పంజాబ్‌ కోసమే కొట్లాడుతున్నా.. ఇట్లైతే కొత్త వ్యవస్థ నడపలేం

పంజాబ్‌ కోసమే కొట్లాడుతున్నా.. ఇట్లైతే కొత్త వ్యవస్థ నడపలేం

నిజం కోసం తన తుది శ్వాస ఉన్నంత వరకూ పోరాడుతానని పంజాబ్ పీసీసీ మాజీ ప్రెసిడెంట్ నవజోత్ సింగ్‌ సిద్ధూ చెప్పారు. పంజాబ్ కాంగ్రెస్‌లో కొత్త సంక్షోభాన్ని సృష్టిస్తూ తన పీసీసీ పదవికి రాజీనామా చేసిన ఆయన ఇవాళ ట్విట్టర్‌‌లో ఒక వీడియోను పోస్ట్‌ చేశారు. తాను ఎప్పుడూ తన వ్యక్తిగత ఎజెండా కోసం పోరాడలేదని, పంజాబ్ సంక్షేమం కోసమే కొట్టాడుతున్నానని, ఈ విషయంలో ఎప్పటికీ రాజీపడేదే లేదని వీడియోలో సిద్ధూ స్పష్టం చేశారు.

ఎటువంటి త్యాగాలకైనా తాను సిద్ధమేనని, కాంగ్రెస్ హైకమాండ్‌ను తాను తప్పుదారి పట్టించలేనని సిద్ధూ తెలిపారు. పంజాబ్‌లో కొత్తగా చరణ్‌జిత్ సింగ్ చన్నీ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వంపై పరోక్షంగా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అవినీతి, అక్రమాలకు పాల్పడిన నేతలు, అధికారులతో కొత్త వ్యవస్థను నడపలేమని అన్నారు. విలువల కోసం తాను పోరాడుతున్నానని, ఈ విషయంలో తాను వెనుకడుగేసేది లేదని స్పష్టం చేశారు. తనకు ఎవరితోనూ వ్యక్తిగత శత్రుత్వం లేదన్నారు. నిజం కోసం తుది శ్వాస వరకు పోరాడతానన్నారు. 17 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు కృషి చేశానన్నారు.

దళిత నేత సీఎంగా ఉండడం ఇష్టం లేకే అంటున్న ప్రతిపక్షాలు

పంజాబ్ పీసీసీ చీఫ్​ పదవికి నిన్న (మంగళవారం) నవజోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేశారు. ఎవరైనా ఒక వ్యక్తి ఏ అంశంలోనైనా రాజీ పడితే వ్యక్తిత్వాన్ని కోల్పోయినట్లేనంటూ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. అందుకే తాను పదవి వదులుకుంటున్నానని తెలిపారు. ఆయనకు మద్దతుగా నిన్న రాత్రి మంత్రి రజియా సుల్తానా తన పదవిని వదులుకున్నారు. చరణ్‌జిత్ కేబినెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారామె. అయితే దళిత నేత అయిన చరణ్​జిత్ సింగ్ చన్నీ సీఎం పదవిలో కొనసాగడం ఇష్టం లేకనే సిద్ధూ ఈ రాజీనామా డ్రామాకు తెరతీశారని ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆరోపించింది. ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ఆయన ప్రయత్నిస్తున్నారని అన్నారు.