లద్నాపూర్ ​నిర్వాసితులపై సింగరేణి దౌర్జన్యం

లద్నాపూర్ ​నిర్వాసితులపై సింగరేణి దౌర్జన్యం

పెద్దపల్లి, వెలుగు:పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లద్నాపూర్​నిర్వాసితులపై సింగరేణి యాజమాన్యం గురువారం రాత్రి దౌర్జన్యానికి దిగింది. అర్ధరాత్రి పూట అధికారులు బుల్డోజర్లతో వెళ్లి ఇండ్లు కూల్చే ప్రయత్నం చేశారు. కోపోద్రిక్తులైన గ్రామస్తులు తిరగబడడంతో పోలీసులు వచ్చి 20 మందిని అరెస్టు చేసి ముత్తారం పోలీస్​స్టేషన్​కు తరలించారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులంతా ఓసీపీ2 మెయిన్​ గేట్​వద్ద ఆందోళనకు దిగారు. పూర్తి పరిహారం చెల్లించేంత వరకు ఇండ్లను వదిలిపెట్టిపోయేది లేదని, అప్పటి వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించడంతో అధికారులు దిగివచ్చారు.  

అర్ధరాత్రి పూట బుల్డోజర్లతో..

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ఆర్జీ–3 ఓపెన్​కాస్ట్​–2 విస్తరణలో భాగంగా రామగిరి మండలం లద్నాపూర్​ గ్రామంలోని వ్యవసాయ భూములతో పాటు హ్యాబిటేషన్లను సింగరేణి స్వాధీనం చేసుకుంది. వివిధ దశల్లో వ్యవసాయ భూములకు సంబంధించిన పరిహారాన్ని చెల్లించింది. లద్నాపూర్ లో ఉన్న 283 ఇండ్లకు సంబంధించిన పరిహారం, రీహ్యాబిటేషన్​ను మాత్రం కల్పించలేదు. దీంతో బాధితులు ఎన్నోసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయారు. అయినా సమస్య పరిష్కారం కాలేదు. దీంతో బాధితులు కోర్టును ఆశ్రయించారు. గతంలో చాలాసార్లు ఇండ్లను ఖాళీ చేయించడానికి సింగరేణి ప్రయత్నం చేసింది. గురువారం రాత్రి కూడా సింగరేణి అధికారులు బుల్డోజర్లతో వెళ్లి ఇండ్లను కూల్చేందుకు ప్రయత్నించారు.  ఈ క్రమంలోనే బాధిత కుటుంబాలు అధికారులను, సిబ్బందిని అడ్డుకున్నారు. అధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బాధిత కుటుంబాలకు చెందిన 20 మందిని అరెస్టు చేశారు. కోపోద్రిక్తులైన గ్రామస్తులంతా ఓసీపీ మెయిన్​గేట్ ​ముందు నిరసనకు దిగారు. దీంతో ఓసీపీ నుంచి బొగ్గు రవాణా చేసే టిప్పర్లు నిలిచిపోయి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో పెద్దపల్లి జడ్పీ చైర్మన్​తో పాటు పలువురు రాజకీయ నాయకులు ఆందోళనకారులకు సంఘీభావంగా నిరసనలో పాల్గొన్నారు. ఉదయం 5 గంటల నుంచి కొనసాగిన ఆందోళన మధ్యాహ్నం ఆర్డీఓ నరసింహమూర్తి వచ్చి బుధవారం చర్చలకు రావాలని కోరడంతో ముగిసింది.

బందిపోటు దొంగలా ఏంది ? 

సింగరేణి యాజమాన్యం లద్నాపూర్​గ్రామస్తులతో బందిపోటులా వ్యవహరించిందని పెద్దపల్లి జడ్పీ చైర్మన్​పుట్ట మధు అన్నారు. గ్రామస్తుల ఆందోళనకు సంఘీభావం తెలపడంతో పాటు సింగరేణి, పోలీసులు, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బందిపోటు దొంగలు రాత్రిపూట ఊరుమీద పడి దోచుకుపోతారని, వారిలాగానే అధికారులు ప్రవర్తించారన్నారు. పోలీసులు కూడా అత్యుత్సాహానికి పోతున్నారన్నారు. ఇలా చేస్తే కేసులు పెడుతామన్నారు. స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్​బాబు సింగరేణికి అమ్ముడుపోయాడన్నారు. ఎంపీటీసీలను, సర్పంచులను అరెస్టు చేస్తామంటే సహించేది లేదన్నారు. న్యాయం జరుగకపోతే కోర్టులను ఆశ్రయిస్తామన్నారు.

పునరావాసం కల్పించేదాక  ఎక్కడడికీ పోయేది లేదు 

ఓసీపీ కింద మా భూములు పోయినయి. 20 ఏండ్ల కింద చాలా తక్కువ పైసలిచ్చి  భూములు తీసుకున్నరు.  అప్పుడు మాకు పునరావాసం కల్పిస్తామని సింగరేణి చెప్పింది. వ్యవసాయ భూములకు పరిహారం ఇచ్చింది. కానీ ఇండ్లకు ఇవ్వలేదు. అంతేగాక ఎక్కడా పునరావాసం చూపించకుండా ఖాళీ చేసి పొమ్మంటుంది. నష్టపరిహారంతో పాటు పునరావాసం కల్పించేదాక ఎక్కడికీ పోయేది లేదు.  
- శ్యామల, నిర్వాసితురాలు, లద్నాపూర్

పోలీసుల బెదిరింపులకు భయపడం

మాకిచ్చే పరిహారం ఇయ్యకుండా పోలీసులతో బెదిరించాలని చూస్తున్నరు. రాత్రి పూట వచ్చి ఇండ్ల మీద పడి ధ్వంసం చేస్తున్నరు. మా వాళ్లను పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లిన్రు. మాకు న్యాయంగా ఇవ్వాల్సింది ఇవ్వకుండా  దౌర్జన్యం చేస్తున్నరు. అరెస్టులకు, బెదిరింపులకు భయపడం. మాకు పరిహారం ఇచ్చేదాక ఊరును ఖాళీ చేయం.  
- బడికెల విజయ, సర్పంచ్, లద్నాపూర్