ఈ ఊరిలో గణేశ్ నిమజ్జనం చేయరు.. ఎందుకంటే

ఈ ఊరిలో గణేశ్ నిమజ్జనం చేయరు.. ఎందుకంటే

కలిమిలేముల తేడాలు లేకుండా అందరూ గణపయ్యని  ప్రతిష్ఠిస్తారు ఈరోజు. ఘనంగా పూజలు చేసి, ఆయనికి ఇష్టమైన వంటకాల్ని నైవేద్యంగా పెడతారు. డప్పుల చప్పుళ్ల మధ్య  తొమ్మిది లేదా పదకొండో రోజు గంగమ్మ ఒడికి చేరుస్తారు. కానీ,  నిర్మల్​ జిల్లాలోని బోసి గ్రామం,  తెలంగాణ– మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న పాలజ్‌‌‌‌లోని  కర్ర గణేశులకి మాత్రం నిమజ్జనం ఉండదు. ఇలా చేయడం వెనుక  ఏండ్ల నాటి చరిత్ర ఉంది.

గణేశుని నవరాత్రులంటే ఊరూవాడా తేడా లేకుండా వీధికొక వినాయకుడినైనా ప్రతిష్ఠిస్తారు. కానీ, నిర్మల్ జిల్లా తానూర్‌‌‌‌‌‌‌‌ మండలం బోసి గ్రామంలో మాత్రం 58 ఏండ్ల నుంచి ఒకే ఒక్క వినాయకుడు దర్శనమిస్తున్నాడు. అది కూడా కొయ్యతో తయారై. 1963 ఈ వినాయకుడ్ని తయారుచేశారట. అప్పట్నించీ ఏటా వినాయక చవితి ఉత్సవాల్లో ఈ విగ్రహాన్నే ప్రతిష్ఠించి ఘనంగా పూజలు చేస్తున్నారు గ్రామస్తులు. పదకొండో రోజు విగ్రహాన్ని నిమజ్జనం చేయకుండా బావి నీళ్లను చల్లి ఊళ్లోని లక్ష్మీనారాయణ గుడిలో  భద్రపరుస్తున్నారు. మళ్లీ తర్వాతి సంవత్సరం ఉత్సవాలకు ఆ విగ్రహానికి రంగులద్ది ప్రతిష్ఠిస్తారు. ఏటా ఇదే విగ్రహాన్ని పూజిస్తుండటం వల్లనే గ్రామంలో సిరిసంపదలు నెలకొన్నాయని చెప్తున్నారు ఊరిజనం. ఇక్కడ జరిగే వినాయక ఉత్సవాల్ని చూడ్డానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.

పాలజ్​ గ్రామంలో 

మహారాష్ట్రలోని బోకర్​ తాలుకా పాలజ్​లోనూ వినాయక నవరాత్రుల్లో కొయ్య గణేశుని పూజిస్తున్నారు. అది కూడా 1948 నుంచి. ఈ కర్ర వినాయకున్ని ప్రతిష్ఠించక ముందు పాలజ్​లోని జనాలంతా  కలరా, ప్లేగు వ్యాధులు బారిన పడ్డారట. అదే టైంలో వినాయక చవితి రావడంతో ఊరి జనమంతా  అన్ని ఆపదలు తొలగిపోవాలని నకాషీ కళాకారుడు గుండాజీ వర్మతో కొయ్యతో వినాయకుడి విగ్రహాన్ని తయారుచేయించి ఘనంగా పూజలు చేశారట. అందరి ఆరోగ్యం కుదుటపడటంతో అప్పట్నించీ ఏటా వినాయకచవితికి ఆ కొయ్య గణేశుడిని ప్రతిష్ఠిస్తున్నారు. అయితే ఈ వినాయకుడ్ని నిమజ్జనం చేయరు. ఉత్సవాల చివరిరోజు ప్రత్యేకంగా తయారు చేయించిన రథంలో వినాయకుడ్ని డప్పుల చప్పుళ్లతో  ఊరేగింపు తీసి దగ్గర్లోని వాగుకి తీసుకెళ్తారు. ఆ నీళ్లని విగ్రహంపై పోసి నిమజ్జనంగా భావిస్తారు. తర్వాత కొయ్య వినాయకుడి విగ్రహాన్ని తిరిగి గుడిలోని బీరువాలో భద్రపరుస్తారు. వినాయక నవరాత్రులప్పుడు మాత్రమే పాలజ్‌‌‌‌ కొయ్య గణేశుడు దర్శనమిస్తాడు. మిగతా రోజుల్లో ఇక్కడి గుడిలో గణేశుడి ఫొటో మాత్రమే ఉంటుంది.   :::జి.విఠల్, కుభీర్​​, వెలుగు