నా కెరీర్‌‌లో అత్యంత ఛాలెంజింగ్ సినిమా సింగ్‌‌ గీతం: దేవిశ్రీ ప్రసాద్

నా కెరీర్‌‌లో అత్యంత ఛాలెంజింగ్ సినిమా సింగ్‌‌ గీతం: దేవిశ్రీ ప్రసాద్

సింగీతం గారు ఓ లెజెండ్‌. నేను ఆయనకు వీరాభిమానిని. ఆయన చేసిన ప్రయోగాలు మరెవ్వరూ చేసి ఉండరు. ఆయన సినిమాలన్నీ అడ్వాన్సుడ్‌‌గా ఉంటాయి. ‘సింగ్ గీతం’ ఐడియా కూడా అంతే కొత్తగా ఉంటుంది. ఆయనతో కలిసి పనిచేయడం ఒక బ్లెస్సింగ్‌‌లా అనిపించింది. ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను.

ఒక ఊరు మొత్తం కేవలం పాటల రూపంలోనే మాట్లాడే కథ ఇప్పటివరకు రాలేదు. కామెడీతో పాటు అద్భుతమైన ఎమోషన్స్‌‌ ఉన్నాయి.  ఇది నా కెరీర్‌‌లో అత్యంత ఛాలెంజింగ్ సినిమా. స్క్రిప్ట్  మొత్తం చదివి ప్రతి డైలాగ్‌‌ను సంగీతంగా మార్చాల్సి వచ్చింది.  చిన్నప్పటి నుంచి ప్రతి అక్షరాన్ని సంగీతంగా మార్చే అలవాటు నాకు ఉండేది. అదే ఈ సినిమాకు ఉపయోగపడింది. 

ఒక సీన్ తీసుకుని మ్యూజికల్‌‌గా చేసి వినిపించాను. అది విని సింగీతం గారు ‘మనకు కావాల్సిన మ్యూజిక్ ఇదే’ అని అన్నారు.  అది నాకు పెద్ద కాంప్లిమెంట్‌‌. మిగతా సినిమాలకు ఒక ఫార్మాట్ ఉంటుంది. కానీ దీనికి నేనే కొత్త ఫార్మాట్ కనిపెట్టి, మ్యూజిక్‌‌ను పార్ట్స్‌‌గా విభజించి పంపించేవాడిని. సింగీతం గారు, నాగ్ అశ్విన్ గారు సూచనల మేరకు మార్పులు చేసేవాళ్లం.  ప్రతిదీ ముందుగానే మ్యూజికల్‌‌గా చేసి ఇవ్వగా, ఆ తర్వాత దానిని షూట్ చేశారు.

సినిమాలో డైలాగ్ మారితే ఎడిటింగ్‌‌లో మార్చుకోవచ్చు. కానీ ఇది మ్యూజికల్ సినిమా. డైలాగ్‌‌ మారితే స్కేల్‌‌ మారిపోతుంది. మొత్తం మళ్లీ చేయాల్సి వస్తుంది. ఇందులో నటించిన ప్రతి ఒక్కరూ పాడగలిగారు. కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చాం. ప్రతి డైలాగ్‌‌ మ్యూజికల్‌‌గా ఉన్నా ప్రేక్షకులు పాటలు వింటున్నామనే విషయమే మర్చిపోతారు. 

అవుట్‌‌పుట్‌‌ చూశాక సింగీతం గారి విజన్‌‌కి ముగ్ధులమైపోయాం. ఒక విభిన్నమైన సినిమా చూసిన అనుభూతి ప్రేక్షకులకు ఖచ్చితంగా కలుగుతుంది. ఇక నేను లీడ్‌‌ రోల్‌‌లో నటిస్తున్న 'ఎల్లమ్మ' రూరల్ బ్యాక్‌‌డ్రాప్‌‌లో సాగే కథ. కొన్ని పాటలతో పాటు  ఫ్లాష్‌‌బ్యాక్ ఎపిసోడ్‌‌కు బ్యాక్‌‌గ్రౌండ్ స్కోర్  కంపోజ్ చేశా. మ్యూజిక్, నటన విషయంలో పక్కా ప్లానింగ్‌‌తో వెళ్తున్నా. 

‘‘కొన్నేళ్ల క్రితం పవన్‌‌ కళ్యాణ్‌‌ గారితో సింగీతం గారు జీసస్‌‌పై ఓ సినిమా ప్లాన్ చేశారు.  కొన్ని కారణాల వల్ల అది జరగలేదు. ఆ టైమ్‌‌లో సింగీతం గారు ‘సింగ్‌‌ గీతం’ స్టోరీ ఐడియా చెప్పారు. వినగానే థ్రిల్‌‌గా అనిపించింది. అదే సినిమాకు నేను ఇప్పుడు  వర్క్‌‌ చేయడం సంతోషంగా ఉంది” అన్నారు దేవిశ్రీ ప్రసాద్. దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సినిమా విశేషాల గురించి ఇలా మాట్లాడారు.