ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటయ్యేనా!

ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటయ్యేనా!
  • రెండేండ్లుగా సింగరేణి  ప్రతిపాదనలు పెండింగ్
  • ప్రాథమిక సర్వే పూర్తి చేసిన అధికారులు

సిద్దిపేట, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా తొగుట మండలంలో నిర్మించిన అతి పెద్ద రిజర్వాయర్  మల్లన్న సాగర్. యాభై టీఎంసీల సామర్థ్యం కలిగిన ఈ రిజర్వాయర్​లో  ఫ్లోటింగ్ సోలార్  పవర్ ప్లాంట్ (తేలియాడే పలకల) ఏర్పాటు చేయాలని సింగరేణి సంస్థ భావించింది. కానీ రెండేళ్లుగా ప్రతిపాదనలు పెండింగ్ లోనే ఉన్నా యి. ప్రస్తుత కాంగ్రెస్​ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీకి మొదటి ప్రాధాన్యం ఇస్తుండడంతో ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ పై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి.

 రెండు రోజుల క్రితం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి  సోలార్ పవర్ పై రివ్యూ నిర్వహించారు. ఇందులో  భాగంగా మల్లన్న సాగర్​ ఫ్లోటింగ్ సొలార్ పవర్ ప్లాంట్ పై పవర్ పాయింట్ ప్రజంటేషన్ తిలకించడంతో దీని ఏర్పాటుపై ముందడుగు పడుతుందని అందరూ భావిస్తున్నారు. వాస్తవానికి  సింగరేణి సంస్థ మల్లన్న సాగర్ రిజర్వాయర్ లో  200 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్ ఏర్పాటుకు రెండేళ్ల  క్రితమే  ముందు వచ్చింది. 100 మెగావాట్ల చొప్పున  రెండు దశల్లో ప్లోటింగ్  సోలార్ పవర్ ప్లాంట్ ను నిర్మించాలని  నిర్ణయించారు.  రెండేళ్ల కాలంలో పూర్తి చేయాలని భావించి అధికారులు  ప్రాథమిక సర్వేను నిర్వహించారు. కానీ ఈ ప్రతిపాదనల ఫైల్ అప్పటి  ప్రభుత్వం వద్ద పెండింగ్ లోనే ఉండిపోయింది. 

ఎన్నికల నేపథ్యంలో వెనుకంజ

మల్లన్న సాగర్ లో దేశంలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ నిర్మించడానికి  సింగరేణి సంస్థ ఆసక్తి చూపుతూ పలుమార్లు క్షేత్ర స్థాయిలో  సర్వే నిర్వహించింది. రూ.1800 కోట్లతో పంప్ హౌజ్ కు సమీపంలోని 100 ఎకరాల్లో 100 మెగావాట్ల ఫ్లోటింగ్  సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కానీ గత  ప్రభుత్వం నుంచి ఆమోద ముద్ర లభించలేదు. ఎన్నికల సంవత్సరం కావడంతో స్థానికంగా వ్యతిరేకత వస్తుందనే భయంతో  ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్  ఇవ్వలేదు. 

దీనికి తోడు గత ఏడాది రిజర్వాయర్ లో 50 లక్షల చేప పిల్లలను వదలడంతో పాటు ప్రభుత్వం  చేపలు పట్టే  హక్కును  ముంపు గ్రామాల నిర్వాసితులకు కల్పించింది. ప్రస్తుత ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యం ఇస్తుండడంతో మల్లన్న సాగర్ లో ప్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ కు అడుగులు పడతాయని భావిస్తున్నారు.