బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవాలి: సింగరేణి సీఎండీ బలరాం

బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవాలి: సింగరేణి సీఎండీ  బలరాం

హైదరాబాద్, వెలుగు: రోజుకు కనీసం 2.35 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, అదే పరిమాణంలో బొగ్గు రవాణా చేసి ఈ ఆర్థిక సంవత్సరపు లక్ష్యాన్ని చేరుకోవాలని సింగరేణి సీఎండీ బలరాం నాయక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సింగరేణి భవన్‌లో సంస్థ డైరెక్టర్లు, అన్ని ఏరియాల జనరల్‌ మేనేజర్లతో సమీక్ష నిర్వహించారు.

కరోనా కారణంగా మూడేండ్లుగా కేవలం వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే సమీక్ష సమావేశాలు జరుగుతున్నాయి. కొత్త చైర్మన్ ఆధ్వర్యంలో ఏరియా జీఎంతో హైదరాబాద్  సింగరేణి భవన్‌లో  సమావేశం నిర్వహించారు. సీఎండీ మాట్లాడుతూ 700 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని , రవాణాను సాధించడానికి సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఫైనాన్షియల్‌ ఇయర్‌ గడువు తక్కువ ఉన్న నేపథ్యంలో ప్రతిరోజు ప్రతి షిఫ్ట్ ఎంతో విలువైందన్నారు. 12 ఏరియాల్లో మణుగూరు, కొత్తగూడెం, ఇల్లెందు, బెల్లంపల్లి ఏరియాలు టార్గెట్‌ రీచ్‌ కావడంపై అభినందనలు తెలిపారు. ఇతర ఏరియాల్లో టార్గెట్‌ పూర్తి చేయాలని ఆదేశించారు.

గత యేడాదికన్నా మెరుగు..

గత ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు  సింగరేణి సంస్థ చాలా మెరుగైనవృద్ధిని కనబరిచిందని సీఎండీ బలరాం నాయక్​అన్నారు. లాస్ట్‌ ఫైనాన్షియల్‌ ఇయర్‌ 601 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయగా, ఈ ఏడాది 4.3 శాతం వృద్ధితో ఫిబ్రవరి నాటికే 627 లక్షల టన్నుల ఉత్పత్తి చేశామని, అలాగే గత ఆర్థిక సంవత్సరం 600 లక్షల టన్నుల బొగ్గు రవాణా జరపగా,  ఈ యేడు  5 శాతం వృద్ధితో ఇప్పటివరకు 631 లక్షల టన్నుల బొగ్గు రవాణా జరిపామన్నారు.

నిరుడు  371 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగించగా ఈయేడు  2.7% వృద్ధితో 381 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్  తొలగించామన్నారు. సమీక్షా సమావేశంలో సంస్థ డైరెక్టర్లు డి సత్యనారాయణ రావు, ఎన్​వీకే శ్రీనివాస్, జి .వెంకటేశ్వర్ రెడ్డి, ఈడీ జే .ఆల్విన్ జీఎంలు ఎం సురేశ్, జె. సురేశ్, జేవియల్ గణపతి,  దేవేందర్, సాయిబాబా, డీవీఎస్​సూర్యనారాయణ రాజు,  సీహెచ్​నవీన్ కుమార్ పాల్గొన్నారు.