సింగరేణి డీజిల్ గుట్టు రట్టు.. 251 కోట్ల ప్రజాధనం వృథా!

సింగరేణి డీజిల్ గుట్టు రట్టు.. 251 కోట్ల ప్రజాధనం వృథా!
  • బొగ్గు రవాణా పేరుతో రూ. 1,078 కోట్ల అదనపు వసూళ్లు
  • జీహెచ్ఎంసీలో చెత్త ప్రాసెస్ చేయకున్నా కాంట్రాక్టర్​కు రూ.313 కోట్లు
  • కార్మికుల సెస్ రూ.311 కోట్లు రికవరీ చేయలేదు
  • 2022 మార్చి నాటికి గత ప్రభుత్వ వైఫల్యాలపై కాగ్ రిపోర్ట్

హైదరాబాద్​, వెలుగు: సింగరేణి లాంటి లాభదాయక సంస్థల్లోనూ అసంబద్ధ నిర్ణయాల వల్ల కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా అవుతోందని కాగ్​ మండిపడింది. ఓవర్ బర్డన్ రిమూవల్ (ఓబీఆర్) కాంట్రాక్టుల్లో డీజిల్ వినియోగంపై శాస్త్రీయ అంచనాలు లేకపోవడంతో సుమారు రూ.251.05 కోట్ల అదనపు వ్యయం జరిగిందని కాగ్ వెల్లడించింది. 

మార్చి 2022తో ముగిసిన కాలానికి సంబంధించిన ఈ నివేదికను శాసనసభలో సోమవారం ప్రవేశపెట్టారు. బొగ్గు వినియోగదారుల నుంచి సర్ఫేస్ ట్రాన్స్‌‌పోర్ట్ చార్జీల పేరిట వాస్తవ ఖర్చు కంటే ఎక్కువగా ఏకంగా రూ.1,078 కోట్లు వసూలు చేశారని తెలిపింది. ఇది పరోక్షంగా వినియోగదారులపై భారంగా మారిందని, ఇలాంటి అదనపు వసూళ్లు చెల్లుబాటు కావని కాగ్ వ్యాఖ్యానించింది. పర్యావరణ పరిరక్షణ కోసం ఏర్పాటు చేయాల్సిన ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణంలోనూ జాప్యం నిర్లక్ష్యానికి పరాకాష్టగా తెలిపింది.

బొగ్గు వాస్తవ రవాణా ఖర్చు కంటే చార్జీలను అడ్డగోలుగా పెంచి, ఐదేండ్లలో రూ.1,078 కోట్ల మేర అదనపు ఆదాయాన్ని గడించింది. ఇది పరోక్షంగా సామాన్య విని యోగదారులపై, ప్రభుత్వ విద్యుత్ సంస్థలపై భారాన్ని మోపిందని తెలిపింది. బొగ్గు రవాణాలో అనవసరమైన మార్గాలను ఎంచుకోవడంవల్ల మరో రూ.25.59 కోట్ల నష్టం వాటిల్లింది. రైల్వే లైన్లు అందుబాటులో ఉన్నా, రోడ్డు రవాణాను ప్రోత్సహించడం వల్ల పర్యావరణానికి ముప్పుతో పాటు ఆర్థిక భారం పడింది. పవర్ పర్చేజ్ కాస్ట్ పెరగడం వల్ల దక్షిణ, ఉత్తర విద్యుత్ పంపిణీ సం స్థలు (డిస్కంలు) భారీ నష్టాలను చవిచూస్తున్నాయంది.

చెత్తనూ వదల్లేదు 
జీహెచ్‌‌ఎంసీలో పొడి చెత్తను ప్రాసెస్ చేయకున్నా కాం ట్రాక్టరుకు రూ.313.20 కోట్లు చెల్లించడం భారీ అవకతవకలకు నిదర్శనమని కాగ్ పేర్కొంది. ఇది నిబంధనలకు విరుద్ధమని, ప్రభుత్వ ధనాన్ని వృథా చేయ డమేనని నివేదిక పేర్కొంది. ఈ ఆర్థిక అవకతవకలపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకో వాలని కాగ్ సిఫార్సు చేసింది. చెత్త సేకరణ, వేరు చేయ డంలో క్షేత్రస్థాయిలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఆడిట్ టీం గుర్తించింది. పారిశుధ్య కార్మికులకు కనీసం పీపీఈ కిట్స్ కూడా అందించడం లేదని కాగ్ విచారం వ్యక్తం చేసింది.

నిర్మాణ వ్యర్థాల నిర్వహణలో తెలం గాణ ప్రభుత్వం తీవ్ర వెనుకబాటులో ఉందని నివేదిక తేల్చింది. పర్యావరణ పర్యవేక్షణలో కాలుష్య నియంత్రణ మండలి ఘోరంగా విఫలమైందని కాగ్ పేర్కొంది. జవహర్‌‌నగర్ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్‌‌లో నిబంధనల అమలును మండలి పర్యవేక్షించలేదని ఆడి ట్ తెలిపింది.  మున్సిపాలిటీలు ప్రజల నుంచి వసూలు చేసిన రూ.324 కోట్ల లైబ్రరీ సెస్‌‌ను గ్రంథాలయ సంస్థలకు బదిలీ చేయలేదు. దీంతో గ్రంథాయల సంస్థల అభివృద్ధికి నోచుకోవడం లేదని తెలిపింది.

కార్మికుల రూ.1,000 కోట్లు పక్కదారి
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాల్సిన సంక్షేమ బోర్డు నిధుల దుర్వినియోగానికి, అస్తవ్యస్త నిర్వహణకు కేరాఫ్ అడ్రస్‌‌గా మారిందని కాగ్ నివేదికలో తీవ్రంగా తప్పుబట్టింది. క్షేత్రస్థాయిలో కార్మికుల నమోదు నుంచి మొదలుకొని, వేల కోట్ల సెస్‌‌ వసూళ్లు, సంక్షేమ పథకాల అమలు వరకు ప్రతి అడుగులోనూ వైఫల్యాలే కనిపిస్తున్నాయని నివేదిక ఎండగట్టింది. 

ముఖ్యంగా కరోనా సమయంలో కార్మికుల పేరుతో సేకరించిన రూ.1,004.82 కోట్ల నిధులను నిబంధనలకు విరుద్ధంగా మళ్లించారని, దాదాపు రూ.51.47 కోట్ల విలువైన చెక్కులు నిరాధరణకు గురైనా పట్టించుకోలేదని పేర్కొంది. కార్మికుల కోసం వసూలు చేయాల్సిన రూ.410.99 కోట్ల సెస్‌‌ ఎగవేతను విజిలెన్స్ తనిఖీల్లో గుర్తించినా రూ. 99.67 కోట్లు మాత్రమే రికవరీ చేశారని పేర్కొంది. మిగిలిన రూ. 311.32 కోట్లను వసూలు చేయడంలో రెవెన్యూ రికవరీ చట్టాన్ని ప్రయోగించడంలో విఫలమయ్యారని తెలిపింది.