కోల్​వాషరీ ప్లాంట్లపై నిర్లక్ష్యం రూ. కోట్ల ఆదాయం కోల్పోతున్న సింగరేణి

కోల్​వాషరీ ప్లాంట్లపై నిర్లక్ష్యం  రూ. కోట్ల ఆదాయం కోల్పోతున్న సింగరేణి

మందమర్రి, వెలుగు:
బొగ్గు ఉత్పత్తిలో అపార అనుభవం ఉన్న సింగరేణి సంస్థ క్వాలిటీని మాత్రం నిర్లక్ష్యం చేస్తోంది. బొగ్గు క్వాలిటీ పెంచే కోల్​వాషరీ ప్లాంట్ల ఏర్పాటును నిర్లక్ష్యం చేస్తున్నారు. బొగ్గులోని బండరాళ్లు, బొగ్గును వేరుచేసేందుకు సీహెచ్​పీలో షెల్​ పికింగ్​ పనులు కూడా సక్రమంగా జరగడం లేదు.  దీంతో బొగ్గు నాణ్యతపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ నెల 10 నుంచి సింగరేణిలో బొగ్గు నాణ్యత వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇలా వారోత్సవాలు నిర్వహిస్తే సరిపోదని బొగ్గు నాణ్యత పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు. 

కోల్​వాషరీ ప్లాంట్లు..
సింగరేణి బొగ్గు కొనాలంటే గతంలో వినియోగదారులు  వెనుకడుగు వేసేవారు. ఉత్పత్తి సమయంలో బండరాళ్లు, మట్టిపెళ్లలు, వెదురు ముక్కలు బొగ్గుతోపాటు  వచ్చేవి. ఈ బొగ్గును నేరుగా సింగరేణి వినియోగదారులకు సరఫరా చేసేది. అయితే ఇతర సంస్థలతో పాటు క్వాలిటీ విదేశీ బొగ్గు దేశంలోకి దిగుమతి కావడంతో సింగరేణి బొగ్గు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపింది. దీనికితోడు  కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ మార్గదర్శకాల ప్రకారం 2016 జూన్​ 5 నుంచి కొత్త రూల్స్​అమలులోకి వచ్చాయి. దీని ప్రకారం గనుల ప్రాంతానికి 500 కి.మీ. పైగా దూరం ఉన్న పరిశ్రమలకు రవాణా చేసే బొగ్గులో బూడిద 34 శాతానికి మించకూడదు. 80 శాతం బొగ్గును సింగరేణి 500 కి.మీ.లోపు సప్లయ్​చేస్తోంది.

వాష్​ చేసిన బొగ్గుకు డిమాండ్​పెరగడంతో సంస్థ మనుగడకు  కోల్​వాషరీ ప్లాంట్ల ఏర్పాటు తప్పలేదు. కోల్​వాషరీ ప్లాంట్లలో పది టన్నుల బొగ్గును వాష్​చేస్తే ఏడు టన్నుల క్వాలిటీ బొగ్గు వస్తుంది. నీటితో గానీ, సాంద్రత అధికంగా ఉన్న ఇతర ద్రావకాల్లోగానీ బొగ్గును వాష్​చేస్తారు. ఈ బొగ్గులో బూడిద శాతం దాదాపు 50 శాతం, సల్ఫర్​పాళ్లు 25 శాతం తగ్గి తక్కువ మోతాదులో బూడిద రావడం వల్ల పరిశ్రమల్లో కాలుష్యం తగ్గుతుంది. బొగ్గును చిన్న ముక్కలుగా చేయడం ఈజీగా ఉంటుంది. గనుల నుంచి నేరుగా వచ్చే బొగ్గులో రాళ్లు, మట్టి, షెల్, తదితర పదార్థాలు కలిసి ఉంటాయి.

ఈ బొగ్గును పవర్​ప్లాంట్​లో వినియోగిస్తే  బాయిలర్​ట్యూబులు లీకై, పవర్​ కెపాసిటీ తగ్గుతుంది.  టన్ను బొగ్గులో రెండు కిలోల రాయిగానీ, షెల్​గానీ ఉంటే దాని నాణ్యత ఒక గ్రేడు పడిపోతుంది. ఒక రైల్వే గూడ్స్(3800 టన్నుల బొగ్గు)లో జీ10 గ్రేడ్​కంటే ఒక గ్రేడ్​ తగ్గితే సుమారు రూ.19 లక్షల వరకు ఆదాయం నష్టపోవాల్సిందే. జీ11, జీ 12 గ్రేడు  బొగ్గును వాష్​ చేస్తే జీ6, జీ7 గ్రేడుగా మారుతుంది. జీ11ను విక్రయిస్తే రూ.960 వస్తే జీ7గా మారిన తర్వాత అమ్మితే రూ.5  వేల నుంచి 6 వేలు వస్తుంది. శుద్ధి ప్రక్రియలో వచ్చే ఫైర్​బొగ్గుకు,  బురద బొగ్గుకు కూడా ఆదాయం వస్తుంది.  

పాతవి మూస్తున్రు.. కొత్తవి రాకపాయె
సింగరేణి యాజమాన్యం ప్రైవేటు సంస్థలతో కలిసి బిల్డ్, ఓన్, ఆపరేట్ విధానంపై  20ఏళ్ల కిందట  మణుగూరు, రామగుండం 2,  మందమర్రి ఏరియా  రామకృష్ణాపూర్​లో గంటకు 2 మిలియన్​ టన్నుల బొగ్గును వాష్​చేసే ప్లాంట్లను ఏర్పాటు చేసింది. వాష్​ చేసిన టన్ను బొగ్గుకు ధర చెల్లించి తీసుకునేది.  ముడి బొగ్గు సప్లయ్​చేయకపోవడం, అగ్రిమెంట్ తీరడం తదితర కారణాలతో  రామగుండం 2, రామకృష్ణాపూర్​లోని ప్రైవేటు కోల్​వాషరీ ప్లాంట్లు మూతపడగా ప్రస్తుతం మణుగూరు ఏరియాలో ఒకటి మాత్రమే నడుస్తోంది. కోయగూడెం ఓసీ 2, ఇల్లందు, పీకే ఓసీపీ4లో సర్ఫేస్​మైనర్లతో క్వాలిటీ బొగ్గు ఉత్పత్తి చేస్తోంది. నాలుగేళ్ల కిందట  కొత్తగా రామగుండం, కొత్తగూడెం రీజియన్లు, బెల్లంపల్లి, మందమర్రి ఏరియాల్లో నాలుగు కోల్​వాషరీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని చెప్పినా అమలుకు నోచుకోలేదు. 

సొంత ప్లాంట్లు ఉండాలె
మార్కెట్​లో వాష్​ చేసిన బొగ్గుకు బాగా డిమాండ్​ ఉంది. సింగరేణి సొంతగా కోల్​వాషరీలను ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం ఉత్పత్తి చేస్తున్న బొగ్గులో 20 శాతం వాష్​ చేసినా ఏటా రూ.వెయ్యి కోట్ల ఆదాయం వస్తుంది. థర్డ్​ పార్టీ గ్రేడ్​ల పరీక్షల్లో గ్రేడ్​ తక్కువ చూపి కొందరు సంస్థకు నష్టం చేస్తున్నారు.  

- యాదగిరి సత్తయ్య, బీఎంఎస్ ​స్టేట్ ​ప్రెసిడెంట్