ఆర్కేపీ ఓసీపీ విస్తరణకు సింగరేణి ఫోకస్.. రెండో ఫేజ్ అటవీ పర్మిషన్లకు ఎదురుచూపులు

ఆర్కేపీ ఓసీపీ విస్తరణకు సింగరేణి ఫోకస్.. రెండో ఫేజ్ అటవీ పర్మిషన్లకు ఎదురుచూపులు
  • 40 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాల గుర్తింపు
  • వచ్చే-18 ఏండ్ల పాటు ఉత్పత్తికి చాన్స్ 
  • నవంబర్లో పబ్లిక్ హియరింగ్​కు సన్నాహాలు
  • మందమర్రి బొగ్గు గని ఏరియాకు పూర్వవైభవం

కోల్​బెల్ట్,వెలుగు: మూసేసిన అండర్​గ్రౌండ్​గనుల్లో మిగిలిన బొగ్గును ఓసీపీ విస్తరణ ద్వారా వెలికి తీయడంపై  సింగరేణి దృష్టి పెట్టింది. ఇందుకు రెండో ఫేజ్​లో సేకరించాల్సిన భూములు అటవీ శాఖ పరిధిలో ఉండడంతో కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ పర్మిషన్ల కోసం ఎదురు చూస్తోంది. మరోవైపు మంచిర్యాల జిల్లాలోని రామకృష్ణాపూర్​ఓపెన్​కాస్ట్​బొగ్గు గని విస్తరణ పనులను స్పీడప్ చేసింది.

భూగర్భ గనుల్లో ఉత్పత్తి వ్యయం ఎక్కువగా ఉండడంతో ఓసీపీల విస్తరణకు యాజమాన్యం ప్రయారిటీ ఇస్తోంది. గతంలో పదేండ్ల పాటు రామకృష్ణాపూర్​ఓపెన్​కాస్ట్​మైన్​లో కార్యకలాపాలు కొనసాగించగా.. ఉత్పత్తికి అవసరమైన భూములు లేకపోవడంతో గత ఏప్రిల్​లో మూసివేసింది. మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎన్​.రాధాకృష్ణ బాధ్యతలు చేపట్టిన వెంటనే రామకృష్ణాపూర్​ఓపెన్​కాస్ట్​ రెండో ఫేజ్​విస్తరణ పర్మిషన్లకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 

పదేండ్లలో 1.60 కోట్ల టన్నులు వెలికితీత 
సింగరేణిలో మందమర్రి ఏరియాలో 60 ఏండ్ల కింద ప్రారంభించిన అండర్ గ్రౌండ్​మైన్లు కావడంతో బొగ్గు వెలికితీత కష్టమైంది. దీంతో రామకృష్ణాపూర్​లోని ఎంకే 4, 4ఏ గనులను మూసి వేసింది. అంతకుముందే మూతపడ్డ ఆర్కే-–4 గనిలో మిగిలిన బొగ్గు నిక్షేపాలను తిరిగి వెలికితీసేందుకు రామకృష్ణాపూర్​ఓసీపీని ఏర్పాటు చేసింది. 2013 డిసెంబర్​లో పనులు చేపట్టి,  2014  ఫిబ్రవరి నుంచి బొగ్గు ఉత్పత్తి స్టార్ట్​చేసింది. ఏటా 3 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి నుంచి రికార్డు స్థాయిలో 22 లక్షల టన్నులను సాధించే స్థాయికి చేరింది. 2024 –-25 ఆర్థిక సంవత్సరం వరకు 1.60 కోట్ల టన్నులు ఉత్పత్తి చేసింది. అయితే.. బొగ్గు వెలికితీతకు కావలసిన భూములు లేకపోవడంతో గత ఏప్రిల్​లో ఆర్కేపీ ఓసీపీని కూడా మూసివేసింది.  

రామకృష్ణాపూర్ మనుగడపై చిగురించిన ఆశలు
ఆర్కేపీ ఓసీపీ రెండో ఫేజ్​విస్తరణ ప్రక్రియ రామకృష్ణాపూర్​టౌన్ వాసుల్లో ఆశలు చిగురింపజేసింది.  ఆర్కే1,1ఏ, 2, 3, 4, ఎంకే4,4ఏ, ఆర్కే5,6, 7,8 అండర్​గ్రౌండ్​గనులతో రామకృష్ణాపూర్ ఏరియాగా ఉండేది. 2003లో కొన్ని గనులు మందమర్రిలో, మరికొన్ని శ్రీరాంపూర్​ఏరియాలో కలిపారు. రామకృష్ణాపూ ర్ లో బొగ్గు గనులు లేక కార్మికులు తగ్గిపోవడంతో వ్యాపారులు, కులవృత్తులు చేసుకునేవారు టౌన్ వీడిచివెళ్లా రు. మళ్లీ ఓసీపీ గని విస్తరణ పనులు మొదలైతే మందమర్రి ఏరియాకు పూర్వవైభవం రానుంది. మరో 20 ఏండ్ల పాటు రామకృష్ణాపూర్​టౌన్​మనుగడ కొనసాగనుంది.

త్వరలో పబ్లిక్ ​హియరింగ్​ నిర్వహిస్తాం
రామకృష్ణాపూర్​ఓపెన్​కాస్ట్​రెండో ఫేజ్ కు సేకరించాల్సిన అటవీ భూముల పర్మిషన్ల కోసం కేంద్ర, రాష్ట్ర ఫారెస్ట్రీ, ఎన్విరాన్​మెంట్ డిపార్ట్​మెంట్లకు నివేదికలు పంపించాం. ఇటీవల కలెక్టర్,డీఎఫ్​ఓను కలిశారు. వారు ప్రస్తావించిన పాయింట్లకు సమాధానాలు ఇచ్చాం. అన్ని పర్మిషన్లు రాగానే వచ్చే ఆర్థిక సంవత్సరం ఓసీపీలో మైనింగ్​పనులు ప్రారంభిస్తాం. ముందస్తుగా నవంబర్​లో పబ్లిక్​ హియరింగ్ చేపడతాం. ఓబీ వెలికితీత లోడింగ్​కాంట్రాక్ట్​కు టెండరు కూడా పిలుస్తాం.

ఎన్.రాధాకృష్ణ, సింగరేణి జీఎం, మందమర్రి ఏరియా 

రెండో ఫేజ్​ విస్తరణకు..
ఆర్కేపీ ఓసీపీ రెండో ఫేజ్​మైనింగ్ ​విస్తరణకు సుమారు 366.41 హెక్టార్ల ఫారెస్ట్​ భూమి,600 హెక్టార్ల నాన్​ఫారెస్ట్​భూమి అవసరమైంది. భూ సేకరణ పర్మిషన్లకు కేంద్ర,రాష్ట్ర ఫారెస్ట్రీ, ఎన్విరాన్​మెంట్​డిపార్ట్​మెంట్లకు నివేదికలు పంపించి ఎదురుచూస్తోంది. అయితే.. సేకరించే భూముల్లో సుమారు 40 మిలియన్​ టన్నుల బొగ్గు నిక్షేపాలున్నట్లు అధికారులు గుర్తించారు. ఏటా 20 లక్షల టన్నుల చొప్పున 18 ఏండ్ల పాటు బొగ్గు ఉత్పత్తి అయ్యే చాన్స్ ఉంది. ఇప్పటికే అటవీభూములపై ఇంటర్నల్​సర్వే కూడా జరిగింది. గత నెల 24న మందమర్రి మండలం సారంగపల్లిలో ఫారెస్ట్​, రెవెన్యూ, సింగరేణి ఆఫీసర్లు గ్రామసభ కూడా నిర్వహించారు.