చెన్నూరు, వెలుగు: మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని పంచముఖాంజనేయ ఆలయ సమీపంలోని కాంగ్రెస్ నేత అయిత హిమవంతరెడ్డి ఇంట్లో దొంగలు పడి రెండు కిలోల వెండి, రూ.70 వేల నగదు ఎత్తుకెళ్లారు. సీఐ బన్సీలాల్వివరాల ప్రకారం.. హిమవంతరెడ్డి తన కుటుంబసభ్యులతో కలిసి ఈ నెల 4న తిరుపతి వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లారు. తిరిగి ఈ నెల 13న రాత్రి ఇంటికి వచ్చారు. తలుపుల తాళాలు పగులగొట్టి ఉండడంతో చోరీ జరిగిందని అనుమానించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు.
గురువారం ఉదయం మంచిర్యాల క్లూస్ టీం సీఐ అశోక్ ఆధ్వర్యంలో ఆధారాలు సేకరించారు. సీసీ కెమెరాలను పరిశీలించగా ఈనెల 5న రాత్రి ఒంటి గంటకు మాస్కులు ధరించిన ఇద్దరు దొంగలు ప్రహరీ దూకి ఇంట్లోకి చొరబడినట్లు రికార్డయ్యింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
