రాజస్థాన్ లో సింగరేణి సోలార్ పార్కులు ..భూమిని కేటాయిస్తూ ఆ రాష్ట్రసర్కార్ నిర్ణయం

రాజస్థాన్ లో  సింగరేణి సోలార్ పార్కులు ..భూమిని కేటాయిస్తూ  ఆ రాష్ట్రసర్కార్ నిర్ణయం
  • ప్రాసెస్​ తర్వాత ల్యాండ్ ను సింగరేణికి అప్పగింత 
  • లేఖ రాసిన  ఆర్ఆర్​వీయూఎన్ ఎల్ 

గోదావరిఖని, వెలుగు : తెలంగాణలో బొగ్గు, విద్యుత్, సోలార్​ఉత్పత్తిని సాధిస్తూనే సింగరేణి ఇతర రాష్ట్రాల్లో సోలార్ పవర్ జనరేట్ చేయడంపైనా ఫోకస్ చేసింది. ఇందుకు త్వరలోనే రాజస్థాన్​లో సోలార్ పార్క్ లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఆ రాష్ట్ర ఎనర్జీ విభాగానికి సింగరేణి లేఖ రాసింది. ప్లాంట్ల ఏర్పాటుకు అవసరమైన భూమిని కేటాయించడానికి అభ్యంతరం లేదని రాజస్థాన్​సర్కార్ కూడా ఆమోదం తెలిపింది. త్వరలో తెలంగాణ క్యాబినెట్​మీటింగ్ లో చర్చించిన తర్వాత ప్రత్యేక బృందం ఆ రాష్ట్రంలో పర్యటించనుంది.  

7,364 ఎకరాల భూమి కేటాయింపునకు ఓకే  

సోలార్​పవర్​ప్లాంట్లను(రెన్యూవబుల్​ఎనర్జీ పార్కులు) ఏర్పాటు చేస్తామని, ఇందుకు కావాలసిన భూమిని ఇవ్వాలని రాజస్థాన్​రాష్ట్ర విద్యుత్​ఉత్పాదన నిగమ్​లిమిటెడ్(ఆర్ఆర్ వీయూఎన్ఎల్​)కు కొన్నాళ్లకింద సింగరేణి లేఖ రాసింది. దీనిపై ఆ సంస్థ సానుకూలంగా స్పందించింది. వెంటనే ప్లాంట్ల నిర్మాణ ప్రక్రియను మొదలు పెట్టింది.  

బికనేర్​లోని సవైసార్​లో 880 హెక్టార్లు, జైసల్మేర్​లోని పతేగఢ్​లో 1500 హెక్టార్లు, బోడానాలో 600 హెక్టార్లలో సోలార్​పార్క్​లకు మొత్తంగా 2,980 హెక్టార్ల (7,364 ఎకరాలు) భూమిని రిజర్వ్​చేస్తూ నిర్ణయం తీసుకుంది.  ప్రస్తుతం భూమి కేటాయింపు పనులు ప్రాసెస్​లో ఉండగా.. త్వరలోనే స్వాధీనం చేసేందుకు సింగరేణి చర్యలు తీసుకోనుంది. మరోవైపు సోలార్ పార్క్ ల నిర్మాణాలను వేగంగా కొనసాగించాలని కోరుతూ ఆర్ఆర్ వీయూఎన్​ఎల్​సంస్థ చీఫ్ ఇంజినీర్​విష్ణు ప్రకాశ్​గార్గ్​ ఇటీవల సింగరేణి పవర్​ప్రాజెక్ట్స్​విభాగానికి చెందిన హెచ్ఓడీకి లేఖ రాశారు. 

రాష్ట్రంలో ఇప్పటికే 245.5 మెగావాట్ల  సోలార్​ విద్యుత్ ​ఉత్పత్తి 

ఇల్లందు, కొత్తగూడెం, ఎస్​టీపీపీ, ఆర్జీ –3 సెంటినరీ కాలనీ, మందమర్రి తదితర ఏరియాల్లో ఇప్పటికే 245.5 మెగావాట్ల సోలార్​విద్యుత్​ను సింగరేణి ఉత్పత్తి చేస్తోంది. దీనికితోడు మల్లన్నసాగర్, లోయర్​మానేరు డ్యామ్, జైపూర్​ఎస్టీపీపీ రిజర్వాయర్​పై ఫ్లోటింగ్​సోలార్​పవర్​ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. తాజాగా రాజస్థాన్​లో సోలార్​పవర్​జనరేషన్​ప్లాంట్లను ఏర్పాటు చేసే పనిలో సింగరేణి నిమగ్నమైంది.  

సోలార్​పార్క్​లను ఏర్పాటు చేస్తాం 

రాజస్థాన్​రాష్ట్ర విద్యుత్​సంస్థ ఎక్కువ సోలార్ పవర్ ఉత్పత్తి చేయాలని సింగరేణిని కోరింది. దీనిపై స్పందిస్తూ లేఖ రాయగా 7 వేల ఎకరాలకుపైగా భూమిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రాసెస్​కంప్లీట్​కాగానే రాజస్థాన్​లో 1,500 మెగావాట్ల సోలార్​ పవర్​ పార్క్​లను ఏర్పాటు చేస్తాం.- ఎన్.బలరామ్​నాయక్​, సింగరేణి సీఎండీ