న్యూఢిల్లీ: వెండి ధర ఢిల్లీ మార్కెట్లో బుధవారం రూ.ఐదు వేలు పెరిగి కిలో రూ.2.56 లక్షల కొత్త రికార్డు స్థాయికి చేరింది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం.. మంగళవారం ధర రూ.2.51 లక్షల వద్ద ముగిసింది. యూఎస్, వెనిజువెలా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, పారిశ్రామిక వినియోగం, సరఫరా ఇబ్బందుల వల్ల ధరలు పెరిగాయి. ఈ నెల ఒకటో తేదీ నుంచి అమలులోకి వచ్చిన చైనా ఎగుమతి ఆంక్షలు కూడా ధరలపై ప్రభావం చూపాయని నిపుణులు చెప్పారు. అయితే, పది గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గి రూ.1,41,400 వద్ద ఉంది.
పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం, యూఎస్ డాలర్ కోలుకోవడంతో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ విశ్లేషకుడు సౌమిల్ గాంధీ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ 1.01 శాతం తగ్గి 4,449.87 డాలర్లకు పడిపోయింది. స్పాట్ సిల్వర్ 3.15 శాతం తగ్గి 78.69 డాలర్ల వద్ద ఉంది. వెండి ధరలు భవిష్యత్తులో రూ.2.66 లక్షల స్థాయికి చేరే అవకాశం ఉందని ఆగ్‌మాంట్ పరిశోధన విభాగం అధిపతి రేనిషా అన్నారు.
