11 ఏళ్లుగా డుమ్మా.. ఎల్పీసీ లేకుండా డిప్యుటేషన్

11 ఏళ్లుగా డుమ్మా.. ఎల్పీసీ లేకుండా డిప్యుటేషన్
  • జీతం చెల్లింపుపై కూడా స్పష్టత లేకుండానే డిప్యుటేషన్ పై బదిలీ
  • ఏపీ విద్యాశాఖలో అవకతవకలపై మరోసారి దుమారం
  • ఎస్ఆర్/ ఎల్ పీసీ లేకుండానే హైదరాబాద్ రాజేంద్రనగర్ స్కూల్ లో చేరిక
  • 17 నెలలుగా జీతం చెల్లింపుపై మడతపేచీ 
  • తెలంగాణలో పనిచేస్తే ఇక్కడి నుంచి ఎలా జీతం చెల్లించాలంటున్న విద్యాశాఖ
  • పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడారని బీటీఎఫ్ ఆందోళన

అమరావతి: అవినీతి అక్రమార్కులకు ఏపీ విద్యాశాఖ కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోందా.. ? రూల్స్ కు విరుద్ధంగా ఏం చేసినా చెల్లుబాటు చేసుకోవచ్చా.. ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉందా..? వారి సమ్మతితోనే జీవోలు/ ఉత్తర్వులు జారీ అవుతున్నాయా.. లేక గుడ్డిగా జారీ చేసేస్తున్నారా..? తాజా ఘటనలు చూస్తుంటే పై సందేహాలన్నీ నిజమేనని నిర్ధారణ అవుతోంది. లాంగ్వేజ్ పండిట్లకు పదోన్నతులు కల్పించకుండా సంఖ్యాబలం ఉందని ఎస్జీటీలకు పదోన్నతులు కల్పించి ప్రభుత్వ ఖజానాకు కోట్లాది రూపాయలు తూట్లుపొడిచిన విధానంపై దుమారం చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఈ  క్రమంలోనే తాజాగా 11 ఏళ్లుగా ఓ టీచర్ తరచూ డ్యూటీకి డుమ్మా కొడుతుంటే ఆమె స్థానంలో మరొకరిని నియమించకుండా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధనకు దూరం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. తరచూ అనుమతిలేకుండా డ్యూటీకి డుమ్మాకొడుతూ పలుమార్లు జీతాలు తీసుకున్న సదరు టీచర్ ఎస్ఆర్,ఎల్పీసీ లేకుండానే డిప్యుటేషన్ పై పక్క రాష్ట్రం తెలంగాణకు బదిలీ చేయించుకున్న వైనం విద్యాశాఖలో ప్రకంపనలు సృష్టిస్తోంది. భార్యా భర్తలు స్పౌస్ కేటగిరీలో నిబంధనలను తమకు అనుకూలంగా అన్వయించుకుని ఎలాంటి ఎస్ఆర్, ఎల్పీసీ (లాస్ట్ పే సర్టిఫికెట్) లేకుండానే అంతర్ రాష్ట్ర డిప్యుటేషన్ వేయించుకున్నారు. సరే ఏపీ అధికారులు గుడ్డిగా డిప్యుటేషన్ ఆర్డర్స్ ఇస్తే.. తెలంగాణలోని రంగారెడ్డి జిలా రాజేంద్రనగర్ లోని ఉర్దూ స్కూల్ లో ఎలా చేర్చుకున్నారనేది అర్థం కాని ప్రశ్న. అంతేకాదు ఎల్పీసీ, ఎస్ఆర్ లేకుండానే ఏడాదిన్నరగా పనిచేస్తుంటే ఎలా కొనసాగనిచ్చారన్నది అంతుచిక్కని మరో ప్రశ్న. ఇప్పుడు సదరు టీచర్ కు జీతం ఎవరు చెల్లించాలి.. ఏ ప్రభుత్వం చెల్లించాలన్నది అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఇర్రెగ్యులర్ వివరాలను తేల్చడం విద్యాధికారులకు సవాల్ విసురుతోంది.  
గజిబిజీ డ్యూటీలతో తరచూ డుమ్మా.. విచారణలో బయటపడిన డొంక
శ్రీమతి నఫీజ్ నాజ్ నీన్ అనే ఉర్దూ ఉపాధ్యాయురాలు 2008 నుండి 2019 వరకు తాను పనిచేసిన కర్నూలు జిల్లా సంజామల మండలం నొస్సం పాఠశాలకు,  అక్కడ నుండి నందికొట్కూరు మండలం మాల్యాల పాఠశాలకు,  అక్కడ నుండి  దొర్నిపాడు మండలం చాకరాజవేముల పాఠశాలలకు నిత్యం మెడికల్ లీవులు, జీతం లేని సెలవులు పెడుతూ అనేకమార్లు డుమ్మాలు కొట్టారు. దాదాపుగా  1742 రోజులు పైబడి  పాఠశాలకు డుమ్మా కొట్టినట్లు స్పష్టంగా కనిపిస్తున్నా.. అధికారులు ప్రేక్షకపాత్రకే పరిమితం అయ్యారు. నిరుపేద విద్యార్థులు సరైన విద్యా బోధనకు నోచుకోవడం లేదని ఫలితంగా నిరుపేద ముస్లిం విద్యార్థులకు నాణ్యమైన విద్య అందక తీవ్రంగా నష్టపోతున్నారని బహుజన టీచర్స్ ఫెడరేషన్ సాక్షాధారాలతో ఫిర్యాదు చేసింది. అయితే అధికారులకు ఆమె సర్వీసు రిజిస్టరే దొరకలేదు. బలమైన సాక్షాధారాలు ఉండడంతో వివరణ కోరుతూ ఉపాధ్యాయురాలికి నోటీసులిచ్చారు. అధికారులకు ఆమె సర్వీసు రిజిస్టరే దొరకలేదు.. ఆమె మాత్రం డూప్లికేట్ ఎస్.ఆర్ చూపిస్తోంది. ఎస్ఆర్ పోగొట్టుకుంటే డూబ్లికేట్ ఎప్పుడు.. ఎవరు జారీ చేశారో తెలియదు.  కానీ అందులో వివరాలేమీ లేకుండా పోవడంతో విద్యాధికారులు తెల్లమొహం వేయాల్సి వచ్చింది.. డ్యూటీకి ఇర్రెగ్యులర్ గా .. అనుమతి లేకుండా డుమ్మా కొట్టడంతో పలువురు మండల విద్యాధికారులు ఆమెకు జీతం ఇచ్చేందుకు.. సెలవు ఇచ్చేందుకు నిరాకరిస్తూ డీఈఓకు లేఖలు రాశారు. ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు ఉపాధ్యాయురాలు ఏపీ నుండి తెలంగాణకు వెళ్లేందుకు 2020 జనవరి లో తెలంగాణకు డిప్యుటేషన్ వేయించుకున్నారు. భార్యా భర్తల కేటగిరీ కింద వేయించుకునే అవకాశం ఉండడంతో ఆ కోటాలో డిప్యుటేషన్ వేయించుకున్నట్లు అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడా ట్విస్టులే. సర్వీసు రిజిస్టర్ కాని.. లాస్ట్ పే సర్టిపికెట్ కానీ లేకుండానే తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని ఎంపీపీ ఉర్దూ స్కూ ల్ కు డిప్యుటేషన్ పై వెళ్లిపోయింది. 
ఇర్రెగ్యులర్ టీచర్ వ్యవహారం తేల్చేందుకు ఐదుగురు విద్యాధికారుల విచారణ
11 ఏళ్లుగా ఎలాంటి అనుమతి లేకుండా డ్యూటీకి డుమ్మా కొడుతూ.. ఎస్ఆర్, ఎల్పీసీ లేకుండానే ఏడాదిన్నర కిందట తెలంగాణకు డిప్యుటేషన్ పై వెళ్లిన ఉర్దూ ఉపాధ్యాయురాలి వ్యవహారంలో వాస్తవాలు నిగ్గుతేల్చేందుకు విద్యాధికారులు విచారణ కమిటీని నియమించారు. కర్నూలు బహుజన టీచర్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక జిల్లా అధ్యక్షులు కె. సతీష్ కుమార్ గత ఏప్రిల్ నెల 26వ తేదీన ఫిర్యాదు చేయగా, విచారణకు కమిటీని వేశారు. ఈ మేరకు కర్నూలు డీఈఓ కార్యాలయంలో విచారణ అధికారులు మహమ్మద్ బేగ్, ఆదాం బాషా విచారణ ప్రారంభించారు. సంజామల ఎంఇఓ, రఘురామి రెడ్డి,  నందికొట్కూరు ఎంఇఓ ఫైజాన్నిసా, దొర్నిపాడు ఎంఇఓ మనోహర్ రెడ్డి ఆయా మండలాల్లోని స్కూళ్లలో పనిచేసిన కాలానికి సంబంధించిన హాజరుపట్టీలు, ఇతర రికార్డ్స్ అందజేశారు.
పొంతన లేని సెలవులు.. అనుమతిలేకుండానే డుమ్మా
11 ఏళ్లుగా తరచూ డుమ్మా కొట్టిన శ్రీమతి నఫీజ్ నాజ్ నీన్ ఏ స్కూ లో ... ఏ మండలంలో ఎన్ని రోజులు పనిచేసిందన్నది ఎక్కడా స్పష్టత లేదు. కొన్నిసార్లు ఆమె జీతాలు కూడా తీసుకున్నట్లు కనిపిస్తున్నా.. ఏ పీరియడ్ కు ఎలా జీతాలు చెల్లించారన్న వివరాలు కూడా అధికారుల వద్ద లేవు. అసలెప్పుడు జాయిన్ అయిందని చూడగా ఏపీలోని కడప జిల్లా సరిహద్దులో కర్నూలు జిల్లాలోని సంజామల మండలం నొస్పం ప్రభుత్వ ఉర్దూ ప్రాధమిక పాఠశాలలో 2003 సంవత్సరం జనవరి 1వ తేదీన చేరిన శ్రీమతి నఫీజ్ నాజ్ నీన్ చేరినట్లు తేలింది. అటు తర్వాత 2011లో ట్రాన్స్ ఫర్ ద్వారా నందికొట్కూరు మండలంలోని మాల్యాల ఎంపీపీ ఉర్దూ పాఠశాలలో చేరింది. అక్కడ నుండి దొర్నిపాడు మండలం చాకరాజువేముల ఎంపీపీ ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో 2015 లో చేరింది. ఆమె సర్వీసు రిజిస్టర్ ఒరిజినల్ పోయిందని చెప్పి డూప్లికేట్ జారీ చేయించుకున్న వైనం ఆశ్చర్యం కలిగిస్తోంది. అందులో ఎలాంటి వివరాలు లేకపోవడంతో విద్యాధికారులు తలలు పట్టుకున్నారు. చివరకు ఉత్తర ప్రత్యుత్తరాల ఆధారంగా చూడగా  2008 నుండి 2019 వరకు నిత్యం మెడికల్ లీవు,  ఈఓఎల్ (EOL) పెట్టినట్లు తేలింది. సర్వీస్ రిజిస్టర్ పోగొడితే, సంవత్సరాల తరబడి ఇర్రెగులర్ గా ఉంటే ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఎలా సహకరించారన్నది అంతు చిక్కని ప్రశ్నగా మిగిలింది. ఒక టీచర్ ఇర్రెగ్యులర్ అవుతుంటే.. ప్రభుత్వ ఖజానాకు.. లేదా సదరు టీచర్ కు వ్యక్తిగత నష్టం అనేది పక్కన పెడితే.. ఆమె స్థానంలో నిరుపేద విద్యార్థులకు బోధన చేసేందుకు మరొక టీచర్ ను నియమించకుండా కాలయాపన చేయడం అధికారుల తప్పిదాన్ని ఎత్తిచూపుతోంది. అంతే కాదు విద్యాశాఖలో ఎన్ని తప్పులు చేసినా చెల్లుబాటు అవుతుందనే ఆరోపణలకు నిదర్శనంలా నిలుస్తోంది.  పేద విద్యార్థుల భావి జీవితాలతో చెలగాటం ఆడారన్న ఆరోపణలకు విద్యాధికారుల దగ్గర సమాధానం కనిపించని పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు ఇప్పుడు తెలంగాణలో స్కూల్ లో పనిచేస్తున్న విషయం కూడా వివాదాస్పదంగా మారింది. ఇక్కడి అధికారులు కళ్లు మూసుకుని గుడ్డిగా ఉత్తర్వులిస్తే.. ఎస్ఆర్, ఎల్పీసీ లేకుండా 17 నెలలుగా తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా విద్యాధికారులు ఎలా సహకరిస్తున్నారు.. అనేది అర్థం కాని విషయం. అధికారులు నిజాయితీగా చిత్తుశుధ్దితో విచారణ జరిపితే ఇలాంటి మరిన్ని అక్రమాలు వెలుగులోకి వస్తాయని..  విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు అధికారులు కృషి చేయాలని బీటీఎఫ్ తరపున సతీష్ కుమార్ అధికారులను కలసి విజ్ఞప్తి చేశారు.