ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్. జానకి ఏకైక కుమారుడు మురళీకృష్ణ కన్నుమూశారు. ఆయన ఆకస్మిక మరణ వార్తను సింగర్ కె.ఎస్. చిత్ర సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మురళీకృష్ణ మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, ఈ బాధాకరమైన సమయంలో జానకి అమ్మకు దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కె.ఎస్. చిత్రం భావోద్వేగంగా పోస్ట్ చేశారు. అలాగే తాను ప్రేమగల సోదరుడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో కె.ఎస్. చిత్ర ఒక భావోద్వేగ పోస్ట్‌ను షేర్ చేస్తూ, “ఈ ఉదయం మురళి అన్న (మా ప్రియమైన జానకి అమ్మ ఏకైక కుమారుడు) ఆకస్మిక మరణ వార్త విని నేను షాక్ అయ్యాను. మేము ఒక ప్రేమగల సోదరుడిని కోల్పోయాము. ఈ భరించలేని బాధను, దుఃఖాన్ని అధిగమించేందుకు దేవుడు అమ్మకు శక్తిని ప్రసాదించుగాక. మరణించిన ఆత్మకు శాశ్వత శాంతి చేకూరాలి. ఓం శాంతి” అని తెలిపారు.
భారతనాట్యంలో ప్రావీణ్యం కలిగిన మురళీకృష్ణ పలు సినిమాల్లోనూ నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఆయనకు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.అనుక్షణం కంటికి రెప్పలా చూసుకునే ఒక్కగాని ఒక్క కొడుకు దూరమవడంతో జానకి గారి కుటుంబంలో తీరని లోటు ఏర్పడింది. ఈ విషాద సమయంలో చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. మురళి కృష్ణకి నివాళులు అర్పిస్తున్నారు.
