వెండే బంగారమాయెనా..! ఒక్కరోజే రూ.8,500 జూమ్

వెండే బంగారమాయెనా..! ఒక్కరోజే రూ.8,500 జూమ్

న్యూఢిల్లీ: వెండి ధరలు శుక్రవారం (అక్టోబర్ 10) ఒక్కరోజే రూ.8,500 పెరిగి  ఢిల్లీలో కిలోకి రూ.1,71,500కు చేరాయి. ఇది ఆల్‌‌టైం రికార్డు ధర. గ్లోబల్‌‌ అనిశ్చితుల మధ్య బంగారం, వెండి వంటి సేఫ్ అసెట్స్‌‌లోకి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి.  దీంతోపాటు వెండి సప్లయ్‌‌లో ఇబ్బందులతో  దీని ధరలు చుక్కలనంటుతున్నాయి. 

గత మూడు సెషన్లలో వెండి ధర కిలోకి  రూ.17,500 పెరగడం విశేషం. గురువారం ఇది రూ.1,63,000 వద్ద ముగిసింది. ఇదిలా ఉండగా, బంగారం ధరలు శుక్రవారం రికార్డు స్థాయిల నుంచి తగ్గాయి. 99.9శాతం స్వచ్ఛత గల బంగారం ధర  రూ.600 తగ్గి 10 గ్రాములకు  రూ.1,26,000 కు చేరింది. 

డాలర్ బలహీనత, ఫెడరల్ రిజర్వ్ రేటు తగ్గింపు అంచనాలు, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు బులియన్ మార్కెట్‌‌కు మద్దతునిస్తున్నాయి. వెండి తీవ్ర సరఫరా సమస్యలను ఎదుర్కొంటోందని మోతీలాల్‌‌ ఓస్వాల్ ఎనలిస్ట్‌‌  మానవ్ మోదీ అన్నారు.  అంతర్జాతీయంగా, వెండి ధర ఔన్స్ (28 గ్రాములకు) 50.01 డాలర్ల వద్ద , బంగారం ధర  3,992.80 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.