తెలంగాణలో మరో 8 సోలార్ ప్లాంట్లు.. సింగరేణి భారీ పెట్టుబడి

తెలంగాణలో మరో 8 సోలార్ ప్లాంట్లు.. సింగరేణి భారీ పెట్టుబడి
  • దేశవ్యాప్తంగా టెండర్లకు ఆహ్వానం 
  • ఫస్ట్ ఫేజ్ లో 224 మెగావాట్లు అందుబాటులోకి..
  • సెకండ్ ఫేజ్ టార్గెట్ 232 మెగావాట్లు

హైదరాబాద్‌‌, వెలుగు: సింగరేణి మరో 8 సోలార్ పవర్ ప్లాంట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఫస్ట్ ఫేజ్​లో చేపట్టిన సోలార్ పవర్ ప్లాంట్లు సక్సెస్ కావడంతో సెకండ్ ఫేజ్ లో 232 మెగావాట్ల సోలార్ పవర్ అందుబాటులోకి తీసుకురావాలని టార్గెట్ పెట్టుకుంది. ఇందుకోసం కోల్‌‌బెల్ట్‌‌ పరిధిలో 8 ప్రాంతాల్లో  రూ.1,348 కోట్ల అంచనా వ్యయంతో ప్లాంట్లు నిర్మించనుంది. వీటిని ఏడాదిలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వీటి నిర్మాణానికి తాజాగా దేశవ్యాప్తంగా టెండర్లను ఆహ్వానించింది. బుధవారం హైదరాబాద్‌‌లోని సింగరేణి భవన్‌‌లో ఉన్నతాధికారులతో సీఎండీ శ్రీధర్‌‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 11న ప్రీబిడ్ సమావేశం నిర్వహించాలని అధికారులను ఆయన ఆదేశించారు. సమర్థవంతమైన ఏజెన్సీలకే పనులు అప్పగించాలని సూచించారు. 2024 సెప్టెంబర్ కల్లా ప్లాంట్ల నిర్మాణం పూర్తయి, విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కావాలన్నారు.  

ఫస్ట్ ఫేజ్ సక్సెస్​తో.. 

మొదట 300 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ పవర్ ప్లాంట్ల నిర్మాణానికి 2020లో సింగరేణి శ్రీకారం చుట్టింది  వీటిలో  కొన్ని ప్లాంట్ల నిర్మాణం పూర్తికావడంతో 224 మెగావాట్ల కరెంట్ అందుబాటులోకి వచ్చింది. వీటి నుంచి ఇప్పటివరకు 731 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి కావడంతో సింగరేణి కరెంటు బిల్లులో రూ.515 కోట్లు ఆదా అయింది. సింగరేణికి ప్రతిఏటా 700 మిలియన్ యూనిట్ల కరెంటు అవసరమవుతోంది. దీనికోసం ఏటా దాదాపు రూ.490 కోట్లు డిస్కమ్ లకు చెల్లిస్తోంది. 

ఫస్ట్‌‌ ఫేజ్‌‌లో అందుబాటులోకి వచ్చిన సోలార్ ప్లాంట్ల నుంచి 2022 సెప్టెంబర్ నుంచి 2023 ఆగస్టు వరకు ఏడాదిలో 342 మిలియన్ యూనిట్ల సోలార్ పవర్‌‌ ఉత్పత్తి  అయింది. దీంతో సంస్థ కట్టాల్సిన కరెంట్ బిల్లులో రూ.240 కోట్లు ఆదా అయింది. ఫస్ట్ ఫేజ్ సక్సెస్ కావడంతో ఖాళీ స్థలాల్లో మరో 232 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్లను నిర్మించి.. సంస్థకు అవసరమైన మొత్తం 700 మిలియన్ యూనిట్ల కరెంటును సొంతంగానే సోలార్ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి చేసుకోవాలని నిర్ణయించారు. 2024 సెప్టెంబర్ నాటికి మొత్తం 532 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్లను అందుబాటులోకి తేవాలని టార్గెట్ పెట్టుకున్నారు.

ప్లాంట్లు నిర్మించేది ఇక్కడే.. 

మందమర్రిలో 240 ఎకరాల్లో 67.5 మెగావాట్ల సోలార్ ప్లాంట్, రామగుండం మూడో ఏరియాలో 166 ఎకరాల్లో (37 మెగావాట్లు), శ్రీరాంపూర్ లో 96 ఎకరాల్లో (27.5 మెగావాట్లు), కొత్తగూడెంలో 130 ఎకరాల్లో (32.5 మెగావాట్లు), సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ప్రాంగణంలో 130 ఎకరాల్లో (37.5 మెగావాట్లు), ఇల్లందులో 55 ఎకరాల్లో (15 మెగావాట్లు), భూపాలపల్లిలో 45 ఎకరాల్లో (10 మెగావాట్లు), రామగుండం ఒకటో ఏరియాలో 13 ఎకరాల్లో (5 మెగావాట్లు) ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు.