24 రోజుల్లో.. 40 వేలు తగ్గిన వెండి : ట్రంప్ దెబ్బకు లబోదిబో అంటున్న కొన్నోళ్లు

24 రోజుల్లో.. 40 వేలు తగ్గిన వెండి : ట్రంప్ దెబ్బకు లబోదిబో అంటున్న కొన్నోళ్లు

ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల పతనం ఇన్వెస్టర్లను కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా వెండి ధరలు మార్చి నెలలో ఊహించని విధంగా కుప్పకూలాయి. గత 45 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా.. కేవలం ఒక్క నెలలోనే సుమారు 33 శాతం మేర వెండి ధర పడిపోవడం గమనార్హం. అంటే 2026 ప్రారంభం నుండి వచ్చిన లాభాలన్నీ ఈ ఒక్క నెలలోనే తుడిచిపెట్టుకుపోయాయి. గత కొన్ని నెలలుగా బంగారం కంటే దూకుడుగా దూసుకుపోయిన వెండి ఇప్పుడు 'బేర్ మార్కెట్' లోకి ప్రవేశించిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

మార్చి నెలలో వెండి ఎంత తగ్గింది?
అంతర్జాతీయ మార్కెట్ లెక్కల ప్రకారం.. వెండి ధరలు మార్చి నెలలో దాదాపు 33 శాతం క్షీణించాయి. గరిష్టాల నుండి చూస్తే ఇది 41 శాతానికి పైగానే పతనం అయ్యింది. మార్చి ప్రారంభంలో వెండి ధర అంతర్జాతీయంగా ఉన్న స్థాయిల నుండి 33 శాతం తగ్గిందంటే.. కేజీ వెండిపై దాదాపు రూ.35వేల నుంచి రూ.40వేల వరకు భారీ కోత పడింది. ఇటీవల వెండి తన గరిష్ట స్థాయి 121 డాలర్ల నుంచి ప్రస్తుత పతనంతో ఔన్సు రేటు 64 డాలర్ల స్థాయిని దాటి కిందకు పడిపోయింది.

ధరలు తగ్గడానికి ప్రధాన కారణాలు:
అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ పై యుద్ధం స్టార్ట్ చేసిన తర్వాత బాండ్ పెట్టుబడులపై రాబడులు పెరగడం వెండికి శాపంగా మారింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచవచ్చనే సంకేతాలు ఇవ్వడంతో, పెట్టుబడిదారులు వెండిని వదిలి బాండ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. దీనికి తోడు క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం పెరిగి ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్ల కోతలను వాయిదా వేస్తున్నాయి. దీనికి తోడు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల స్టాక్ మార్కెట్లు పడిపోతున్న సమయంలో మార్జిన్ కాల్స్ చెల్లించడానికి ఇన్వెస్టర్లు తమ వద్ద ఉన్న వెండిని అమ్మేసి డబ్బు పోగుచేసుకోవటం కూడా ఈ పతనానికి ఒక కారణం.

ALSO READ : తులం బంగారం ఇవాళ 3 వేలు తగ్గింది.. నిన్నయితే ఏకంగా రూ.2వేల 700 డౌన్

ఇన్వెస్టర్లు ఏం చేయాలి?
ఇది దీర్ఘకాలిక బుల్ మార్కెట్‌లో ఒక చిన్న విరామం మాత్రమే అంటున్నారు నిపుణులు. ధరలు భారీగా తగ్గినప్పుడు ఒకేసారి కాకుండా విడతల వారీగా వెండిని కొనుగోలు చేయడం ఉత్తమమని వెల్త్‌మిల్స్ సెక్యూరిటీస్ వంటి సంస్థలు సూచిస్తున్నాయి. ఆందోళనతో విక్రయించేకంటే, పతనాన్ని పెట్టుబడి అవకాశంగా మార్చుకోవడమే తెలివైన పనిగా వారు సూచిస్తున్నారు. మార్చి 24 మంగళవారం వెండి రేటు తెలుగు రాష్ట్రాల్లో కేజీకి రూ.5వేలు పెరిగి రూ.2లక్షల 40వేలుగా రిటైల్ మార్కెట్లో కొనసాగుతోంది.