్త రామవ్వ పేరిట పోస్టాఫీసులో రూ.15 లక్షలకు, ఎస్ బీఐలో రూ.40 లక్షల యాక్సిడెంట్  ఇన్స్యూరెన్స్  పాలసీ చేయించడమే కాకుండా, గ్రామంలోని 29 గుంటల భూమిని ఆమె పేరుపై మార్పించి రూ.5 లక్షల రైతుబీమా  కాజేయాలని ప్లాన్  వేశాడు. 

ఆ తరువాత రామవ్వను వాహనంతో గుద్ది చంపేందుకు సోదరుడి వరుసైన తాళ్ల కరుణాకర్ ను సాయం కోరాడు. తన వద్ద తీసుకున్న రూ.1.30 లక్షల అప్పు మాఫీ చేయడంతో పాటు ఇన్స్యూరెన్స్  డబ్బుల్లో సగం ఇస్తానని ఆఫర్  ఇచ్చాడు. ఈ నెల 7న సిద్దిపేట పట్టణంలోని కేసీఆర్ నగర్ లో ఉండే దివ్యాంగురాలైన అత్త తాటికొండ రామవ్వ(57)ను పెద్ద మాసాన్ పల్లి వద్ద ఉన్న పొలం వద్దకు మోపెడ్​పై తీసుకెళ్లాడు. ఆ తరువాత రోడ్డుపై కూర్చోబెట్టి ఊర్లో పని ఉందని చెప్పి వెళ్లిపోయాడు. ఆ తరువాత అద్దెకు తీసుకున్న థార్  వెహికల్ తో కరుణాకర్​ ఆమెను ఢీకొట్టడంతో రామవ్వ చనిపోయింది. ఆ తరువాత ఏమి తెలియనట్లు వెంకటేశ్​ ఈ ఘటనపై తొగుట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదుపై లోతుగా విచారించిన పోలీసులు ఇన్స్యూరెన్స్  డబ్బులు కాజేసేందుకు ఈ హత్య చేశారని గుర్తించారు. వెంకటేశ్, కరుణాకర్ ను అరెస్ట్  చేసి, థార్  వెహికల్, మోపెడ్​ను స్వాధీనం చేసుకున్నారు.