కార్తీకమాసానికి శివభక్తులు.. విష్ణు భక్తులు.. ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. అందుకే ఈమాసాన్ని ఆధ్యాత్మిక మాసం అంటారు. ఈ నెలలో దీపారాధనలు, ఉపవాసాలు, పూజలు.. దానాలు.. హడావిడి అంతా ఇంతా కాదు. నిండి ఉంటుంది. ఈ పవిత్ర మాసం ఈ ఏడాది (2025) నవంబర్ 20 న కార్తీక అమావాస్య తిథితో ముగుస్తుంది. పురాణాల ప్రకారం ఈ చివరి రోజుకు ఎంతో ప్రాముఖ్యత ఉందని పండితులు చెబుతున్నారు. వివిధ కారణాల వల్ల కార్తీక మాసంలో దీపారాధనలు చేయలేకపోయిన వారు ఈ ఒక్క రోజు చేసే పరిహారంతో అంతటి ఫలాన్ని పొందవచ్చని పండితులు చెబుతున్నారు. ఈ స్టోరీలో కార్తీక అమావాస్య రోజున ఏమి చేయాలో తెలుసుకుందాం. . .
కార్తీక మాసంలో శివుడు విష్ణువును ఒకేసారి ఆరాధించడం వలన అద్భుతమైన ఫలితం లభిస్తుందని నమ్ముతారు. ఈ ఏడాది (2025) కార్తీక మాసం అమావాస్య తిథితో ( నవంబర్ 20) ముగుస్తుంది. కార్తీక మాసంలో చేసిన దీపారాధన ఫలం, దానధర్మాల ఫలం ఈ రోజున మరింత అధికంగా లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
కార్తీకమాసం అమావాస్య రోజున పితృదేవతలను తలచుకొని.. వారికి తర్పణాలు వదలాలి. కార్తీక అమావాస్య రోజున పితృ దేవతలకు పూజలు చేయడం వలన వారి ఆశీస్సులు లభిస్తాయి. పితృదోషాలు తొలగి అన్ని విధాల మంచి జరుగుతుంది.
పురాణాల ప్రకారం కార్తీకమాసంలో బ్రహ్మముహూర్తంలో.. ప్రదోషకాలంలో దీపారాధన చేయాలి. అలా చేస్తే జాతకంలో ఉన్న దోషాలు తొలగి అంతా శుభమే జరుగుతుంది. అయితే ప్రస్తుత కాలంలో జీవన విధానం వలన అలా దీపారాధన చేయడం కుదరని వారు.. కనీసం అమావాస్య రోజున ( నవంబర్ 20)
ఇంటిని శుభ్రం చేసుకుని, దీపారాధనలు చేయడం వలన ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు దూరమవుతాయి.
దీపారాధన చేయలేని వారు ఈ రోజు ఏం చేయవచ్చు?
కార్తీక మాసంలో కొన్ని రోజులు లేదా అసలు దీపారాధనలు చేయలేకపోయిన భక్తులు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. కార్తీక మాసం ఫలం మొత్తం పొందడానికి చివరి రోజైన అమావాస్య నాడు ఈ పనులు చేయవచ్చని చెబుతున్నారు.
క్షమాపణ కోరడం: ముందుగా, మాసం మొత్తం దీపారాధన చేయలేకపోయినందుకు శివుడిని విష్ణువును మనస్ఫూర్తిగా క్షమాపణ కోరాలి.
దీపారాధన: వీలైనన్ని ఎక్కువ దీపాలను (నూనె లేదా నెయ్యితో) వెలిగించాలి. ఇంటి ముందు, పూజా మందిరంలో, తులసి కోట వద్ద, ఆకాశ దీపం (వీలైతే) కూడా వెలిగించి, మాసం మొత్తం దీపం వెలిగించిన ఫలాన్ని పొందడానికి సంకల్పం చెప్పుకోవాలి.
నదీ స్నానం ..దానం: దగ్గరలోని నది లేదా చెరువులో పవిత్ర స్నానం ఆచరించి, పేదవారికి లేదా ఆలయాలకు శక్తి మేరకు దానధర్మాలు చేయాలి. దీపం వెలిగించడానికి నూనె, వత్తులు దానం చేయడం శుభప్రదం. దగ్గరలో నది లేకపోతే ఇంటి దగ్గర బావి దగ్గర గాని.. కుళాయి వద్దగాని స్నానం చేసినా అలాంటి ఫలితమే కలుగుతుంది.
స్నానం చేసేటప్పుడు గంగేచ యమునే చైవ గోదావరీ సరస్వతీ |
నర్మదే సింధు కావేరి జలేయస్మిన్ సన్నిధిం కురు || అనే మంత్రాన్ని చదువుతూ స్నానం చేయాలి.
తరువాత సూర్యభగవానుకి నమస్కరించాలి.
దగ్గరలో ఉన్న శివాలయాలు, విష్ణు దేవాలయాలను దర్శించుకుని, దేవుడికి అభిషేకం లేదా ప్రత్యేక పూజలు చేయాలి. ఇలా చేయడం వలన ఈ మాసానికి సంబంధించిన విశేష ఫలాన్ని పొందవచ్చుని పండితులు చెబుతున్నారు. .
కార్తీక అమావాస్య కేవలం మాసం ముగింపు మాత్రమే కాదు. ఈ మాసంలో చేసిన సత్కర్మల ఫలాన్ని పరిపూర్ణం చేసుకునే ఒక పవిత్ర అవకాశం. ఆ రోజున ( నవంబర్ 20) భక్తి శ్రద్ధలతో దీపం వెలిగించినా, చిన్న దానం చేసినా గొప్ప పుణ్యం లభిస్తుందని పురాణాల ద్వారా తెలుస్తుంది.
