సవరించిన లక్ష్యాన్నీ చేరలే..!... టార్గెట్కు 21 లక్షల టన్నుల దూరంలో సింగరేణి

సవరించిన లక్ష్యాన్నీ చేరలే..!... టార్గెట్కు 21 లక్షల టన్నుల దూరంలో సింగరేణి
  •     2025–26లో టార్గెట్ 72 మిలియన్ టన్నులు.. 60 మిలియన్ టన్నులకు సవరించినా అందుకోలే..
  •     కొత్త గనులు రాక, ఓబీ టెండర్ల వివాదాలతో వెనుకబడ్డ సంస్థ 
  •     భారీ వర్షాలతోనూ ఉత్పత్తిపై ఎఫెక్ట్

కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనకు ఇంకా ఒక్క రోజే మిగిలి ఉంది. 2025-–26 ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగియనుండగా ఇంకా 21 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి దూరంగా ఉంది. వరుసగా రెండేళ్లుగా బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలు చేరుకోని సింగరేణి సంస్థకు ఈ ఆర్థిక సంవత్సరం కూడా అదే పరిస్థితి ఎదురైంది. ముందుగా నిర్ణయించుకున్న ఉత్పత్తి వార్షిక లక్ష్యం ఎలాగూ సాధ్యం కాకపోవడంతో కనీసం సవరించిన లక్ష్యాన్నైనా చేరుకోవాలని భావించిన సింగరేణి ఆశలు ఫలించలేదు.

-భారీగా టార్గెట్​ నిర్దేశించుకొని..

రాబోయే ఐదేండ్లలో వంద మిలియన్​టన్నులు బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా సింగరేణి సంస్థ ఏటా ఉత్పత్తిని పెంచుకుంటూ పోతుంది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి 76 మిలియన్​టన్నుల బొగ్గు వెలికితీయాలని భారీ లక్ష్యాన్ని పెట్టుకుంది. అంతకుముందు ఏడాది(2024–25) 72 మిలియన్​టన్నుల టార్గెట్​కు గాను 69.01 మిలియన్ టన్నులు మాత్రమే సాధించింది. బొగ్గు లక్ష్య సాధనకు కొత్త ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తాయని, మెషీన్లను పూర్తిస్థాయిలో వాడుకోవడంతో పాటు కార్మికుల గైర్హాజరు శాతం తగ్గించి, వర్షాకాలంలో నష్టపోయిన ఉత్పత్తిని తర్వాత వచ్చే మూడు నెలల్లో తవ్వాలని భావించింది. 

కొత్తగా ఐదు గనులతో పాటు విస్తరణ ప్రాజెక్టుల ద్వారా ఉత్పత్తి పెంచుకోనుంది. అన్ని పర్మిషన్లు పొంది తొలిసారిగా ఒడిశా రాష్ట్రంలో తీసుకున్న నైనీ బొగ్గు బ్లాక్​లో 10 మిలియన్​టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాలనుకుంది. దీంతో పాటు కొత్తగూడెంలోని వీకే కోల్​మైన్స్, బెల్లంపల్లి ప్రాంతంలోని గోలేటి ఓసీపీ, ఇల్లెందులోని జేకే ఓసీపీ(రొంపేడు)లో జులై నుంచి బొగ్గు ఉత్పత్తి వెలికితీసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. 

ఈ గనులకు సంబంధించిన అటవీ, పర్యావరణ అనుమతులు తీసుకోవడంపై దృష్టి సారించినప్పటికీ వాటి రాకలో ఆలస్యమైంది. వీటితో పాటు ఇదే ఏడాదిలో బెల్లంపల్లి ప్రాంతంలోని ఎంవీకే ఓసీపీకి కూడా పర్మిషన్లపై ఆశలు పెట్టుకుంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రామగుండంలోని జీడీకే5 కోల్​మైన్స్​ నుంచి ఏడాదికి 3 మిలియన్​టన్నులు, మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్​ఏరియాలోని ఇందారం ఓసీపీ నుంచి 2.6 మిలియన్​ టన్నులు, మందమర్రి ఏరియాలోని కేకే ఓసీపీ నుంచి 22.5 మిలియన్ టన్నులు, రామగుండంలోని మోగా ఓసీపీ ద్వారా వార్షిక బొగ్గు ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. 

కొత్త గనులు ప్రారంభం కాలే..

భారీగా బొగ్గు వెలికి తీయాలని సింగరేణి అనుకున్న లక్ష్యాలు బెడిసికొట్టాయి. ఆర్థిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్​లోనే ఏకంగా 4.84 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి తక్కువగా రాగా వరుసగా.. ప్రతి నెలలోనూ ఇదే పరిస్థితి ఎదురవడంతో సింగరేణి ఆందోళన చెందింది. నైనీతో పాటు కొత్తగా అందుబాటులోకి వస్తాయని భావించిన గనుల నుంచి సుమారు 20 నుంచి 25 మిలియన్​టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించవచ్చని భావించినప్పటికీ పరిస్థితులు అనుకూలించలేదు. 

కనీసం 4 మిలియన్​టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్​ను ప్రారంభించినప్పటిటీ బొగ్గు రవాణా టెండర్ల వివాదం, ఉత్పత్తి పనులు చేపట్టేందుకు పరిస్థితులు అనుకూలించకపోవడంతో బొగ్గు పెళ్లను కూడా వెలికితీయలేదు. 

కొద్ది రోజుల క్రితం కొత్తగూడెం వీకే ఓసీపీకి పర్మిషన్స్​రాగా మిగిలిన గనులకు రాలేదు. దీంతో ఆశించిన కొత్త గనుల్లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కాలేదు. దీనికి తోడు వరుసగా అండర్​గ్రౌండ్​ మైన్లు మూతపడటం, శ్రీరాంపూర్, మందమర్రి ఏరియాల్లోని ఇందారం, కేకే ఓసీపీల్లో ఓబీ టెండర్ల వివాదంతో టార్గెట్​మేరకు ఓవర్​బర్డెన్​ను తీయకపోవడం, వానలతో ఓసీపీల్లో వరద చేరి రోజుల తరబడి బొగ్గు ఉత్పత్తి పనులకు విఘాతం కలిగింది.ఈ ప్రతికూల పరిస్థితుల కారణంగా వార్షిక బొగ్గు ఉత్పత్తి టార్గెట్​చేరుకోలేకపోయింది.

రెండుసార్లు సవరించినా.. లక్ష్యాన్ని అందుకోలే..

2025–26 ఆర్థిక సంవత్సరం మొదట్లో కొత్త గనులు అందుబాటులోకి వస్తాయని, దీనికి తోడు ప్రస్తుత ఓసీపీల్లో భారీ ఉత్పత్తిపై ఆశలు పెట్టుకున్న యాజమాన్యం మొదట 76 మిలియన్ ​టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని టార్గెట్​నిర్దేశించుకుంది. అయితే పరిస్థితులు అనుకూలించకపోవడంతో కొద్ది కాలానికే టార్గెట్​ను 72 మిలియన్​టన్నులకు కుదించుకుంది. 

ఆర్థిక సంవత్సరం ముగింపునకు మరో నెల రోజులు ఉందనగా టార్గెట్​ను 60 మిలియన్​టన్నులకు సవరించుకుంది. అయితే కనీసం సవరించిన లక్ష్యాన్నైనా చేరుకునేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. సింగరేణి వ్యాప్తంగా ఆదివారం నాటికి 57.88 మిలియన్​టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించి టార్గెట్​కు మరో 21.19 లక్షల టన్నుల దూరంగా ఉంది.