ఆధ్యాత్మికం: జులై 6 విశిష్టత ఏమిటి.. ఆ రోజు ఏ దేవుడిని పూజించాలి.. ఏ మంత్రం చదవాలి..!

ఆధ్యాత్మికం:  జులై 6 విశిష్టత ఏమిటి.. ఆ రోజు ఏ దేవుడిని పూజించాలి.. ఏ మంత్రం చదవాలి..!

 హిందువులు  ఎన్నో సంస్కృతి సాంప్రదాయాలు చాలా ప్రాధాన్యత ఇస్తారు.  ప్రతి నెల ఎన్నో రకాల పండుగలను ఎంతో ఘనంగా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.  విశ్వావశునామ సంవత్సరం(2025) జులై 6 వతేదీ ఆదివారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆ రోజు ఏ దేవుడిని పూజించాలి.. ఆ రోజు విశిష్టత ఏంటో తెలుసుకుందాం...

ఆషాడమాసంలో వచ్చే ఏకాదశి( జులై 6)కి ఎంతో ప్రత్యేకత ఉంది.ఆషాఢమాసంలో వచ్చే తొలి  ఏకాదశిని  ఎంతో వేడుకగా జరుపుకుంటారు.  ఈ ఏకాదశిని  తొలి ఏకాదశి, శయన ఏకాదశి,హరివాసరం అని కూడా పిలుస్తారు.  ఆషాఢ మాసం శుక్ల పక్ష ఏకాదశి తిథి ( జులై 6)  రోజున తొలి ఏకాదశి జరుపుకుంటారు. ఈసారి ఈ తిథి జూలై 06, 2025న వచ్చింది. 

హిందూ క్యాలెండర్ ప్రకారం ఏకాదశి తిథి జూలై 05న సాయంత్రం 06:58 గంటలకు ప్రారంభమై... జూలై 06న రాత్రి 09:14 గంటలకు ముగుస్తుంది. ఈ ఏకాదశి రోజు  ( జులై 6) విష్ణుమూర్తి శయన పాన్పుపై భక్తులకు దర్శనమిస్తాడు . కనుక ఈ ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు.

పురాణాల ప్రకారం ఈ ఏకాదశి నుంచి సూర్యుడు దక్షిణాయనం దిశలో మనకు కనిపిస్తారు.తొలి ఏకాదశి ని రైతులు విత్తనాల ఏకాదశిగా కూడా జరుపుకుంటారు.తొలి ఏకాదశి రోజు భక్తులు విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.తొలి ఏకాదశి పండుగ రోజు జరుపుకునే వారు ఉదయమే నిద్ర లేచి ఇంటిని శుభ్రం చేసుకునే విష్ణుమూర్తి  దేవుడి ఫోటో లేదా విగ్రహానికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు చేస్తారు. ఈ సమయంలో విష్ణుసహస్రనామ పారాయణ, విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం లాంటివి చేయాలి. మరుసటి రోజైన ద్వాదశి ( జులై 7) నాడు సమీపంలోని దేవాలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించాలి.

Also Read : ఆషాఢంలో బోనాల పండుగే కాదు... 

 తొలి ఏకాదశి రోజున ఆవులను పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.  ధూపం.. దీపం.. నైవేద్యం తరువాత కర్పూర హారతి ఇవ్వాలి. భక్తులు ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. అసత్యమాడరాదు. దుష్ట పనులు, ఆలోచనలు చేయకూడదు. రాత్రంతా జాగరణ చేయాలి. మర్నాడు శ్రీహరిని పూజించి భోజనం చేయాలి.

ఓం నమో భగవతే వాసుదేవాయ .... ఈ ద్వాదశ మంత్రాన్ని జపించాలి. రామ, కృష్ణ, నారాయణ మొదలైన పేర్లతో భగవన్నామ స్మరణ చేయాలి. విష్ణు శహస్రనామాలను జపించండి. . ఈ పూజ చేసేవారు ధాన్యాలు, పప్పులు, శనగలు, మొక్క జొన్న, గోకరకాయ, చిక్కుడుకాయ, బఠాణిలను ఆహారపదార్ధాలుగా తీసుకోకూడదు.కేవలం పాలు పండ్లు వంటి పదార్థాలను తీసుకుని ఉపవాస దీక్షతో పూజ చేయాలి.

 తొలి ఏకాదశి రోజు విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేస్తారు కనుక ఈరోజు ఎట్టి పరిస్థితులలో తులసీ దళాలను కోయకూడదు. అలాగే స్వామి వారి పూజ అనంతరం స్వామివారికి చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పించి ఆ తరువాత విష్ణు సహస్రనామాలను చదవాలి.అదే విధంగా ఉపవాసం ఉన్నవారు మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు ఉదయమే స్వామివారికి పూజ చేసిన అనంతరం ఉపవాస దీక్ష విరమించాలి.   ఈ విధంగా తొలిఏకాదశి పండుగను హిందువులు ఎంతో భక్తి భావంతో జరుపుకుంటారు.