పెద్ద కూతురు కోసం హైకోర్టును ఆశ్రయించిన సింధు శర్మ

పెద్ద కూతురు కోసం హైకోర్టును ఆశ్రయించిన సింధు శర్మ

హైదరాబాద్ : విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహన్ రావు మనవరాలిని అప్పగించే  వ్యవహారం హైకోర్టుకు చేరింది. కుమార్తె రిషిక కోసం రామ్మోహన్ రావు కోడలు సింధు శర్మ హైకోర్టును ఆశ్రయించింది. కుమార్తె ఆచూకీ తెలపాలంటూ సింధు శర్మ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. ఆమె దాఖలు చేసిన లంచ్ మోషన్‌ పిటిషన్‌ పై హైకోర్టు విచారణ జరిపింది. గురువారం రిషికతో పాటు ఆమె తల్లిదండ్రులు సింధు శర్మ, వశిష్టలను తమ ఎదుట హాజరు పరచాలని హైదరాబాద్ మధ్య మండలం డీసీపీని హైకోర్టు ఆదేశించింది.

భర్త, అత్తా మామల నుంచి తన పిల్లలను పొందేందుకు సింధుశర్మ పోరాటం చేయగా.. ఇప్పటికే ఆమెకు చిన్న కుమార్తెను అప్పగించారు. ఆదివారం ఉదయం నుంచి  రామ్మోహన్‌ రావు ఇంటి బయట సింధుశర్మ సహా ఆమెకు మద్దతుగా మహిళా సంఘాలు ధర్నా చేశాయి. దీంతో సాయంత్రం చిన్నపాప శ్రీవిద్యను తల్లి సింధుశర్మకు పోలీసులు అప్పగించారు. పెద్ద కుమార్తె రిషిక అప్పగింత వ్యవహారంలో సోమవారం నాంపల్లిలోని భరోసా కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మూడున్నరేళ్ల పెద్ద కుమార్తెను కూడా అప్పగించే వరకూ తన పోరాటం ఆగదంటూ చెప్పిన సింధుశర్మ హైకోర్టును ఆశ్రయించింది.