చిట్టడవుల్లా ఓసీపీలు..పర్యావరణ పరిరక్షణకు సింగరేణి వనమహోత్సవం

చిట్టడవుల్లా ఓసీపీలు..పర్యావరణ పరిరక్షణకు సింగరేణి వనమహోత్సవం
  • కాలుష్య నియంత్రణ, భూగర్భ జలాల పెంపునకు చర్యలు 
  • ఈసారి 675 హెక్టార్లలో 40 లక్షల మొక్కలు నాటేందుకు టార్గెట్​
  • రెండు రోజులు కింద వనమహోత్సవాన్ని ప్రారంభించిన సీఎండీ

కోల్​బెల్ట్​,వెలుగు : వానాకాలంలో భారీగా మొక్కలు నాటుతూ సింగరేణి పర్యావరణాన్ని సంరక్షిస్తోంది. ఏటా జూన్, జులై లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టి.. సామూహిక వనాలుగా మార్చుతోంది.  ఈ ఏడాది కూడా 675 హెక్టార్లలో 40 లక్షల మొక్కలు నాటాలని టార్గెట్​నిర్ణయించుకుంది. ఇప్పటికే నీడనిచ్చే, పండ్ల మొక్కలను నర్సరీలో పెంచింది. వివిధ ప్రాంతాల్లో వాటిని నాటేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది.  ఆదివారం కొత్తగూడెంలో  సీఎండీ బలరాంనాయక్​ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు.  

ఓసీపీ ఓబీ డంప్​ యార్డులు.. ఖాళీ ప్రదేశాల్లో పెంపకం

బొగ్గు వెలికితీతలో భాగంగా సింగరేణి ఏరియాలో కాలుష్యం ఎక్కువగా ఉంటోంది.  ఓసీపీ గనుల నుంచి బొగ్గును తీసి రవాణా చేస్తుండగా పరిసరాలు కూడా కాలుష్యం బారినపడుతుంటాయి. దీన్ని నివారించేందుకు  ఏండ్లుగా సొంతగా నర్సరీల్లో  మొక్కలు పెంచుతోంది. వాటిని ఓసీపీ డంప్​యార్డులు, గనుల పరిసరాలు, కాలుష్య ప్రభావిత ప్రదేశాల్లో నాటుతోంది. ఓసీపీ డంప్​ యార్డు మట్టి కుప్పలపై వేల సంఖ్యలో మొక్కలు నాటుతుండడంతో బొగ్గు, ధూళి, మట్టి  దుమ్ము ఎగిసిపడకుండా ఉంటుంది.

ఓసీపీ డంప్​ యార్డులు,ఖాళీ ప్రదేశాల్లో బ్లాక్​ప్లాంటేషన్, రోడ్డకు ఇరువైపులా ఎవెన్యూ ప్లాంటేషన్, కాలనీలు, ఆఫీసులు, పార్కుల తదితర ప్రాంతాల్లో మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేసింది. స్వయంగా సీఎండీ ఆధ్వర్యంలో మొక్కల సంరక్షణ బాధ్యతలను నిర్వహిస్తుండగా..  సమీప ప్రాంతాలు, గ్రామాల ప్రజలకు సంరక్షణ బాధ్యతను కాంట్రాక్టు పద్ధతిలో అప్పగిస్తూ ఉపాధిని కూడా కల్పిస్తోంది.  ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే వనమహోత్సవంలోనూ సింగరేణి భాగస్వామ్యం అవుతోంది. 

మూడేండ్లలో 1.30 కోట్ల మొక్కలు 

 2022  నుంచి మూడేండ్లలో 1.30కోట్ల మొక్కలను నాటింది.2022లో 557 హెక్టార్లలో 46.2లక్షలు, 2023లో 562 హెక్టార్లలో 40.74లక్షలు, 2024లో 551 హెక్టార్లలో 43.86 లక్షల మొక్కలను నాటింది.ఇందుకు రూ.42. 64 కోట్లు ఖర్చు చేసింది.  ఈసారి 12 ఏరియాల్లో  675 హెక్టార్ల విస్తీర్ణంలో రూ.33 కోట్లను వెచ్చిస్తూ 40 లక్షల మొక్కలను నాటే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో సింగరేణి సీఎండీ నుంచి కార్మికుడి వరకు భాగస్వామ్యం అవుతారు.  

కనుమరుగయ్యే మొక్కలకు ప్రయారిటీ

ప్రధానంగా కనుమరుగయ్యే వృక్ష జాతులను పెంచేందుకు ప్రయారిటీ ఇస్తుంది. ఉసిరి, నారేప, జిట్రేగి, బండారు, బట్టఘనము, మారేడు, నేరేడు, తాని, నెమలినార, జువ్వి, రావి, తెల్లచిందుగ, మేడి, బూరుగ, ఎర్రచందనం, టేకు, వెదురు, కానుగ వంటి మొక్కలను నాటుతుంది. వీటితో పాటు నిమ్మ, మామిడి,అల్లనేరేడు, సీతాఫలం లాంటి వి కూడా పెంచి కార్మిక కుటుంబాలు ఇండ్లలో నాటేందుకు పంపిణీ చేస్తుంది.

భూగర్భ జలాల పెంపునకు.. 

పర్యావరణ పరరిక్షణతో పాటు భూగర్భ జలాల పెంపునకు ‘ నీటి బిందువు – --జల సింధువు’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తుంది. సింగరేణిలో 105 కొత్త చెరువులు, పూడికతీత పనులకు శ్రీకారం చుట్టింది. ఇందులో   62 మినీ చెరువులను తవ్వాలని టార్గెట్​పెట్టుకుని,  ఇప్పటికే 48 చెరువులను నిర్మించింది. మైన్స్ సమీప ప్రాంతాల్లోని 43 చెరువుల్లో పూడిక తీత పనులకు  25 చెరువుల్లో  పూర్తి చేసింది.

స్థానిక ప్రభుత్వ శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటుంది. వానాకాలంలో కొత్తగా నిర్మించిన చెరువుల్లో నీరు చేరే విధంగా తగు పనులు పూర్తి చేయాలని, నీటి నిల్వ గరిష్టంగా ఉండేలా చూడాలని అధికారులను సీఎండీ ఆదేశించారు. పనుల్లో నాణ్యత ఉండాలని, చెరువు కట్టలు పటిష్టంగా ఉండేలా చర్యలు చేపడుతోంది.