వాట్సప్ కొత్త పాలసీతో ఊపందుకున్నసిగ్నల్, టెలిగ్రామ్

వాట్సప్ కొత్త పాలసీతో ఊపందుకున్నసిగ్నల్, టెలిగ్రామ్

న్యూఢిల్లీకొత్త పాలసీని వాట్సాప్‌‌ ప్రకటించడం ఇన్‌‌స్టంట్ మెసేజింగ్ యాప్‌‌లు సిగ్నల్‌‌, టెలిగ్రామ్‌‌లకు వరంలా మారింది.  ఈ కొత్త పాలసీ వలన బిజినెస్‌‌లతో ఇంటరాక్ట్‌‌ అయిన డేటాను ఫేస్‌‌బుక్‌‌, ఇన్‌‌స్టాగ్రాం, ఫేస్‌‌బుక్‌‌కు చెందిన ఇతర కంపెనీలతో షేర్‌‌ చేసుకోవడానికి వాట్సాప్‌‌కు వీలుకలుగుతుంది. ఈ పాలసీపై గ్లోబల్‌‌గా, ఇండియాలోనూ వ్యతిరేకత మొదలయ్యింది. ఈ పరిస్థితులను సిగ్నల్‌‌, టెలిగ్రామ్‌‌లు అవకాశంగా మలుచుకొని తమ బిజినెస్‌‌లను ప్రమోట్ చేసుకుంటున్నాయి. ఇండియాలో  సిగ్నల్‌‌, టెలిగ్రామ్‌‌ యాప్‌‌ల కొత్త డౌన్‌‌లోడ్లు జనవరి 6–-10 మధ్య 40 లక్షలకు చేరుకున్నాయి. 23 లక్షల కొత్త డౌన్‌‌లోడ్లతో సిగ్నల్‌‌ ఎక్కువగా ప్రయోజనం పొందగా, 15 లక్షల కొత్త డౌన్‌‌లోడ్లతో  టెలిగ్రామ్‌‌ తర్వాతి ప్లేస్‌‌లో ఉంది. జనవరి 1–5 మధ్య సిగ్నల్‌‌ కొత్త డౌన్‌‌లోడ్లు కేవలం 24 వేలుగా ఉండగా, వాట్సాప్‌‌ కొత్త పాలసీ ప్రకటన తర్వాత ఈ యాప్‌‌ కొత్త డౌన్‌‌లోడ్లు 9,483 శాతం ఎగిశాయి. టెలిగ్రామ్‌‌ కొత్త డౌన్‌‌లోడ్లు 13 లక్షల నుంచి 15 శాతం పెరిగాయి. మరోవైపు ఇదే టైమ్‌‌లో వాట్సాప్‌‌ కొత్త డౌన్‌‌లోడ్లు భారీగా తగ్గాయి. జనవరి 1–5 మధ్య ఈ యాప్‌‌ కొత్త డౌన్‌‌లోడ్లు 20‌‌‌‌ లక్షలుగా ఉండగా, జనవరి6–10 నాటికి ఇవి 35 శాతం తగ్గి13 లక్షలకు పడిపోయాయి. ఇండియాలో 2014 నుంచి ఇప్పటి వరకు చూస్తే  మొత్తం సిగ్నల్‌‌ డౌన్‌‌లోడ్లు 39 లక్షలుగా,  టెలిగ్రామ్‌‌ డౌన్‌‌లోడ్లు 15.15 కోట్లుగా, వాట్సాప్ డౌన్‌‌లోడ్లు 140 కోట్లుగా ఉన్నాయి.

ఎలన్‌‌ మస్క్‌‌ వాట్సాప్‌‌ వద్దంటున్నారు..

కొత్త పాలసీని ప్రకటించిన తర్వాత వాట్సాప్‌‌ను వాడొద్దని ప్రముఖ వ్యాపారవేత్తలు పిలుపునిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన టెస్లా సీఈఓ ఎలన్‌‌ మస్క్‌‌ వాట్సాప్‌‌ నుంచి సిగ్నల్‌‌కు మారాలని యూజర్లకు సూచించారు. పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ  కూడా వాట్సాప్‌‌కు వ్యతిరేకంగా ట్వీట్‌‌ చేశారు. ‘మార్కెట్‌‌కు పవరుంటుందని అంటారు. ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్‌‌. కానీ ఇక్కడ ఫేస్‌‌బుక్, వాట్సాప్ వంటి కంపెనీలు మార్కెట్లో తమకున్న పొజిషన్‌‌ను వాడుకొని లక్షల మంది యూజర్ల ప్రైవసీకి భంగం కలిగిస్తున్నాయి.  ఇప్పుడే సిగ్నల్‌‌ యాప్‌‌కు మనం షిఫ్ట్ అవ్వాలి. ఇలాంటి పాలసీలతో నష్టపోవడమా లేక వీటిని వ్యతిరేకించడమా అనేది మన చేతుల్లోనే ఉంది’ అని ట్వీట్‌‌ చేశారు.

వాట్సాప్‌‌ కొత్త పాలసీ..

కొత్త పాలసీని తీసుకొస్తున్నామని జనవరి 6 న యూజర్లకు వాట్సాప్ తెలిపింది. బిజినెస్‌‌లకు– యూజర్లకు మధ్య జరిగిన ఇంటరాక్షన్‌‌ను ఫేస్‌‌బుక్‌‌, కంపెనీకి చెందిన ఇతర సంస్థలతో పంచుకోవడానికి అనుమతి కోరింది. ఈ కొత్త పాలసీని ఫిబ్రవరి 8 లోపు అంగీకరించకపోతే యూజర్ల అకౌంట్లు నిలిచిపోతాయని పేర్కొంది. ‘యాడ్స్‌‌ను అమ్ముకోవడానికే ఫేస్‌‌బుక్ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. యాప్‌‌ స్టోర్‌‌‌‌లలో సిగ్నల్‌‌ అని టైప్ చేసినా టాప్‌‌లో కనిపించడానికి ఇవి ఎంతవరకైన వెళతాయి. సిగ్నల్‌‌లో యాడ్‌‌లు ఎప్పటికీ ఉండవు. ఎందుకంటే యూజర్ల డేటా వారి చేతుల్లోనే ఉంటుంది కంపెనీ చేతుల్లో కాదు’ అని సిగ్నల్‌‌ ట్విటర్‌‌‌‌లో పేర్కొంది. యాడ్స్‌‌ కోసం యూజర్ల ప్రైవేట్‌‌ డేటాను ఉపయోగించమని టెలిగ్రామ్‌‌ ఫౌండర్‌‌‌‌ పావెల్‌‌ డురో అన్నారు. ‘30 సెకన్ల యాడ్‌‌ను చూడమని యూజర్లను ఎప్పటికీ బలవంతం పెట్టం. ఒకవేళ మేం యాడ్స్‌‌ను ఇవ్వాలనుకున్న అది వన్‌‌ టూ మెనీ(అందరికీ కామన్‌‌ యాడ్‌‌) ఛానెల్స్‌‌ ద్వారా ఇస్తాం. అంతేగాని యూజర్ల ప్రైవేట్ డేటాను వాడుకొని ఫేస్‌‌బుక్‌‌లాగా ఇండివిడ్యువల్‌‌గా టార్గెట్‌‌ చేయం’ అని అన్నారు.

అవన్నీ రూమర్లే..వాట్సాప్‌‌

యూజర్ల ప్రైవేట్‌‌ డేటా లీక్‌‌ అవుతుందనే రూమర్లపై వాట్సాప్‌‌  వివరణ ఇచ్చింది. ఎండ్‌‌ టూ ఎండ్‌‌ ఎన్‌‌క్రిప్షన్ వలన గ్రూప్‌‌ చాట్‌‌లలో కంటెంట్‌‌ వాట్సాప్‌‌కు, ఫేస్‌‌బుక్‌‌కు  తెలియదని పేర్కొంది.

ఫేస్‌‌బుక్‌‌తో ఇవి పంచుకోం..

  •     ఫేస్‌‌బుక్ లేదా వాట్సాప్‌‌ యూజర్ల ప్రైవేట్‌‌ మెసేజ్‌‌లను చూడలేవు, కాల్స్‌‌ను  వినలేవు
  •     ఎవరెవరు కాల్స్‌‌ చేస్తున్నారు లేదా మెసేజ్‌‌ చేస్తున్నారో లిస్ట్‌‌ వాట్సాప్‌‌ దగ్గరే ఉంటుంది
  •     యూజర్లు షేర్ చేసిన లోకేషన్లను  ఫేస్‌‌బుక్‌‌, వాట్సాప్‌‌లు  చూడలేవు
  •     యూజర్ల కాంటాక్ట్‌‌ డిటైల్స్‌‌ను ఫేస్‌‌బుక్‌‌తో వాట్సాప్‌‌ పంచుకోదు
  •     వాట్సాప్‌‌ గ్రూప్‌‌ ప్రైవేట్‌‌గా ఉంటుంది
  •     మెసేజ్‌‌లను డిసెపియర్‌‌‌‌(కనిపించకుండా) చేసుకోవచ్చు
  •     యూజర్లు తమ డేటాను డౌన్‌‌లోడు చేసుకోవచ్చు.