కోల్‌బెల్ట్, వెలుగు: సింగరేణి కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో హైదరాబాద్‌లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని యాజమాన్యం తీసుకున్న నిర్ణయం ఇప్పటికీ ముందుకు సాగడం లేదు. ఎనిమిది నెలల క్రితం ప్రకటించిన ఈ ప్రణాళిక ప్రతిపాదనల దశలోనే నిలిచిపోయింది. ఇప్పటికే అన్ని వసతులు ఉన్న ఆస్పత్రిని లీజు తీసుకోవాలని లేదంటే కొనుగోలు చేయాలని నోటిఫికేషన్ ఇచ్చినా సంస్థల నుంచి ఆశించిన స్పందన రాలేదు.
సింగరేణి కార్మికులు, వారి కుటుంబాలకు వైద్య సేవలు అందించేందుకు సంస్థ కొత్తగూడెంలోని మొయిన్ ఆస్పత్రితో పాటు రామకృష్ణాపూర్, బెల్లంపల్లి, గోదావరిఖని, భూపాలపల్లి, మణుగూరు, ఇల్లందు ప్రాంతాల్లో ఏరియా ఆస్పత్రులు నిర్వహిస్తోంది. వీటితో పాటు మరో 21 డిస్పెన్సరీలు ఉన్నాయి.
మొత్తం 821 పడకలు, 180 మంది డాక్టర్లు, 57 మంది స్పెషలిస్టులు, 123 మంది మెడికల్ ఆఫీసర్లు, 1,120 మంది వైద్య సిబ్బంది సేవలందిస్తున్నారు. సుమారు 42 వేల మంది కార్మికులు, ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులు, రిటైర్డ్ కార్మికులు కలిపి లక్షకు చేరువలో ప్రజలు ఈ వైద్య సేవలపై ఆధారపడుతున్నారు. అయితే ఆస్పత్రుల్లో స్పెషలిస్టు డాక్టర్లు, టెక్నీషియన్లు, నర్సుల కొరత ఉండటంతో మెరుగైన చికిత్స అందడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రైవేటు ఆస్పత్రులకు రూ.150 కోట్ల ఖర్చు..
సింగరేణి వైద్యశాఖ నిర్వహణకు, మందుల సరఫరాకు యాజమాన్యం ప్రతి సంవత్సరం సుమారు రూ.400 కోట్లు ఖర్చు చేస్తోంది. అయినప్పటికీ సూపర్ స్పెషాలిటీ చికిత్స కోసం హైదరాబాద్ తదితర ప్రాంతాల్లోని ప్రైవేటు ఆస్పత్రులకు రిఫరల్ కేసుల పేరిట మరో రూ.150 కోట్లు వరకు చెల్లించాల్సి వస్తోంది. చిన్నచిన్న కేసులకూ ప్రైవేటు ఆస్పత్రులకు పంపడం వల్ల ఖర్చు పెరుగుతోందని అప్పటి సీఎండీ ఎన్. బలరాం అసంతృప్తి వ్యక్తం చేశారు.
రిఫరల్ ఖర్చులు తగ్గించేందుకు..
రిఫరల్ ఖర్చును తగ్గించడంతో పాటు కార్మికులకు మెరుగైన వైద్యం అందించేందుకు హైదరాబాద్‌లో కార్పొరేట్ స్థాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని సంస్థ నిర్ణయించింది. సింగరేణి ఉద్యోగులకు సేవలందించడంతో పాటు బయటి రోగులకు కూడా చికిత్స అందించి ఆదాయం పొందాలనే ఉద్దేశంతో ఈ ప్రణాళిక రూపొందించారు.
ఈ నేపథ్యంలో గతేడాది సెప్టెంబర్ 5న యాజమాన్యం నోటిఫికేషన్ జారీ చేసింది. గుండె, ఆర్థోపెడిక్, న్యూరో, లివర్, కిడ్నీ, వెన్నెముక, ఊపిరితిత్తులు, ఈఎన్టీ, గైనకాలజీ వంటి విభాగాల్లో సూపర్ స్పెషాలిటీ సేవలు అందించే ఆస్పత్రిని లీజు లేదా కొనుగోలు చేయాలని భావించింది. ఆస్పత్రిలో 150 నుంచి 200 పడకల సామర్థ్యం ఉండాలని కూడా పేర్కొంది.
స్పందన లేక నిలిచిపోయిన ప్రణాళిక..
అయితే యాజమాన్యం ప్రతిపాదనలు, కార్పొరేట్ ఆస్పత్రులు పెట్టిన షరతుల మధ్య తేడాలు ఉండటంతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటుకు సరైన స్పందన రాలేదు. ఇదే సమయంలో అప్పటి సీఎండీ బలరాం నాయక్ ఇతర సేవలకు వెళ్లిపోవడంతో ఈ అంశం మరింత నెమ్మదించింది. ఉన్నతాధికారులు ఈ విషయంపై అధికారికంగా స్పందించకపోవడంతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రతిపాదన నిలిచిపోయింది.
ఆర్థిక వనరుల కొరత వల్లే..
విద్యుత్ సంస్థల నుంచి రావాల్సిన వేల కోట్ల బకాయిలు ఇంకా అందకపోవడంతో ఆర్థిక వనరుల కొరత ఏర్పడింది. ఈ కారణంగానే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుకు చర్యలు ముందుకు సాగడం లేదు. యాజమాన్యం ఈ అంశంపై త్వరగా నిర్ణయం తీసుకుని ఆస్పత్రి ఏర్పాటు చేయాలి. (- సీతారామయ్య, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు)
