కమిటీల్లేవ్.. కాలయాపనే...స్ట్రక్చరల్ మీటింగ్ ఒప్పందాలను అమలు చేయని సింగరేణి

కమిటీల్లేవ్.. కాలయాపనే...స్ట్రక్చరల్ మీటింగ్ ఒప్పందాలను అమలు చేయని సింగరేణి
  • నెలలైనా కమిటీలు ఏర్పాటు చేయకుండా అధికారుల నిర్లక్ష్యం 
  • పెర్క్స్​పై ఐటీ మాఫీ, సొంతింటి స్కీమ్, విజిలెన్సు కేసులపైనా పెండింగే 
  • సమస్యల పరిష్కార కమిటీలు వేయకపోవడంపై కార్మికులు, సంఘాల ఆగ్రహం

కోల్​బెల్ట్​,వెలుగు :  సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి రెండు నెలల కింద జరిగిన స్ట్రక్చరల్ మీటింగ్ లో కుదిరిన ఒప్పందాలపై యజమాన్యం కాలయాపనే చేస్తోంది. వెంటనే కమిటీలు వేసి సమస్యలను పరిష్కరిస్తామని అధికారులు హామీలు ఇచ్చినా నిర్లక్ష్యంగానే ఉంటున్నారు. మీటింగ్ లో ఓకే చెప్పినా ఇప్పటివరకు ఎలాంటి కమిటీలు వేయలేదు. కార్మికుల డిమాండ్లను కాగితాలకే పరిమితం చేసింది. సొంతింటి స్కీమ్, డిపెండెంట్​ఉద్యోగాల విజిలెన్స్​కేసుల్లో పరిష్కారం చూపకుండా లేట్ చేస్తోందంటూ కార్మికులు, సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.  స్ర్టక్చరల్​మీటింగ్​లో ఒప్పకుని పరిష్కరిస్తామని హామీ ఇచ్చి.. నిర్లక్ష్యం చేస్తుండడంతో  సింగరేణిపై నమ్మకం లేకుండాపోతుందని అసహనం వ్యక్తం చేస్తున్నాయి.  

రెండు నెలలు దాటినా..

2024 నవంబర్ 24న డైరెక్టర్(పర్సనల్​అడ్మినిస్ర్టేషన్​) గత మార్చి7న 38వ సింగరేణి సీఎండీ స్థాయిలో స్ట్రక్చరల్ మీటింగ్ లు జరిగాయి. వీటిలో సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ప్రతినిధులు కార్మికులకు సంబంధించిన పలు సమస్యలను సంస్థ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కొన్ని డిమాండ్లను బేషరతుగా ఒప్పుకుంది. కీలకమైన మరికొన్నింటిపై కమిటీలు వేసి పరిష్కారిస్తామని హామీ ఇచ్చింది. ఇందులో ప్రధానంగా పెర్క్స్​పై ఐటీ మాఫీ, సొంతింటి స్కీమ్, డిపెండెంట్​ఉద్యోగాల విజిలెన్స్​కేసుల  పరిష్కారం వంటి డిమాండ్లపై కమిటీలు ఏర్పాటుకు సంస్థ హామీ ఇచ్చింది. నెలలు కావొస్తున్నా ఇప్పటి వరకు కమిటీల ఏర్పాటుపై ఎలాంటి ప్రకటన చేయడంలేదు. 

15 ఏండ్లుగా కోల్ ఇండియాలో అమలు 

పదిహేనేండ్లుగా కోల్​ఇండియా తన కార్మికుల ఇన్ కమ్ ట్యాక్స్ (ఐటీ)ని భరిస్తుండగా..  సింగరేణి కూడా భరించాలనే కార్మికులు డిమాండ్ చేశారు. వేతన సవరణ కూడా రెండు సంస్థల్లో సమానంగానే అమలులో ఉంది. కానీ సింగరేణి మాత్రం ఐటీని భరించడంలేదు. ఏటా కార్మికులు రూ.91కోట్ల  ఐటీ చెల్లిస్తున్నారు. ఒక్కో కార్మికుడికి రూ.10 వేల నుంచి రూ.20వేల వరకు ఐటీ పడుతుంది.  దీనిపై కమిటీ వేసి పరిశీలన అనంతరం ఆదాయపు పన్ను చెల్లించేందుకు సింగరేణి ఇన్​ప్రిన్సిపుల్ గా ఆమోదం తెలిపినా ఇంతవరకూ కమిటీ ఏర్పాటు చేయలేదు. దీంతో  సింగరేణి కార్మికుల ఆర్థిక ప్రయోజనాలపై ఐటీ  మినహాయింపు అమలుకు నోచుకోవడంలేదు. 

సొంతింటి స్కీమ్ విధి విధానాలు ఏవీ?

కార్మికులకు సొంతింటి స్కీమ్ అమలయ్యేలా సహకరించేందుకు యాజమాన్యం సానుకూలత తెలిపింది. 250 గజాల స్థలం, రూ.25లక్షలు వడ్డీలేని రుణం ఇవ్వాలని కార్మిక సంఘాలు డిమాండ్​చేశాయి. దీనిపైనా  స్ర్టక్చరల్​మీటింగ్​లో చర్చించి అమలుకు సింగరేణి ఒప్పుకుంది. విధి విధానాలు రూపొందించేందుకు కమిటీలో నిర్ణయిస్తామని పేర్కొంది. ఇప్పటి వరకు ఆచరణలోకి తీసుకురాలేదు. మరోవైపు మారుపేర్లపై పనిచేసిన ఉద్యోగుల పిల్లలకు, డేట్​ఆఫ్​బర్త్​ మార్పు సర్టిఫికెట్లు పెట్టిన వారికి, విజిలెన్స్ ఆరోపణల​కేసుల పరిష్కారానికి కూడా కమిటీని వేయడంలేదు. 

అమలులో జాప్యం చేస్తుండగా.. 

స్ర్టక్చరల్​ మీటింగ్​లో సింగరేణి  హైదరాబాద్​లో సూపర్​స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు, క్యాంటీన్ల స్వయం నిర్వహణ, ప్రమోషన్లలో సర్వీస్ రూల్స్ మార్పు, ఓసీపీలో కోడ్ ల విభజన వంటివి ఒప్పుకుంది.  మైనింగ్​స్టాఫ్​, ఈ అండ్ఎం సూపర్​వైజర్లు అండర్​గ్రౌండ్​లో మెడికల్​అన్​ఫిట్​అయితే.. సర్ఫేస్​లో తగిన జాబ్ కల్పించేందుకు అగ్రిమెంట్​జరిగింది. డిస్మిస్​ కార్మికులకు 5 ఏండ్లలో కనీసం ఒక ఏడాది 100 మస్టర్లు ఉంటే తిరిగి జాబ్ ఇవ్వాలని అగ్రిమెంట్ చేసుకుంది.  

జేఎంవో, జేటీవో, జేఏవోలకు ప్రమోషన్​పై ఏ1- గ్రేడ్​లో ఐదేండ్ల సర్వేసు ఉంటేనే ఎగ్జిక్యూటివ్​గా కల్పిస్తుండగా.. దాన్ని మార్చుతూ ఏ- గ్రేడ్​లోనే ఐదేండ్లు ఉన్నా కూడా పదోన్నతి ఇచ్చేందుకు ఒప్పుకుంది. అయితే.. వీటిపై సింగరేణి అధికారులు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయడంలేదు. కంపెనీస్థాయిలో డైరెక్టర్​(పా), సీఎండీ లెవల్​స్ర్టక్చరల్​మీటింగ్ ల్లో  కుదిరిన ఒప్పందాలపై అధికారులు వెంటనే ఉత్తర్వులు ఇచ్చేలా గుర్తింపు సంఘం ఒత్తిడి తేవాలని కార్మికవర్గం డిమాండ్​చేస్తోంది.