సింగరేణి రెయిన్ ప్లాన్ .. ఓసీపీల్లో నిరంతర బొగ్గు ఉత్పత్తికి చర్యలు

సింగరేణి రెయిన్ ప్లాన్ .. ఓసీపీల్లో నిరంతర బొగ్గు ఉత్పత్తికి చర్యలు
  • భారీ వానలతో ఆటంకాలు రాకుండా ప్రత్యేక ప్రణాళిక  
  • సరిపడా మోటార్లు ఏర్పాటు, సైడ్ డ్రైన్ల నిర్వహణ
  • రోజుకు 2.2లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి టార్గెట్  
  • అన్ని ఏరియాల జీఎంలకు  సీఎండీ దిశానిర్దేశం

కోల్​బెల్ట్, వెలుగు: వచ్చే వానాకాలం దృష్ట్యా సింగరేణి యాక్షన్ ప్లాన్ కు సిద్ధమైంది. కోల్ బెల్ట్ ఏరియాలోని 17 ఓసీపీల్లో బొగ్గు నిరంతరం ఉత్పత్తి అయ్యేలా ముందుకెళ్లనుంది.  ఓసీపీల ద్వారానే 70 శాతం బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. ఇటీవల సంస్థ అన్ని విభాగాల అధికారులతో సీఎండీ బలరాంనాయక్​ సమీక్షించారు. గత శనివారం జీఎంలు, డైరెక్టర్లతో సీఎండీ  వీడియో కాన్ఫరెన్స్​నిర్వహించి.. వర్షాలతో ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తికి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలపై పలు సూచనలు, ఆదేశాలు చేశారు. వీటిని పకడ్బందీగా  అమలు పరచాలని స్పష్టంచేశారు. భారీ వర్షాలతో ఓసీపీల్లోకి వరదనీరు వచ్చి చేరుతుంది. దీంతో క్వారీల్లో(సంపులు) నీటి మట్టం పెరిగితే మెషీన్లు మునిగిపోతుంటాయి.  భారీ మెషీన్లు నడిచే హాలేజీ రోడ్లు (ఓసీపీ ప్రధాన రోడ్లు), బొగ్గు వెలికితీసే కోల్​బెంచ్​క్వారీ, మట్టిని వెలికితీసే ఓబీ క్వారీల్లో నీటి నిల్వలు లేకుండా చూడాలని ఆదేశించారు.  

గనుల వారీగా ప్రత్యేక ప్లాన్ 

ఓసీపీల్లో నీటి నిల్వలు పెరగకుండా హై కెపాసిటీ పంపులు ఏర్పాటు చేయడం, ఎప్పటికప్పుడు బయటకు పంపింగ్​చేసేలా భారీ మోటార్లను వినియోగించుకునేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు.  నీరు క్వారీలోకి చేరి హాలేజీ రోడ్లు బురదమయంగా మారుతాయి. అవసరమైనన్ని మోటార్లను సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. రోడ్లపై బురద లేకుండా ఎప్పటికప్పుడు గ్రేడింగ్​చేయడం, రోడ్లపై నీరు నిల్వకుండా సైడ్​డ్రైన్ల నిర్వహణపైనా చర్చించారు. గనుల వారీగా ప్రత్యేక ప్లాన్ రూపొందించుకోవాలని సీఎండీ సూచించారు.  

మహిళా ఉద్యోగుల నిర్వహణకు..

బొగ్గు గనుల ఏరియాల్లో పర్యటిస్తూ ఉత్పత్తి, ఉత్పాదకత, ఇతర అంశాలను పరిశీలించారు.  ఇటీవల మణుగూరు ఏరియాలో బొగ్గు గనులను సందర్శించారు. ఒడిశాలో కొత్తగా ప్రారంభించిన నైనీ బొగ్గు బ్లాకులో పనిచేసేందుకు సూపర్ వైజర్ సిబ్బందిని ఎంపిక చేసి పంపేలా ఆదేశించారు. కొత్తగా నియమించిన ఉద్యోగులను భూగర్భ అండర్ గ్రౌండ్ గనుల్లో పనిచేసేలా పోస్టింగులు ఇవ్వాలని,  సంస్థలో మహిళా ఉద్యోగిను ల సంఖ్య పెరిగినందున వీరి నిర్వహణలో ఒక ఓపెన్ కాస్ట్ గనిని,  అండర్ గ్రౌండ్ గనిని ఎంపిక చేయాలని సూచించారు. ముందుగా ఒక పూర్తి షిఫ్ట్ ను మహిళలతోనే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని, బొగ్గు రవాణ, నాణ్యతపై దృష్టి సారించాలని సీఎండీ స్పష్టంచేశారు. 

ఉత్పత్తి, రవాణాకు ఇబ్బందులు రాకుండా.. 

 సింగరేణిలో ప్రతిరోజు 2.2 లక్షల టన్నులు బొగ్గు ఉత్పత్తి అవుతుండ గా.. మరోవైపు 2.4 లక్షల టన్నులు రవాణా చేస్తోంది. మామూలు రోజుల్లాగానే  వానాకాలంలో కూడా యధావిధిగా బొగ్గు ఉత్పత్తి, రవాణాకు ఆటంకాలు రాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సీఎండీ ఆదేశించారు.  సింగరేణి 2025 – 26 ఆర్థిక సంవత్సరానికి 76 మిలియన్​టన్నుల బొగ్గు ఉత్పత్తి టార్గెట్​గా పెట్టుకుంది. అయితే.. తొలి నెల ఏప్రిల్​లో 52.78 లక్షల టన్నుల లక్ష్యం కాగా, నెలాఖారునాటికి 49.91 లక్షల టన్నులు మాత్రమే సాధించింది. దీంతో ఆర్థిక సంవత్సర లక్ష్యాల సాధనకు సీఎండీ స్పెషల్​ఫోకస్​పెట్టారు. ఎందుకు ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోలేకపోయామని డైరెక్టర్లు, జీఎంలు, ఏజెంట్ల  మీటింగ్ లో చర్చించారు.