
కోల్‌బెల్ట్, వెలుగు: ఉద్యోగుల గైర్హాజరు కారణంగా అండర్‌గ్రౌండ్ బొగ్గు గనుల్లో ఉత్పత్తి, ఉత్పాదకతకు తీవ్ర నష్టం జరుగుతోందని మందమర్రి ఏరియా సింగరేణి జీఎం జి.దేవేందర్ అన్నారు. గురువారం జీఎం ఆఫీస్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో జులై నెలలో ఏరియా బొగ్గు గనుల్లో ఉత్పత్తి, ఉత్పాదకత వివరాలు వెల్లడించారు. జులైలో 2,03,000 టన్నుల టార్గెట్‌కు గాను 62శాతంతో 1,24,920 టన్నుల ఉత్పత్తి సాధించాయన్నారు. కేకే- 5 గనిలో 114 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన గని ఉద్యోగులు, ఆఫీసర్లను అభినందించారు. ఈ గనిలో 16,500 టన్నులకు గాను 18,874 టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగిందని, ఆర్థిక సంవత్సరం నాలుగు నెలలకు గాను 106 శాతంతో ముందకుసాగుతోందన్నారు.
కాసిపేట2 గనిలో 75శాతం, కాసిపేట1 గనిలో 71 శాతం, శాంతిఖని గనిలో 70 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు తెలిపారు. కేకే ఓసీపీలో కాంట్రాక్టర్ సమస్యతో నిర్దేశిత ఓబీ వెలికితీత చేయకపోవడంతో బొగ్గు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. 1,40,000 టన్నులకు గాను 52 శాతంతో 72,378 టన్నుల ఉత్పత్తి మాత్రమే జరిగిందన్నారు. ఉద్యోగుల గైర్హాజరు శాతం తగ్గించాల్సిన అవసరం ఉందని, ఇందుకు ఉద్యోగులు, యూనియన్ లీడర్లు, ఆఫీసర్లు సహకారం అందించాలని కోరారు. సమావేశంలో ఏరియా ఇన్ఛార్జీ పర్సనల్ మేనేజర్ ఆసిఫ్, డివైపీఎం సందీప్, సీనియర్ పీవోలు బొంగోని శంకర్‌గౌడ్, సత్యనారాయణ, మేనేజ్మెంట్ ట్రైయినీ(ఐఈ)కె.శ్యాంకుమార్ తదితరులు పాల్గొన్నారు.