- ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ బి.జనక్ ప్రసాద్
గోదావరిఖని, వెలుగు : ‘మన బొగ్గు మన హక్కు’ నినాదంతో బొగ్గు గనుల వేలానికి వ్యతిరేకంగా సింగరేణి వ్యాప్తంగా త్వరలో ‘సింగరేణి పరిరక్షణ రణభేరి యాత్ర’ నిర్వహించనున్నట్టు ఐఎన్టీయూసీ సెక్రెటరీ జనరల్బి.జనక్‌ప్రసాద్ తెలిపారు. ఆదివారం గోదావరిఖనిలోని ఓ ఫంక్షన్ హాల్లో కేంద్ర ప్రభుత్వ బొగ్గు గనుల వేలానికి వ్యతిరేకంగా ఐఎన్టీయూసీ యూనియన్ తీసుకునే కార్యాచరణపై కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆరు జిల్లాల వ్యాప్తంగా ప్రతి బొగ్గుగనిలో కార్మికులను కలిసి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వివరిస్తామని తెలిపారు.
అలాగే, సింగరేణి వ్యాప్తంగా బొగ్గు గనుల్లో జరుగుతున్న ప్రమాదాల నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలు, కాంట్రాక్టు కార్మికుల కోసం ఐఎన్టీయూసీ పరంగా యూనియన్ను ప్రారంభించే అంశం గురించి చర్చించారు. ఈ సమావేశంలో యూనియన్సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు ఎస్.నరసింహ రెడ్డి, సిద్దంశెట్టి రాజమౌళి, పి.ధర్మపురి, జనరల్ సెక్రెటరీలు త్యాగరాజన్, ఎండీ అక్రం, వికాస్ కుమార్ యాదవ్, నరేందర్, శేషారత్నం, వడ్డేపల్లి దాస్, భీం రావ్, అక్బర్ అలీ, కలవెన శ్యామ్, గరిగ స్వామి, పేరం రమేశ్, అరేపల్లి శ్రీనివాస్, కె.సదానందం, అన్ని ఏరియాల వైస్ ప్రెసిడెంట్లు పాల్గొన్నారు.
