గోదావరిఖని, వెలుగు: బొగ్గు గనులను వేలం వేస్తే సింగరేణి మనుగడకే ప్రమాదమని టీజేఎస్ చీఫ్, ప్రొఫెసర్ కోదండరామ్ ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఇఫ్టూ అధ్యక్షుడు ఐ.కృష్ణ అధ్యక్షతన జరిగిన సింగరేణి కార్మిక సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. గనులను వేలం వేస్తే సింగరేణిలో కొత్త గనులు రావని, ఉద్యోగాలు దక్కవని అన్నారు. ఇక్కడ కొత్త గనులను తవ్వకుండా, ఉద్యోగాలు రాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయన్నారు.
సంస్థ పరిరక్షణ, కాంట్రాక్ట్ కార్మికులకు హై పవర్ వేతనాలు, వెట్టి చాకిరీ విముక్తి కోసం కార్మికులు ఐక్యంగా ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాజకీయాలకతీతంగా సింగరేణి బచావో ఉద్యమంలో పాల్గొనాలని కోదండరాం కోరారు. అనంతరం మీటింగ్లో పలు తీర్మానాలను ఆమోదించారు. సమావేశంలో సింగరేణి కార్మిక సంఘాల లీడర్లు టి.శ్రీనివాస్, మాదాసు రామూర్తి, కామెర గట్టయ్య, ఎం.కుమారస్వామి, రత్నాకర్ రావు, రాజమౌళి, కె.విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.
