- సింగరేణి సీఎండీ బలరాం
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కార్మికుల పిల్లలతో పాటు ప్రాజెక్టు ప్రభావిత పిల్లల కోసమే చెమట చుక్కలకు తర్ఫీదు ప్రోగ్రామ్ను నిర్వహిస్తున్నామని సింగరేణి సీఎండీ ఎన్. బలరాం పేర్కొన్నారు. కొత్తగూడెం ఏరియా ఆర్సీ ఓఏ క్లబ్లో ఆదివారం నిర్వహించిన చెమట చుక్కలకు తర్ఫీదు ప్రోగ్రాంలో ఆయన మాట్లాడారు. కార్మికులు చెమట అయితే వారి పిల్లలు చుక్కలు లాంటి వారని అన్నారు.
దేశంతో పాటు విదేశాల్లో ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలపై ఈ ప్రోగ్రాం ద్వారా అవగాహన కల్పించనున్నట్టు తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇటీవల హైదరాబాద్లో జరిగిన ప్రోగ్రాంలో దీన్ని అధికారికంగా లాంచ్ చేశారని, సింగరేణిలో మొదటి సారిగా కొత్తగూడెం ఏరియాలో ప్రారంభించినట్లు తెలిపారు.
దశల వారీగా సింగరేణి వ్యాప్తంగా ఈ ప్రోగ్రాంను విస్తరించనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు ఎల్వీ సూర్యనారాయణ, తిరుమలరావు, ఏరియా జీఎం షాలెం రాజు, ఎస్వోటూజీఎం కోటిరెడ్డి, ప్రోగ్రాం ఆఫీసర్ పల్లె రవికుమార్, గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నేతలు వాసిరెడ్డి సీతారామయ్య, త్యాగరాజన్, గట్టయ్య, ఎండీ రజాక్, సీఎంఓఏఐ ఏరియా అధ్యక్షడు నరసింహారావు పాల్గొన్నారు.
