సింగరేణి నెత్తిన.. బకాయిల బండ!..విద్యుత్ సంస్థల వద్ద రూ.42,739 కోట్లు బకాయిలు

సింగరేణి నెత్తిన.. బకాయిల బండ!..విద్యుత్ సంస్థల వద్ద రూ.42,739 కోట్లు బకాయిలు
  • పార్లమెంటులో వెల్లడించిన కేంద్ర బొగ్గు గనుల మంత్రి
  •  ఏండ్లుగా బకాయిల విడుదలకు సంస్థ ఎదురుచూపు 
  • కొత్త గనుల తవ్వకం.. మెషీన్ల కొనుగోలుపై ఎఫెక్ట్  
  • కార్మికుల లాభాల వాటా ప్రకటనలోనూ జాప్యమే
  • గత సర్కార్ లో పదేండ్లు ఏటీఎంగా మారిన సంస్థ
  • డిస్కంల బకాయిలు రాబడితేనే ఆర్థిక వెసులుబాటు

కోల్​బెల్ట్, వెలుగు : సింగరేణి సంస్థ ఆర్థిక పరిస్థితి ఆశించినట్లు లేకపోగా.. వేల కోట్ల బకాయిల వసూళ్ల కోసం ఏండ్లుగా ఎదురుచూస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు జెన్​కో, ట్రాన్స్​కో (డిస్కంలు), ఇతర విద్యుత్ కేంద్రాలకు సంబంధించి  రూ. వేల కోట్ల బకాయిలు సింగరేణికి రావాల్సి ఉంది. 

మరోవైపు సింగరేణి తన ఆర్థిక అవసరాల ను తీర్చుకునేందుకు బ్యాంకుల వద్ద ఓడీల ద్వారా నిధులు సమకూర్చుకు టోంది. దీనికి తోడు కొత్త మైన్ల తవ్వకాలు, మెషీన్ల కొనుగోలు, కార్మికుల లాభాల వాటా ప్రకటనపైనా  ఆచితూచి వ్యవహరిస్తోంది. సింగరేణి చేతిలో డబ్బులు లేకపోవడంతో కాగితాల్లోనే లాభాలు చూపుతుండడం ద్వారా సంస్థ నిర్వహణపై తీవ్ర ప్రభావం పడుతోంది.  

టీఎస్ జెన్ కో, ట్రాన్స్ కో నుంచి..  

తెలంగాణలోని విద్యుత్​సంస్థలు(డిస్కంలు) సింగరేణికి రూ.42,739 కోట్లు బకాయిలు పడ్డాయని కేంద్రం తాజాగా వెల్లడించింది. ప్రభుత్వ డిస్కంల ద్వారా బకాయిలు, వడ్డీ కలిపి మొత్తంగా రూ. రూ.42,739కోట్లు సింగరేణి రావాల్సి ఉందని బుధవారం లోక్​సభలో కేంద్ర బొగ్గు గనులశాఖ మంత్రి కిషన్​రెడ్డి వెల్లడించా రు. మెదక్​ఎంపీ రఘునందన్​రావు అడిగిన ప్రశ్నకు రాతపూర్వకంగా ఆయన సమాధానం ఇచ్చారు. బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం నేరుగా చెల్లించాల్సినవి కాదని, ప్రభుత్వానికి చెందిన సంస్థల నుంచి రావా ల్సినవని పేర్కొన్నారు.

 సింగరేణి బొగ్గును తెలంగాణ జెన్​కోకు అమ్ముతుండగా రూ.18,064 కోట్లు రావాల్సి ఉంది. మరోవైపు సంస్థ థర్మల్,సోలార్​పవర్​ప్లాంట్ల ద్వారా విద్యుత్​ను ఉత్పత్తి చేసి డిస్కంలకే విక్రయిస్తుం డగా.. టీఎస్​ట్రాన్స్​కో నుంచి రూ.24,675 కోట్లు బకాయిలు రావాల్సి ఉంది. ఆయా సంస్థలు ఏండ్లుగా చెల్లించడంలేదు. వడ్డీ కూడా భారీగానే పెరిగింది. టీఎస్​జెన్​కో బకాయిలపై వడ్డీ రూ.1,695 కోట్లు, టీఎస్​ట్రాన్స్​కో బకాయిలపై రూ.11,806 కోట్లు వడ్డీ రావాల్సి ఉంది.  -మెషీన్ల కొనుగోలు..ఇతర అవసరాలకు 

సింగరేణి 2025-– 26 ఆర్థిక సంవత్సరం భారీగా బొగ్గు ఉత్పత్తి టార్గెట్లను పెట్టుకుంది. సంస్థ వద్ద డబ్బులు లేకపోవడంతో కొత్త మెషీన్లు కొనుగోలు చేయలేక బొగ్గు గనుల్లో 8 –12 ఏండ్ల కాలం చెల్లిన ఎస్టీఎల్​మెషీన్లనే వినియోగిస్తోంది. ఇటీవల మందమర్రి ఏరియాలోని కేకే –5 గనిలో కాలం చెల్లించిన ఎస్డీఎల్​మెషీన్​వాడడం ద్వారా ప్రమాదం జరిగి కార్మికుడు శ్రావణ్​కుమార్​మృతిచెందాడు. 

కోల్​తవ్వకాల ముడి సరుకుకు, మెషీన్లు సరఫరా చేసే సంస్థలకు, పాత అప్పులకు వడ్డీలు కట్టేందుకు, ఓపెన్ కాస్ట్​ గనుల్లో ఓబీ పనులు చేసే కాంట్రాక్టర్లకు ఎప్పటికప్పుడు చెల్లింపులు చేయాల్సి ఉంటుంది.  అధికారులు, సిబ్బంది, కార్మికులకు ప్రతినెలా రూ.250 – రూ.300 కోట్ల మేర జీతాలు ఇవ్వాలి. సుమారు 43వేల మంది  వైద్య సౌకర్యాల కోసం ఏటా రూ.150 కోట్ల వరకు వెచ్చిస్తోంది. ఇలా వందల కోట్ల నిధులు అవసరం. 

కాగా, మరోవైపు కార్మికుల వాటా ప్రకటనపైనా ఆచితూచి వ్యవహరిస్తోంది. మరికొద్ది కాలం గడిస్తే సంస్థ ఆర్థిక పరిస్థితి మరింత అధ్వానంగా మారే చాన్స్ కనిపిస్తోంది. ఇలా సింగరేణి ఆర్థిక కష్టాలు ఎదుర్కొనేందుకు గత బీఆర్ఎస్​సర్కార్10ఏండ్లు  సంస్థను ఏటీఎం మెషీన్​గా వాడుకుంది. సంస్థకు చెందిన వేల కోట్ల ఫండ్స్​బలవంతంగా తరలించింది. తద్వారా సంస్థ ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. ప్రస్తుతం విద్యుత్ సంస్థల బకాయిలు ఇప్పించేందుకు రాష్ట్ర సర్కార్​చొరవ తీసుకోవాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి.  

కొత్త ప్రాజెక్టులకు నిధులేవీ ?

విద్యుత్ సంస్థల నుంచి బకాయిలు వసూలు కాకపోవడంతో సింగరేణి కొత్త బొగ్గు గనులు, ప్రాజెక్టుల నిర్మాణాలపై ప్రభావం పడుతోంది. కొత్త బొగ్గు గనులను దక్కించుకోవాలంటే ముందుగా టెండర్ల ప్రక్రియలో పాల్గొనాలి. ఇందుకు భారీగా నిధులు వెచ్చించాల్సి ఉంటుంది. దీంతో టెండర్ల వేసేందుకు సింగరేణి వెనుకంజ వేస్తుందని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. 

కొంతకాలంగా రాజస్థాన్​తో పాటు మంచిర్యాల జిల్లా జైపూర్​సింగరేణి థర్మల్​పవర్ ప్లాంట్​మరో 800 మెగావాట్ల మూడో పవర్​ప్లాంట్​ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. వీటికి కనీసం రూ.20వేల కోట్ల వరకు నిధులు కావాలి. ఒడిశాలో నైనీకోల్​బ్లాక్​లో ఉత్పత్తి ప్రారంభించింది. అందుకు అవసరమైన మెషీన్లు, టెక్నాలజీ  వంటివాటికి నిధులు ఖర్చుచేయాల్సిన అవసరం ఉంటుంది.