సింగరేణిలో మెడికల్​బోర్డు ఎప్పుడు?

సింగరేణిలో మెడికల్​బోర్డు ఎప్పుడు?

మూడు నెలలుగా ఎదురుచూస్తున్న అర్హులైన కార్మికులు
లాక్ డౌన్ నేపథ్యంలో నిలిచిన బోర్డు .. వయోపరిమితిపై వారసుల్లో బెంగ

మందమర్రి, వెలుగు: కరోనా ప్రభావం సింగరేణి మెడికల్ బోర్డుపై పడింది. లాక్​డౌన్​వల్ల రెండు నెలల నుంచి నిలిచిపోయిన మెడికల్​ బోర్డు  తిరిగి ఎప్పుడు ప్రారంభం అవుతుందోనని కార్మికులు, వారసులు ఎదురుచూస్తున్నారు. లాక్​డౌన్​ వల్ల ఏప్రిల్, మే నెలలో వైద్య పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాకపోవడంతో బోర్డు నిర్వహణను  సింగరేణి యాజమాన్యం నిలిపివేసింది. వైద్య పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న వారికి కనీసం రెండేళ్ల మిగులు సర్వీసు ఉండాలనే నిబంధన ఉంది. మార్చి నెలలో రెండుసార్లు వైద్య పరీక్షలు నిర్వహించిన బోర్డు, మూడోసారి కూడా సమావేశం కావాలని నిర్ణయించినట్లు ప్రచారం జరిగింది. మార్చి 23 నుంచి ప్రభుత్వం లాక్​డౌన్​ విధించడంతో మూడోసారి మెడికల్​ బోర్డు నిర్వహించలేదు.

800 మంది కార్మికుల ఎదురుచూపులు

సింగరేణిలో ప్రతి నెల నిర్వహించే మెడికల్​ బోర్డుకు 200 నుంచి  నుంచి 250  మంది వరకు కార్మికులు దరఖాస్తు చేసుకుంటారు. కార్మికుల వారసులకు ఉద్యోగావకాశం కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిలో కారుణ్యం నియామకాలకు తెరతీసింది. కారుణ్య నియామకాల కోసం సింగరేణి యాజమాన్యం ప్రతి నెలా అవకాశాన్ని బట్టి రెండు లేదా మూడుసార్లు మెడికల్​ బోర్డులను నిర్వహిస్తోంది. కారుణ్యం ద్వారా తమ వారసులకు ఉద్యోగాలు కల్పించుకోవడానికి కార్మికులకు తప్పనిసరిగా రెండేండ్లు  సంవత్సరాల మిగులు సర్వీసు, వారసులకు 35 సంవత్సరాలలోపు వయస్సు ఉండాలనే నిబంధన అమలు చేస్తున్నారు.

వయో పరిమితి బెంగ

రెండు సంవత్సరాల సర్వీసుకు కొద్దిగా ఎక్కువ సర్వీసు ఉన్నవారిని ప్రతినెల నిర్వహించే మెడికల్ బోర్డుకు పిలుస్తూ వారిలో మెడికల్​ అన్​ఫిట్​అయిన వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వడం, మిగితావారు తిరిగి సర్వీసులో కొనసాగేలా నిర్ణయం తీసుకుంటున్నారు. మెడికల్​ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న కార్మికుల వారసుల్లో అనేకమంది వయో పరిమితి దగ్గర పడుతున్నట్లు తెలుస్తోంది. 35 ఏళ్లలోపు వయస్సు కలిగిన వారసులే కారుణ్య నియామకాలకు అర్హులు. బోర్డు నిర్వహణ నిలిచిపోవడంతో వయోపరిమితి దాటిపోతున్న వారసులు, సర్వీసు దగ్గర పడుతున్న కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు. లాక్​డౌన్​ నేపథ్యంలో మార్చితో పాటు ఏప్రిల్, మే నెలలో కూడా బోర్డులు జరగకుండా పోయాయి. రెండేళ్ల సర్వీసు నిబంధన నేపథ్యంలో సుమారు 800 మంది కార్మికులు మెడికల్ బోర్డు కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల యాజమాన్యం ప్రత్యేక పరిస్థితుల్లో సడలింపు ఇస్తామని ప్రకటించినా కార్మికుల్లో మాత్రం ఆందోళన తగ్గడంలేదు. మెడికల్​ బోర్డు ఎప్పటి నుంచి ప్రారంభిస్తారో స్పష్టత లేక అర్హులైన కార్మికులు తమకు న్యాయం జరుగుతుందా లేదా? అని ఆవేదన చెందుతున్నారు.

అందరికి అవకాశం కల్పించాలి
లాక్ డౌన్ విధించడానికి ముందువరకు రెండేళ్ల మిగులు సర్వీసు కలిగిన కార్మికులందరికి మెడికల్ ఇన్వాలిడేషన్లో అవకాశం కల్పించాలి. లాక్ డౌన్ ఎత్తివేత తర్వాత ప్రతి నెలా ఎక్కువ బోర్డులను కండక్ట్ చేసేలా సింగరేణి యాజమాన్యం చర్యలు తీసుకోవాలి. మార్చి నెలలో కోత విధించిన సగం వేతనం మే నెల వేతనంలో కలిపి ఇవ్వాలి.
– కెంగర్ల మల్లయ్య, బీఎంఎస్ స్టేట్ ప్రెసిడెంట్

నెలలో నాలుగు బోర్డులు నిర్వహించాలి
లాక్ డౌన్ నేపథ్యంలో మెడికల్ బోర్డులు నిర్వహించకపోవడంతో రెండేళ్ల సర్వీసు ఉన్న కార్మికులు ఆందోళన చెందుతున్నారు. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత వారానికొకటి చొప్పున నెలలో నాలుగు మెడికల్ బోర్డులను నిర్వహించి అర్హులందరిని మెడికల్ ఇన్వాలిడేషన్ చేయాలి.
– వాసిరెడ్డి సీతారామయ్య,
ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ

For More News..

మోడీ పాలనలో పవర్‌ఫుల్ ఇండియా

తల్లిదండ్రులు భార్యను వేధిస్తున్నారని.. ఆమెతో కలిసి సూసైడ్ చేసుకున్న భర్త

కరోనా గురించి మామను కోల్పోయిన అల్లుడి సోషల్ మీడియా పోస్ట్