ఉచిత డ్రైవింగ్ శిక్షణ కోసం టైడ్స్‌‌‌‌తో సింగరేణి ఒప్పందం

ఉచిత డ్రైవింగ్ శిక్షణ కోసం టైడ్స్‌‌‌‌తో సింగరేణి ఒప్పందం

హైదరాబాద్‌, వెలుగు: సింగరేణి ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు లైట్ మోటార్ వెహికల్, హెవీ మోటార్ వెహికల్ నడపడంలో నెల రోజుల‌పాటు ఉచిత శిక్షణ ఇప్పించేందుకు సింగ‌రేణి యాజ‌మాన్యం అవకాశం కల్పిస్తోంది. ఇందుకు రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలోని తెలంగాణ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేష‌న్‌  అండ్ స్కిల్స్ (టైడ్స్‌) అనే సంస్థతో సింగరేణి కాలరీస్  ఒప్పందం కుదుర్చుకుంది. హైద‌రాబాద్‌లోని సింగ‌రేణి భ‌వ‌న్‌లో జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్  కె సూర్యనారాయణ, టైడ్స్  సెక్రట‌రీ, ప్రిన్సిపల్  నుంజుమ్ రియాజ్ ఒప్పంద ప‌త్రాల‌పై సోమవారం సంతకాలు చేశారు.

ఈ సందర్భంగా సూర్యనారాయ‌ణ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం, అశోక్ లేలాండ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ డ్రైవింగ్ ఇన్‌స్టిట్యూట్ లో సింగ‌రేణి ప్రాంత నిరుద్యోగ యువ‌త‌కు ఉచిత భోజన వసతితో నెల రోజుల పాటు డ్రైవింగ్​లో శిక్షణ ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నట్లు వివ‌రించారు. ఈ ఏడాదిలో 100 మందికి శిక్షణ ఇస్తామని, న‌వంబ‌రులో 25 మందిని శిక్షణకు పంపుతున్నామని తెలిపారు. సింగరేణి ప్రాంతంలోని పీఏఎఫ్‌, పీడీఎఫ్‌, ఉద్యోగుల పిల్లలు, విశ్రాంత ఉద్యోగుల పిల్లలు ఈ అవకాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌న్నారు. ఆస‌క్తి ఉన్నోళ్లు ఏరియాలోని సింగరేణి సేవా సమితి కోఆర్డినేటర్​ను సంప్రదించాలన్నారు.