మా అమ్మాయిలను బెదిరించి పెళ్లి చేసుకుంటున్నారు

మా అమ్మాయిలను బెదిరించి పెళ్లి చేసుకుంటున్నారు

జ‌మ్మూక‌శ్మీర్‌లో సిక్కు మ‌తానికి చెందిన ఇద్ద‌రు అమ్మాయిల‌ను బ‌ల‌వంతంగా పెళ్లి చేసుకుని, మ‌త‌మార్పిడి చేసిన‌ ఘ‌ట‌న‌పై కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి కిష‌న్ రెడ్డిని అకాలీద‌ళ్ నేత‌ల బృందం కలిసింది. త‌మ మ‌తానికి చెందిన అమ్మాయిల‌ను గ‌న్‌పాయింట్‌లో బెదిరించి పెళ్లి చేసుకుంటున్నారని నేతలు కిషన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఇటీవ‌ల తమ మతానికి ఇద్ద‌రు అమ్మాయిల‌ను కిడ్నాప్ చేసి, ఆ త‌ర్వాత పెళ్లి చేసుకుని, వారిని ఇస్లాం మ‌తంలోకి మార్చారని నేతలు కిషన్ రెడ్డికి తెలిపారు. ఈ విషయంపై అకాలీద‌ళ్ నేత మ‌ణ్‌జింద‌ర్ సింగ్ సిస్రా ఆధ్వ‌ర్యంలో సిక్కులు నిర‌స‌న‌లు కూడా చేప‌ట్టారు. క‌శ్మీర్‌లో సిక్కు అమ్మాయిల‌ను ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకుంటున్న ఘ‌ట‌న‌లపై చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు.

ఈ విషయంపై స్పందించిన కిషన్ రెడ్డి.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ‘జమ్మూకశ్మీర్‌లో బలవంతపు మతమార్పిళ్లపై ఫిర్యాదు వచ్చింది. సిక్కు మహిళలను తుపాకులతో బెదిరించి మతం మార్చుతున్నారు. గతంలో కశ్మీరీ పండిట్ల విషయంలో కూడా ఇలాగే జరిగింది. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిపై కేంద్ర ప్రభుత్వం, జమ్మూకశ్మీర్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. బాధితులకు రక్షణ కల్పించడంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తాం’ అని అన్నారు.

తెలంగాణలో బీజేపీ బలోపేతాన్ని ఎవరు ఆపలేరు
బీజేపీ పట్ల తెలంగాణ ప్రజలకు రోజురోజుకూ నమ్మకం పెరుగుతుందని ఆయన మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ‘తెలంగాణలో బీజేపీ రోజు రోజుకూ బలపడే దిశగా ముందుకు వెళ్తున్నాం. ఒక ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా తెలంగాణలో బలపడేందుకు ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణలో బీజేపీ బలోపేతాన్ని ఎవరు కూడా ఆపలేరు. అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు వెళ్తాం’ అని ఆయన అన్నారు.

బీజేపీకి ఓటేసిన వారి ఇళ్లు తగలబెడుతున్నారు
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత అక్కడ అనేక దౌర్జన్యాలు జరగతున్నాయి. బెంగాల్‌లో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై కాల్ ఫర్ సంస్థ కేంద్ర ప్రభుత్వానికి నివేదికను అందించింది. బెంగాల్‌లో మమతా బెనర్జీ గెలిచిన తర్వాత ఆమె ప్రభుత్వం చేస్తున్న దురాగతాలపై నివేదిక వచ్చింది. ఎన్నికల అనంతరం అక్కడ జరిగిన అల్లర్ల హింసలో 25 మంది చనిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 వేల హింసాత్మక ఘటనలు జరిగాయి. బీజేపీకి ఓటు వేసిన వారిని గుర్తించి ఇళ్లను తగలబెట్టడం, తాగునీటి కనెక్షన్ కట్ చేయడం వంటివి ఆ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఎక్కడైనా శాంతిభద్రతల సమస్యలుంటే గవర్నర్ చొరవ తీసుకుంటారు. కానీ, గవర్నర్‌పై కూడా బెంగాల్ సీఎం మమత.. అసత్య ఆరోపణలు చేస్తుంది. ఒక మహిళ ముఖ్యమంత్రిగా ఉన్నాకూడా అక్కడ మహిళలకు రక్షణ లేదు. రాష్ట్రంలో 7 వేల మంది మహిళలపై దాడులు జరిగాయని నివేదిక ద్వారా తెలిసింది. ఈ సంస్థ ఇచ్చిన నివేదికను త్వరలోనే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు అందజేస్తాను. బెంగాల్‌లో నెలకొంటున్న విధ్వంసంపై అమిత్ షాతో చర్చించిన తర్వాత సరైన నిర్ణయం తీసుకుంటాం’ అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.