- 10 కొత్త బొగ్గు బ్లాకుల సాధనే లక్ష్యం
- జాయింట్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: కార్మికుల సమస్యల పరిష్కారానికి సింగరేణి సంస్థ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, మెడికల్ అటెండెన్స్ నిబంధనలను సరళతరం చేస్తామని సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ హామీ ఇచ్చారు. సకాలంలో పదోన్నతులు, విచారణలు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. త్వరలో జరగబోయే వేలంలో 10 బొగ్గు బ్లాకులు సాధించి, సింగరేణిని 100 మిలియన్ టన్నుల ఉత్పత్తి స్థాయికి చేర్చే లక్ష్యంతో ముందుకు సాగుతామని ప్రకటించారు.
సింగరేణి భవన్‌లో జరిగిన 38వ జాయింట్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘గుర్తింపు పొందిన కార్మిక, అధికారుల సంఘాల ప్రతినిధులతో జరిగిన చర్చలు నిర్మాణాత్మకంగా సాగాయి. సంఘాలు లేవనెత్తిన అంశాలపై చర్చించి సానుకూల నిర్ణయాలు తీసుకుంటాం. అధికారులు, కార్మికులు క్రమశిక్షణతో రోజుకు 8 గంటలపాటు కచ్చితంగా పనిచేయాలి. ప్రమాదరహిత సింగరేణి లక్ష్యంగా అందరూ కృషి చేయాలి. గతంలో బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొనకపోవడంతో కొత్త బ్లాకులు చేపట్టలేకపోయాం. రాబోయే 100కు పైగా బ్లాకుల వేలంలో కనీసం 10 లాభసాటి బ్లాకులు సాధించేలా చర్యలు ప్రారంభించినం’’అని ఆయన పిలుపునిచ్చారు.
వివిధ రంగాల్లో వ్యాపార విస్తరణ
బొగ్గు ఆధారిత సంస్థగానే కాకుండా, సింగరేణి వివిధ రంగాల్లో విస్తరించాలని నిర్ణయించుకున్నామని సీఎండీ బలరామ్ తెలిపారు. కీలక ఖనిజాల అన్వేషణ, ఉత్పత్తి కోసం జాతీయ స్థాయి పరిశోధనా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని అన్నారు. దేశంలోని 10 రాష్ట్రాలతో పాటు చిలీ, బ్రెజిల్, అర్జెంటీనా, ఆస్ట్రేలియా వంటి ఐదు దేశాల్లో కార్యకలాపాలను విస్తరించే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.
‘‘సింగరేణి థర్మల్ ప్లాంట్‌లో కార్బన్ డయాక్సైడ్ నుంచి మిథనాల్ ఉత్పత్తి విజయవంతమైంది. గ్రీన్ హైడ్రోజన్, 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్లాంటు, ఒడిశాలో 2,400 మెగావాట్ల థర్మల్ ప్లాంటు ఏర్పాటు దిశగా చర్యలు కొనసాగుతున్నాయి. కార్మికులకు రూ.1.25 కోట్ల ప్రమాద బీమా పథకం దేశానికి ఆదర్శంగా నిలిచింది. అధికారుల పీఆర్‌పీ (పర్‌ఫార్మెన్స్ రిలేటెడ్ పేమెంట్)పై త్వరలో సానుకూల నిర్ణయం తీసుకుంటాం”అని ఆయన హామీ ఇచ్చారు.
