యూనియన్ల రద్దు దిశగా కార్మికులతో సంతకాలు

యూనియన్ల రద్దు దిశగా కార్మికులతో సంతకాలు

ఆర్టీసీ యూనియన్లలో కలకలం రేగింది. యూనియన్లతో కార్మికులకు సంబంధం లేదని కార్మికుల చేత ఆర్టీసీ అధికారులు లేఖలు రాయించుకుంటున్నారు. రెండు సంవత్సరాల పాటు యూనియన్ ఎన్నికలు లేవంటూ ఉన్న అప్లికేషన్లపై కార్మికులతో సంతకాలు చేయించుకుంటున్నారు. కొంతమంది కార్మికులు సంతకాలు చేయడానికి ముందుకొచ్చినా.. చాలా మంది మాత్రం అందుకు ససేమీరా అంటున్నారు. అంతేకాకుండా అత్యవసరం అయితే తప్ప సెలవు తీసుకోకూడదని కూడా అప్లికేషన్లలో ఉంది. ఒకవేళ సెలవు తీసుకుంటే మరుసటి రోజు మేనేజర్‌ని కలిసిన తర్వాతనే డ్యూటీలో చేరాలి. వీటన్నింటిని చూసిన తర్వాత కార్మికుల్లో ఒక ఆందోళన మొదలైంది. ఏది ఏమైనా సరే కార్మికులతో సంతకం చేయించి లేబర్ కమిషనర్‌కి ఇవ్వాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. అందుకోసం అధికారులు అన్ని డిపోల దగ్గర నోటిసులు అంటించారు. ఆ నోటిసులు చూసిన యూనియన్ నేతల్లో కలవరం మొదలైంది. ఇలా చేస్తే తమ ఉనికి ఉండదనే భావన యూనియన్ నేతల్లో వచ్చినట్లు అనిపిస్తుంది. అయితే కార్మికులెవరూ అప్లికేషన్లపై సంతకాలు పెట్టొద్దని కార్మిక సంఘాలు కోరుతున్నాయి.